Rajasthan Politics : రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయం, సీఎం పీఠం దక్కెదెవరికి?
Rajasthan Politics : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో అశోక్ గెహ్లాట్ నిలవడంతో రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈసారైనా సచిన్ పైలెట్ కు సీఎం పీఠం దక్కుతుందా? అనే చర్చ జరుగుతుంది.
Rajasthan Politics : ఈసారైనా ఆ పదవి దక్కుతుందా? లేదంటే మళ్లీ ఎప్పటిలాగానే చివరినిమిషంలో నిరాశపరుస్తారా? ఇప్పుడిదే రాజస్థాన్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉండటంతో ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ రాజస్థాన్ సీఎం పీఠంలో కూర్చొంటారా లేదా అన్నదానిపై ఇప్పుడందరీ చూపు ఉంది. ఇంతకీ రాజస్థాన్ సీఎం రేసులో సచిన్ కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు? ఈసారైనా రాహుల్ మాట నిలుస్తుందా? లేదంటే కాంగ్రెస్ కురువృద్ధుల రాజకీయమే గెలుస్తుందా? వేచిచూడాలి.
రెండు రాష్ట్రాల్లోనే అధికారం
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ అవసాన దశకు చేరింది. బీజేపీ దాటికి అధిక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ప్రస్తుతం రెండే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందులో ఒకటి ఛత్తీస్ గఢ్ కాగా ఇంకొకటి రాజస్థాన్. బీజేపీ పాలనలో ఉన్న రాజస్థాన్ ను కాంగ్రెస్ హస్తం గతం చేసుకుంది. మెజార్టీతో పార్టీని గెలిపించిన ఘనత సచిన్ పైలెట్ దే అని కాంగ్రెస్ పెద్దలే కాదు ఆ రాష్ట్ర నేతలు సైతం ఒప్పుకుంటారు. అందుకే సచిన్ కే సీఎం పదవి కట్టబెడతారని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ ఎప్పటిలాగానే కాంగ్రెస్ లోని సీనియర్ల సలహాతో తీవ్ర లాభియింగ్ చేసుకోవడంతో మళ్లీ అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి పార్టీలో సచిన్ ఫైలెట్ వర్సెస్ గెహ్లాట్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సచిన్ పార్టీ తీరుపై అసహనంతో ఉన్నట్లు బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. తన మద్దతుదారులతో కలిసి కాషాయం కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు హడావుడి చేయడంతో కాంగ్రెస్ అధిష్టానంలో కదలిక వచ్చింది. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు సచిన్ కి ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి శాంతింప చేసినా ఇంకా సీఎంతో ఉన్న విభేదాలు మాత్రం దూరం కాలేదు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అధ్యక్ష పీఠానికి ఎన్నిక జరగబోతోంది. ఈసారి రాహుల్ గాంధీతో పాటు సోనియా, ప్రియాంక సైతం అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపకపోవడంతో 25 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి హస్తం పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారు. ఈ కీలకమైన పదవిని అందుకోగల సమర్థుల్లో అశోక్ గెహ్లాట్ ఒకరిని పార్టీ పెద్దలు భావించారట. అందుకే ఆయన్ను ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా సోనియా సైతం చెప్పడంతో ఆయన అధ్యక్ష రేసులో నిలబడుతున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం పదవిని వదులు కోవడానికి ఆసక్తిచూపడం లేదని తెలుస్తోంది. ఇటు ముఖ్యమంత్రి అటు పార్టీ అధ్యక్షపదవి రెండు అంటే కుదరదని ఇంతకు ముందే రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో గెహ్లాట్ ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న ఆయన్ను కలిసేందుకు సిద్ధమయ్యారు.
పైలెట్-గాంధీ కుటుంబాల మధ్య సంబంధాలు
బుధవారం ఢిల్లీకి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత అశోక్ గెహ్లాట్ రాహుల్ గాంధీని కలిసి రాజస్థాన్ రాజకీయాలపై చర్చించనున్నారట. అక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్లి షిర్డీ సాయి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు. మరోవైపు ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలవడంతో రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవేళ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే ఉపముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలెట్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలోని చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు బహిరంగంగానే సచినే ముఖ్యమంత్రి అవుతారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైలెట్-గాంధీ కుటుంబాల మధ్య ఉన్న సత్ససంబంధాలతో ఈసారి సచిన్ కి రాజస్థాన్ సీఎం అవ్వడం ఖాయమంటున్నారు
సచిన్ పైలెట్ కు అవకాశం
కానీ సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం సచిన్ కి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారట. స్పీకర్ సీపీ జోషి వైపు మొగ్గుచూపుతున్నారని సమాచారం. ఇంతకుముందు జోషి పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా గెహ్లాట్ జోషికి మధ్య సత్ససంబంధాలు ఉండడంతో సీఎం రేసులో జోషి పేరు కూడా వినిపిస్తోంది. లేదా ప్రస్తుత పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు గాంధీ కుటుంబానికి పైలెట్ కుటుంబానికి ఉన్న బంధంతో సచిన్ ఈ సారి భారీ ఆశలే పెట్టుకున్నారు. భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీతో ఉన్న సచిన్ పైలెట్ హుటాహుటిన జైపూర్ వచ్చేశారు. అధిష్టానం కూడా అధ్యక్ష ఎన్నికలు, ముఖ్యమంత్రి మార్పు జరిగే వరకు జైపూర్ లోనే ఉండమని ఆదేశించిందంట.
రాజస్థాన్ అసెంబ్లీకీ ఎన్నికలు
మరో వైపు 14 నెలల్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత రాజస్థాన్ బడ్జెట్ సమావేశాలు అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో సీఎం పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో అదే జరిగితే సరిగ్గా 10 నెలల ముందు సీఎం మారిస్తే ప్రయోజనం ఉంటుందా? అనే అనుమానాం వస్తోంది. రాబోయే ఎన్నికల ముందు ఎందుకీ ప్రయోగాలని సొంతపార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇక ఈసారైనా కాంగ్రెస్ అధిష్టానం సచిన్ కి అవకాశం ఇస్తుందా లేదంటే వృద్ధ రాజకీయమే గెలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన
కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చినందువల్లే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అన్నా చెల్లెళ్లు ఇంటిని చక్కదిద్దే పనిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరు రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కేవలం రెండే రాష్ట్రాల్లో ఒకటి రాజస్థాన్, మరొకటి చత్తీస్ ఘడ్. కాంగ్రెస్ ప్రయోగాలు ఫలిస్తాయో లేదో.రాహుల్ , సోనియాలతో చర్చలు అనంతరం గెహ్లాట్ రాజస్థాన్ సీఎం ఎవరన్నది అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.