Operation Sindhur: చెప్పినట్టే ప్రతీకారం తీర్చుకున్న భారత్- పాకిస్థాన్‌కు మరోసారి కాళరాత్రే
Operation Sindhur: పహల్గామ్ దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక పంపించారు. ఒక్కొక్కర్ని వెతికి మరీ చంపుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రూవ్ చేశారు.

Operation Sindhur: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. దాడి జరిగిన తర్వాత బిహార్‌లో ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగానే వారి స్థావరల్లో వారికి సమాధి కట్టేశారు. కొన్ని రోజుల నుంచి పక్కా సమాచారాన్ని సేకరించి ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసింది భారత్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సాయుధ దళాలు దాడులు చేశాయి.
రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో- పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించాయి, అక్కడి నుంచి భారతదేశంపై ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేశారు. మొత్తం తొమ్మిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా ఏమి చెప్పింది?
ప్రకటనలో" మా చర్య కేంద్రీకృతమైంది. కచ్చితమైంది. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. స్థావరాల ఎంపిక, వాటిని నాశనం చేసిన విధానంలో భారతదేశం చాలా సంయమనం పాటించింది. అని వెల్లడించింది.
25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించిన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతి చర్యగానే ఈ చర్యలు తీసుకున్నాం. ఈ దాడికి బాధ్యులను శిక్షిస్తామనే మా నిబద్ధతను నెరవేరుస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. 'ఆపరేషన్ సిందూర్' గురించి వివరణాత్మక సమాచారం తరువాత ఇస్తామని పేర్కొంది.
దాడి జరిగిన తర్వాత మోదీ ఏమన్నారంటే?
పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత బిహార్‌లో మొదటి బహిరంగ ప్రసంగంలోమాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మధుబనిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, న్యాయం జరుగుతుందని, దాడి వెనుక ఉన్నవారిని వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి ప్రతిజ్ఞ చేశారు. ఎవరి పేరు చెప్పకుండా, "మిట్టి మే మిలనే కా సమయ్ అగాయ హై" (వారిని దుమ్ము దులిపే సమయం ఆసన్నమైంది) అని హిందీలో అన్నారు.
"ప్రతి ఒక్కరూ విచారంగా ఉన్నారు... కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు బాధ ఒకేలా ఉంది. బిహార్ నేల నుంచి మాట ఇస్తున్నాను. ప్రతి ఉగ్రవాదిని, వారికి మద్దతు ఇచ్చేవారిని గుర్తించి శిక్షిస్తుందని మొత్తం ప్రపంచానికి చెబుతున్నాను. మేము వారిని చావు వరకు వెంబడిస్తాము. భారతదేశం స్ఫూర్తి ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. న్యాయం జరిగేలా చూసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. మొత్తం దేశం ఈ సంకల్పంలో దృఢంగా నిలుస్తుంది. మానవత్వాన్ని విశ్వసించే వివిధ దేశాల ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అని హెచ్చరించారు.





















