(Source: ECI/ABP News/ABP Majha)
Central Cabinet : మూడో తేదీన కేంద్ర కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ - మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరగబోతోందా ?
కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణకు ప్రధాని మోదీ సన్నాహాలు చేస్తున్నారు. మూడో తేదీన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఏర్పాటు చేశారు.
Central Cabinet : కేంద్ర కేబినెట్, బీజేపీలో కొత్త మార్పులు జరగనుననన సూచనలు కనిపిస్తున్నాయి. జూలై 3 సాయంత్రం 4.00కు కేంద్రం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. కేబినెట్ మంత్రులతో పాటు సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కల్గిన సహాయ మంత్రులు కూడా ఈ సమవేశానికి హాజరవుతారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు కోసమే ఈ భేటీ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందు కోసమే బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. మంత్రి వర్గ విస్తరణలో మార్పులు.. పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియమాకం వంటి పలు కీలక అంశాలను చర్చించినట్లుగా సమాచారం.
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చ
ఈ భేటీలో 2023 చివరలో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఆర్గనైజేషన్ లీడర్ బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. అయితే సంస్థలో పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మేధోమథనం తర్వాత ప్రధాని మోదీతో ఈ సమావేశం జరిగిందని, ఇలాంటి పరిస్థితిలో పార్టీలో చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గెలుపే లక్ష్యంగా వ్యూహాల ఖరారు
వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీల గడువు ముగియనుంది. ఈ ఏడాది చవరి నాటికి ఈ ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు.. ఎక్కువగా ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా తరచుగా పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నెలలో రెండు సార్లు ఈ రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నారు. కేంద్రమంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
సంస్థాగతంగానూ బీజేపీలో కీలక మార్పులు
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా భారీ మార్పులు చేయనుంది. దీంతో ఏ క్షణమైనా పార్టీలో మార్పులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. దీంట్లో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ లకు కొత్త బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నట్లుగా సమాచారం. అలాగే పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించనుంది బీజేపీ అధిష్టానం. గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం జరుగనుంది.