PM Modi: ఢిల్లీలో ఎంపీల కోసం 184 ఫ్లాట్లు ప్రారంభించిన ప్రధాని మోదీ, బిహార్ ఎన్నికలు గుర్తొస్తాయని సెటైర్లు
New Flats For MPs In Delhi | ఎంపీల కోసం నిర్మించిన 184 కొత్త ఫ్లాట్స్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు (ఆగస్టు 11న) ప్రారంభించారు. ఇవి ఆధునిక వసతులతో, పెద్దవిగా ఉన్నాయి.

PM Modi inaugurates new flats for MPs in Delhi | న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ఢిల్లీలోని బాబా ఖడక్ సింగ్ మార్గ్ లో ఎంపీల కోసం నిర్మించిన 184 కొత్త టైప్-VII బిల్డింగ్‌లోని ఫ్లాట్‌లను ప్రారంభించారు. ఎంపీలకు ఆధునిక, పర్యావరణ అనుకూలమైన, తగిన నివాసాలను అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంప్లెక్స్‌లో సింధూరం మొక్కను నాటారు, ఆ ఫ్లాట్ల నిర్మాణం చేసిన కార్మికులతో మాట్లాడారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ఈ రోజు పార్లమెంటులోని నా సహచరుల కోసం నివాస సముదాయాన్ని ప్రారంభించే అవకాశం వచ్చింది. వాటిలో 4 టవర్లకు కృష్ణ, గోదావరి, కోసి, హుగ్లీ అని పేర్లు పెట్టారు. ఇవి భారతదేశంలోని నాలుగు గొప్ప నదుల పేర్లు. కొంతమందికి కోసి అనే పేరుతో ఉన్న టవర్ చాలా అసౌకర్యంగా అనిపించవచ్చు. వారు దీనిని నదిగా చూడకుండా బిహార్ ఎన్నికల కోణంలో చూస్తున్నారని అర్థమవుతోంది" అని ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు.
ఆధునిక, సౌకర్యవంతమైన నివాస సముదాయం
ప్రధాని మోదీ ప్రారంభించిన ఫ్లాట్‌ల విషయానికి వస్తే..ఈ కొత్త టైప్-VII నివాస సముదాయం పూర్తిగా స్వయం సమృద్ధిని కలిగి ఉంటుంది. ఇందులో ఎంపీల నివాసాలతో పాటు అధికారిక అవసరాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రాజధాని ఢిల్లీలో ఉండే పరిమిత స్థలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎత్తైన బిల్డింగ్ నిర్మించారు. దాంతో తక్కువ భూమిని ఉపయోగించి ఎక్కువ ఫ్లోర్‌లు నిర్మించి ఎంపీలకు ఫ్లాట్లు నిర్మించాం. దాంతో దీర్ఘకాలంలో నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని మోదీ పేర్కొన్నారు.
ఎంపీలకు అనుకూలమైన ఫ్లాట్‌లు
ప్రతి ఫ్లాట్‌లో దాదాపు 5,000 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉంది. ఈ కొత్త ఫ్లాట్‌లలో కార్యాలయాలు, సిబ్బంది కోసం ప్రత్యేక నివాసాలు, నివాస స్థలం ఉన్నాయి. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫ్లాట్‌లు పరిమాణంలో టైప్-VIII బంగ్లా కంటే పెద్దవిగా ఉన్నాయి. ఇవి ప్రభుత్వ నివాసాలలో బెస్ట్ కేటగిరీగా పరిగణిస్తున్నారు.
సామాజిక, హరిత సాంకేతిక పరిజ్ఞాన సౌకర్యాలు
ఆ బిల్డింగ్ సముదాయంలో ఒక సామాజిక కేంద్రం ఉంది. ఇది ఎంపీల సామాజిక, అధికారిక సమావేశాలకు కేంద్రంగా మారనుంది. భవనంలో హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఇది GRIHA 3 స్టార్ రేటింగ్‌ను పొందింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) 2016కి అనుగుణంగా నిర్మించారు.
భూకంప నిరోధక, సురక్షిత భవనం
అన్ని భవనాలు ఆధునిక నిర్మాణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. భూకంప నిరోధకంగా ఎంపీల ఫ్లాట్‌లను తీర్చిదిద్దారు. ఎంపీలు, వారి కుటుంబ సభ్యుల భద్రత కోసం పటిష్ట భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సముదాయం దివ్యాంగులకు మరీ అనుకూలం. ఇది సమ్మిళిత గృహ రూపకల్పనను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.






















