PM Modi Leave: 9 ఏళ్లలో ఒక్క సెలవూ తీసుకోని ప్రధాని మోదీ, 3 వేల ఈవెంట్లకు హాజరు
PM Modi Leave: 2014లో ప్రధాని అయినప్పటి నుంచి మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
PM Modi Leave: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి వివరించాల్సి వచ్చినప్పుడు చాలా మంది చెప్పేది ఆయన దినచర్య గురించి. రోజులో ఎక్కువ సమయంలో ఆయన విధుల్లోనే ఉంటారని అంటారు. రోజుకు 17 నుంచి 18 గంటలు పని చేస్తారని చెబుతారు. ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయం తాజాగా అధికారికంగా స్పందించింది. 2014లో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అంటే గత 9 ఏళ్లుగా మోదీ ఒక్కటంటే ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయమే చెప్పుకొచ్చింది.
సమాచార హక్కు చట్టం కింద పుణేకు చెందిన వ్యవస్థాపక కార్యకర్త ప్రఫుల్ సి సర్దా అడిగిన ప్రశ్నలపై పీఎంవో సమాధానం ఇచ్చింది. 2014 భారత ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పీఎం మోదీ ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారని పీఎంవోను ఆయన అడిగారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం.. ప్రధాని మోదీ 2014 నుంచి ఒక్క సెలవు కూడా తీసుకోలేదని వెల్లడించింది.
ప్రఫుల్ పి సర్దా అడిగిన మరో ప్రశ్నకూ పీఎంవో సమాధానం ఇచ్చింది. పీఎం మోదీ ప్రధానిగా ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు హాజరు అయ్యారని అడగ్గా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 2014 నుంచి భారత దేశంతో పాటు విదేశాల్లో కలిపి ఇప్పటి వరకు 3 వేల కార్యక్రమాల్లో పాల్గొన్నారని పీఎంవో వెల్లడించింది. ఈ మేరకు ఆర్టీఐ చట్టం కింద అడిగిన ప్రశ్నలకు పీఎంవో సమాధానం ఇవ్వగా.. ఆ సమాధానం కాపీని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్ లో పోస్టు చేశారు. 'మై పీఎం, మై ప్రైడ్'(నా ప్రధాని, నాకు గర్వకారణం) అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.
#MyPmMyPride pic.twitter.com/EPpkMCnLke
— Himanta Biswa Sarma (@himantabiswa) September 4, 2023
విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంర్ ఇటీవల ప్రధాన మంత్రి ఎలా పని చేస్తారు అనే దానిపై మాట్లాడారు. ఇటీవల బ్యాంకాక్ లో భారతీయ కమ్యూనిటీ సభ్యులతో సమావేశమైన జైశంకర్.. ప్రధాని పనితీరు గురించి చెప్పుకొచ్చారు. ఇలాంటి కాలంలో ప్రధాని మోదీ వంటి వ్యక్తిని కలిగి ఉండటం భారతదేశ అదృష్టమని భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన మంత్రివర్గంలో సభ్యుడిని కాబట్టి ఈ విషయాన్ని చెప్పడం లేదని కూడా అన్నారు.