PM Modi Donation: బీజేపీకి తన వంతు విరాళం అందించిన ప్రధాని మోదీ, దేశ ప్రజలకు సైతం పిలుపు
Donations For BJP: ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీకి తన వంతు విరాళం అందించారు. దేశ ప్రజలను సైతం వికసిత్ భారత్ కోసం తమ వంతు విరాళం ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు.
PM Modi Donates Rs 2000 to BJP: న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ (BJP)కి విరాళం ఇచ్చారు. రూ.2 వేలను బీజేపీకి ప్రధాని మోదీ తన వంతు విరాళం అందించారు. అనంతరం ఇందుకు సంబంధించిన రశీదును సోషల్ మీడియా వేదికగా మోదీ పంచుకున్నారు. బీజేపీని బలోపేతం చేయడానికి, వికసిత్ భారత్ నిర్మించేందుకుగానూ తన వంతు సాయంగా రూ. 2 వేలు అందించానని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు సైతం తమకు తోచినంత విరాళం అందించాలని పిలుపునిచ్చారు. నమో యాప్ ద్వారా విరాళం అందించాలని కోరారు.
జాతి నిర్మాణం కోసం విరాళాలు అందించండి, వికసిత్ భారత్ ను నిర్మిద్దామని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తాను విరాళం అందించిన ఫొటోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాని మోదీ బీజేపీ పార్టీకి విరాళం ఇవ్వడంతో పాటు, దేశ ప్రజలను సైతం తమ వంతు విరాళం అందించాలని పిలునివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
లోక్‌సభ ఎన్నికలకు తొలి జాబితా విడుదల
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాపై సస్పెన్స్‌కి తెర దించుతూ శనివారం బీజేపీ ఫస్ట్ లిస్ట్‌ని విడుదల చేసింది. 195 అభ్యర్థులతో కూడిన ఈ జాబితాని పార్టీ సీనియర్ నేత వినోద్ తావడే విడుదల చేశారు. బీజేపీ తొలి జాబితాలో మొత్తం 34 మంది మంత్రులున్నారు. అలాగే బీజేపీ హైకమాండ్ 57 మంది ఓబీసీలకు అవకాశమిచ్చింది. యువతకు 47 స్థానాలు కేటాయించినట్టు వినోద్ తావడే తెలిపారు. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు. మొత్తం అభ్యర్థుల్లో 28 మంది మహిళలకు అవకాశమిచ్చారు. బెంగాల్‌లో 20, మధ్యప్రదేశ్‌లో 24, గుజరాత్‌లో 15, రాజస్థాన్‌లో 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలుండగా 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి అనూహ్యంగా మహిళా నేతను రంగంలోకి దింపింది బీజేపీ. డాక్టర్ మాధవీ లతకు కీలకమైన హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఛాన్స్ ఇచ్చారు.