India-Pakistan Tension : భారత్ దాడితో పాక్‌లో భారీ విధ్వంసం, రుజువులతో చూపిస్తున్న విదేశీ మీడియా
India-Pakistan Tension : భారత్‌పై గెలిచాం అని సంబరాలు చేసుకున్నారు. కానీ పాకిస్థాన్ అసలు బాగోతాన్ని టెక్నాలజీ బయటపెట్టింది. ఇది ఇండియా చెబుతున్న విషయం కాదు విదేశీ మీడియా వెల్లడిస్తున్న నిజాలు.

India-Pakistan Tension : భారత్‌ను రెచ్చగొట్టిన పాకిస్థాన్ గట్టి మూల్యమే చెల్లించుకుంది. ఇండో-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆ దేశానికి చాలా నష్టం జరిగినట్టు తాజాగా విదేశీ మీడియా వెలుగులోకి తీసుకొస్తోంది. తమకు ఏం కాలేదని తమ దేశం మీడియాను మేనేజ్ చేసినప్పటికీ ఉపగ్రహఛాయా చిత్రాలు నిజాలు తెలియజేస్తున్నాయి. దీని ఆధారాంగానే విదేశీ మీడియా కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి.
పాకిస్థాన్‌కు భారత సైన్యం చాలా గట్టిగా కొట్టింది. పాకిస్తాన్ దీన్ని ఎంత దాచాలనుకున్నా విదేశీ మీడియా బయటపెడుతోంది. పాకిస్థాన్ అబద్దాలను వెలుగులోకి తీసుకొచ్చింది అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్. ఉపగ్రహ చిత్రాల సహాయంతో భారత వైమానిక దళం చేసిన నష్టంపై కథనాలు రాసింది.
వాషింగ్టన్ పోస్ట్ పోస్టు చేసిన వార్త ప్రకారం శనివారం పాకిస్తాన్‌పై భారతదేశం జరిపిన దాడుల్లో కనీసం ఆరు విమానాశ్రయాల రన్‌వేలు, నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. దశాబ్దాలుగా జరుగుతున్న దాడిలో ఇది అతి పెద్దదాడిగా పేర్కొంది. పాకిస్థాన్ కారణంగానే యుద్ధం వచ్చిందని విదేశీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ చర్యలకు ప్రతిస్పందనగానే భారత్ ఈ దాడి చేసినట్టు విశ్లేషణలు చేస్తున్నారు. పాకిస్థాన్ చేసిన దాడులను కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలియజేసింది.
దాడి తర్వాత జరిగిన రెండు డజనుకుపైగా ఉపగ్రహ చిత్రాలు, వీడియోల్లో పాకిస్థాన్‌కు జరిగిన నష్టాన్ని వివరిస్తున్నాయి. పాకిస్తాన్ వైమానిక దళం ఉపయోగించే మూడు హ్యాంగర్లు, రెండు రన్‌వేలు, రెండు మొబైల్ భవనాలు ధ్వంసమైనట్టు తేలింది. భారతదేశం టార్గెట్ చేసిన లక్ష్యాలు పాకిస్థాన్‌లో 100 మైళ్ళ దూరంలో ఉన్నవే. అందుకే ఈ దాడుల కారణంగా పెద్ద పెద్ద నగరాలకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇంత నష్టం జరిగినప్పటికీ పాకిస్థాన తన దేశ ప్రజలను మభ్యపెడుతోంది. తామే విజయం సాధించామని సంబరాలు చేసుకుంది. తమకు ఎలాంటి నష్టం జరగలేదని కవర్ చేస్తోంది. భారత్‌లోనే చాలా విధ్వంసం జరిగిందని ప్రపంచాన్ని , తమ ప్రజలను నమ్మించే ప్రయత్నంలో ఉంది. కానీ పాకిస్థాన్ అబద్దాలు ఎక్కువ కాలం నిలవలేదు. ఉపగ్రహ ఛాయా చిత్రాలు వారి బాగోతాన్ని బయటపెట్టాయి.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్య చేపట్టింది. సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఉగ్రస్థావరాలను లేపేసింది. కీలకమైన నేతలను హతమార్చింది. మళ్లీ ఉగ్రవాదులు కోలుకోలేని విధంగా బుద్ది చెప్పింది. సైనికులపై చర్యలు తీసుకొని ఉంటే పాకిస్థాన్ ఉరుకునేదో ఏమో కానీ, ఉగ్రస్థావరాలను లేపేయడంతో ఆగ్రహంతో ఊగిపోయింది. భారత్‌లోని కీలకమైన సైనిక స్థావరాలపై టార్గెట్ చేసింది. సరిహద్దుల్లో బీభత్సం సృష్టించే ప్రయత్నం చేసింది. అప్పటి వరకు ఓపికతో ఉన్న భారత్ సైన్యం ఎదురుదాడి ప్రారంభించింది.
భారత్ చేసిన ఎదురుదాడిలో పాకిస్థాన్ పంపించిన డ్రోన్స్, మిసైల్స్‌ను అడ్డుకోవడమే కాకుండా వారి స్థావరాలపై దాడి ప్రారంభించింది. సైనిక, వైమానిక స్థావరాలనే టార్గెట్ చేసుకుంది భారత్ సైన్యం. ఎక్కడా పౌరులకు నష్టం వాటిల్లకుండా కేవలం సైనిక పోస్టులను మాత్రమే టార్గెట్ చేసింది. భారత్ చేసిన దాడిలో ఆ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. జరిగిన నష్టాన్ని గ్రహించిన పాకిస్థాన్ శాంతి చర్చలకు అమెరికా సాయంతో దిగొచ్చింది. కాళ్లబేరానికి రావడంతో భారత్ కూడా కాస్త శాంతించింది.





















