Oscar Elephants Missing: ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఏనుగులు మిస్సింగ్, కేర్ టేకర్ ఏమన్నారంటే!
ఆస్కార్ అవార్డు సాధించిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'లో నటించిన రెండు ఏనుగులు అదృశ్యమయ్యాయి అని వాటి సంరక్షకుడు బొమ్మన్ వెల్లడించారు.
ఆస్కార్ అవార్డు వేడుకల్లో డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' బోణీ కొట్టింది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ పురస్కారం అందుకుని భారతీయులు గర్వపడేలా చేసింది ఈ తమిళ డాక్యుమెంటరీ. అయితే ఈ డాక్యుమెంటరీ వేటిపై తెరకెక్కించారో ఆ ఏనుగులు రెండు అదృశ్యమయ్యాయి అనే వార్త దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేడు భారత్ కు ఆస్కార్ రావడానికి కారణమైన 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' లో ఈ రెండు ఏనుగులదే కీలకపాత్ర. ఆస్కార్ అవార్డు సాధించిన డాక్యుమెంటరీ ఏనుగులు అని సంతోషించేలోపే ఓ షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఈ డాక్యుమెంటరీలో కనిపించిన రఘు, అమ్ము అనే రెండు ఏనుగుల జాడ తెలియడం లేదు.
ఆస్కార్ అవార్డ్ గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'లో నటించిన ఏనుగులు రఘు, అమ్ము ఆదివారం నుంచి కనిపించడం లేదు. కొంతమంది తాగుబోతులను చూసిన ఏనుగులు వారిని తరుముకుంటు అడవిలోకి వెళ్లి అదృశ్యమయ్యాయి అని ఏనుగుల సంరక్షకుడు బొమ్మన్ వెల్లడించారు. కరెంట్ షాక్ పెట్టి తల్లి ఏనుగులను కొందరు చంపేశారు. అనంతరం అనాథలైన ఈ రఘు, అమ్ము అనే ఏనుగు పిల్లలను బొమ్మన్, బెల్లీ అనే దంపతులు తమ సొంత బిడ్డల్లా పెంచారు. కొంతమంది వ్యక్తులను తరుముతూ ఆదివారం కొందరు తాగుబోతులను తరుముతూ ఈ రెండు ఏనుగులు కృష్ణగిరి అడవిలోకి వెళ్లిపోయాయని వాటి సంరక్షకుడు బొమ్మను వివరించారు. ఎంత వెతికినా వాటి జాడ తెలియడం లేదని వాపోయాడు బొమ్మన్.
ఆందోళన చెందుతున్న బొమ్మన్ దంపతులు..
ఎంతో ప్రేమగా పెంచుకున్న ఏనుగులకు ఆస్కార్ రావడానికి ముందురోజు నుంచే వాటి సంరక్షకులైన బొమ్మన్ దంపతులు ఆందోళన చెందుతున్నారు. రెండు ఏనుగులు కొందరు వ్యక్తులను తరుముతూ కృష్ణగిరి అడవిలోకి వెళ్లిపోగా, వాటి కోసం ఎంత వెతికినా జాడ తెలియలేదన్నారు బొమ్మన్. అయితే రెండు ఒకేచోట ఉన్నాయా, వేరు వేరుగా ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగులు కనిపించకపోతే ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసి తమ సొంతూరికి వెళ్లిపోతామని బొమ్మన్ అంటున్నారు. ఏనుగులు, తమపై తీసిన డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికీ తాము ఆ డాక్యుమెంటరీని చూడలేదని బొమ్మన్ తెలిపారు.
ఏమిటీ 'ద ఎలిఫెంట్ విష్పరర్స్'
'ద ఎలిఫెంట్ విష్పరర్స్' విషయానికి వస్తే... రెండు పిల్ల ఏనుగుల కథే ఈ డాక్యుమెంటరీ. ఆ ఏనుగు పిల్లలకు తమిళనాడు అటవీ శాఖ తప్పెకాడు ఎలిఫ్యాంట్ క్యాంపులో పునరావాసం కల్పిస్తోంది. గత 140 ఏళ్లుగా అక్కడి అటవీశాఖ ఇటువంటి పని చేస్తోంది. అనాథ ఏనుగులు పరిసర గ్రామల మీద పడి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, అవి బెంగతో చనిపోకుండా కాడు నాయగన్ అనే ఓ గిరిజన తెగకు వాటిని అప్పగిస్తూ ఉంటారు.
'కాడు నాయగన్' తెగ అడవి జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంది. అటవీ జంతువులు, ఏనుగు పిల్లలను పెంచడంలో ఆ తెగకు తరతరాల వారసత్వం ఉంది. అలా బొమ్మన్, బెల్లీ అనే దంపతులకు రఘు, అమ్ము అనే చిన్న ఏనుగులను పెంచే బాధ్యతను ఫారెస్ట్ ఆఫీసర్స్ అప్పగిస్తారు. వాటిని కుటుంబ సభ్యుల వలే ఎలా పెంచారు? ఆ చిన్న చిన్న ఏనుగు పిల్లలు చేసే చిలిపి పనులు, అల్లరి ఏంటి? బొమ్మన్, బెల్లీతో ఆ ఏనుగులు ఎటువంటి అనుబంధం పెంచుకున్నాయి? అనేది ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కథ.
'ద ఎలిఫెంట్ విష్పరర్స్'లో అద్భుతమైన విషయం... దీని డైరెక్టర్ లేడీ. కార్తికీ గొన్ సాల్వేస్. ఆమె వయసు 37 సంవత్సరాలు. డాక్యుమెంటరీ కోసం ఆమె ఐదేళ్లు కష్టపడ్డారు. తన బృందంతో కలిసి ఐదేళ్ల పాటు ఏనుగులతో జీవించారు. ఇదంతా కథ కాదు నిజ జీవితంలో బొమ్మన్, బెల్లీలు చేసే పనిని ఐదేళ్ల పాటు అందంగా విజువలైజ్ చేశారు. 40 నిమిషాల డాక్యుమెంటరీలో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది.