New GST Rates: అచ్చేదిన్ అన్నారని అధికారమిస్తే, ఇప్పుడు 'బాదుడే బాదుడు'!
New GST Rates: ప్రధాని మోదీ.. అధికారంలోకి వచ్చే సమయానికి గ్యాస్, పెట్రోల్ రేట్లు ఎంత ఉన్నాయి? ప్రస్తుతం ఎలా ఉన్నాయ్ అనే దానిపై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి
New GST Rates: తెలియకుండా బాదడం ఎలా? ఈ మాటని ప్రధాని మోదీని అడిగితే క్లియర్‌గా చెబుతారు? అన్న మాటలు ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సామాన్యులపై మోదీ ప్రభుత్వం తెలియకుండా భారాన్ని వేస్తూనే ఉంది. చూసీ చూడనట్లుగా ఆ భారాన్ని మోస్తూనే ఉన్నారు. సర్లే అంటూ సర్దుకుపోతుంటే మరోసారి భారాన్ని వేసి చేతులు దులిపేసుకుంది కేంద్రం.
పెట్రోల్ బాదుడు
ప్రధాని మోదీ దెబ్బకు సామాన్యులు అల్లాడిపోతున్నారన్న మాట వాస్తమేనన్న టాక్ ఉంది. పెట్రోల్-డీజిల్ ధరలు రోజుకో రేటుతో చెమటలు కక్కిస్తోంది. ఇది చాలదన్నట్లు గ్యాస్ రేట్లని పెంచేసింది. చివరకు వెయ్యి దాటేలా చేసి సామాన్యుడి నడ్డి విరిచిందని సామాన్యుల అవేదన. అంతటితో ఆగితే బాగుండదని ఏకంగా సబ్సిడీనే లేకుండా చేసేసిందని ఘాటుగా విమర్శిస్తున్నారు. సైలెంట్‌గా ఎవరికీ తెలియకుండా గ్యాస్ సబ్సిడీకి మమ అనేసింది.
జీఎస్టీ బాదుడు
ఆ విషయం మర్చిపోకముందే చివరకు పెన్సిళ్లు..పెరుగు వంటి వాటిపైనా జీఎస్టీని పెంచేసింది. ఇక వేటిని మర్చిపోయామా అని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వెతికే పనిలో ఉన్నారట. ఆవిడకి ఆ పని అప్పజెప్పిన మోదీ ఇప్పుడు రైల్వేశాఖపై దృష్టిపెట్టారు. ఇప్పటికే రైల్వేని ప్రైవేటీకరణ దిశగా మార్చుతోంది.
మొదటి ప్రైవేటు ట్రైన్ కూడా పట్టాలెక్కింది. ఇది చాలదన్నట్లు కోవిడ్ పేరుతో ట్రైన్ల ఛార్జీలు, చివరకు ఫ్లాట్ ఫాం టిక్కెట్లను భారీగా పెంచేసిన కేంద్రం ఇప్పుడు రైల్వేలో ఇక సబ్సిడీలుండవని ప్రకటించింది. కోవిడ్ టైమ్ లో ఎత్తేసిన సీనియర్ సిటిజన్ రాయితీని ఇక కొనసాగించేది లేదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో లిఖిత పూర్వక ప్రకటన చేశారు.
రాయతీలు లేవు
పథకాల వల్లే దేశం అభివృద్ధి చెందడం లేదని ప్రధాని మోదీ ఈ మధ్యనే స్పష్టం చేశారు. ఆయన మాటల వెనక ఉన్న ఉద్దేశం అర్థం అయ్యిందా అంటూ విపక్షాలు ఇప్పుడీ విషయాన్ని లేవనెత్తుతున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వాలకు భారం కానీ సబ్సిడీలు ఇప్పుడు మోదీకి ఎందుకు బరువుగా మారుతున్నాయన్నది ఆలోచించాల్సిన విషయమని నిలదీస్తున్నాయి.
సబ్సిడీలకు మంగళం పాడుతోంది. అగ్నిపథ్ వంటి స్కీమ్ లతో యువతకు హ్యాండిచ్చింది. చివరకు ఉద్యోగి కష్టార్జితాన్ని వదల్లేదు. పీఎఫ్ పైనా కేంద్రం వడ్డీని తగ్గించింది. ఇది అది అని లేదు అన్నింటిని ఎత్తేస్తోంది. ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రైవేటు పరం చేస్తోంది. సామాన్యుడి జీవితాన్ని దుర్భరంగా మార్చుతోందని పలు రాజకీయపార్టీలు గొంతు చించుకుంటున్నాయి. అయితే మోదీ సర్కార్ మాత్రం తగ్గెదేలా అంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక రానున్న రోజుల్లో కేంద్రం ఎలాంటి పన్నులు..వేటిపై వేసి సామాన్యుడికి చుక్కులు చూపిస్తోందో అని సోషల్ మీడియాలో కార్టూన్లు, మీమ్స్ బాగా చక్కర్లు కొడుతున్నాయి.