(Source: ECI/ABP News/ABP Majha)
Fact Check : పంజాబ్ కొత్త సీఎం బైక్ దొంగనా ? ఇదిగో నిజం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బైక్ దొంగతనం కేసులో అరెస్టయిన నాటి ఫోటో అంటూ ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు. అందులో నిజం ఎంత ?
ఆమ్ ఆద్మీ పంజాబ్‌లో ఘన విజయం సాధించింది. ఆ పార్టీ తరపున ముందుగానే ఎంపీ భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అప్పట్లోనే ఆయన గుణాగుణాలపై చాలా చర్చ జరిగింది. ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉంటారనే విమర్శలు కూడా వచ్చాయి. చదువును మధ్యలో ఆపేశారని కూడా చెప్పుకున్నారు. అయితే ఆయన బైక్ దొంగ అని ఎక్కడా చెప్పలేదు. ఎవరూ చెప్పుకోలేదు. ఆయనపై అలాంటి కేసు ఉందని కూడా ఎవరికీ తెలియదు. కానీ హఠాత్తుగా గత నాలుగు రోజుల నుంచి భగవంత్ మాన్ పాత ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. రంగు దుస్తులతో ఉన్న ముగ్గురితో కలిసి మోకాళ్ల మీద భగవంత్ మాన్ కూర్చున్న ఫోటో అది. దానికి క్యాప్షన్‌గా బైక్ దొంగతనం కేసులో పోలీసులకు భగవంత్ మాన్ చిక్కినప్పటి ఫోటో అది. ఇంకా ఆ కేసు విచారణలో ఉంది . చార్జిషీట్ పెండింగ్‌లో ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ వార్త విస్తృతంగా సర్క్యూలేట్ అవుతోంది. అయితే నిజానిజాలేంటో వెలికి తీయాలని ఏబీపీ దేశం భావించింది. ఈ మేరకు చేసిన పరిశీలనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
రంగుల దుస్తులతో ఉన్న ఆ పోటోలో ఉన్నది భగవంత్ మానేనని ఏబీపీ దేశం పరిశీలనలో వెల్లడయింది. ఆయన తన ఇద్దరు మిత్రులతో కలిసి ఆ ఫోటో దిగారు. అయితే ఆ ఫోటనూ చూపించి అంటగడుతున్న బైక్ దొంగతనం మాత్రం అబద్దం. భగవంత్ మాన్ వయసులో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నారు. ఆ సందర్భంలో దిగిన ఫోటో అది. అంతే కాదు బైక్ దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేసినప్పటి ఫోటో కాదు. అసలు అలాంటి కేసులేమీ మాన్‌పై లేవు. ఆయనపై 2020లో రాజకీయ పోరాటంలో నమోదైన ఒక్క కేసు మాత్రమే ఉంది. దాన్ని కూడా ఎన్నికల అఫిడవిట్‌లో భగవంత్ మాన్ పేర్కొన్నారు.
ఆ ఫోటోలో భగవంత్ మాన్‌తో పాటు ఉన్న ఇద్దరు ఇప్పటికీ ఆయనకు మిత్రులే. ఒకరు హర్భజన్ మాన్ కెనడాలో సింగర్. మరొకరు కరమ్‌జిత్ ఆన్‌మోల్. ఇప్పటికీ కరమ్‌జీత్ భగవంత్ మాన్‌తో పాటే ఉంటారు. ఆయన ప్రచార వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. అలా ఆయన పెట్టిన ఫోటోనే రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియా నుంచి తీసుకుని పంజాబ్ ముఖ్యమంత్రికి బైక్ దొంగతనం అంటించేశారు.
మొత్తంగా సోషల్ మీడియా అంటేనే ఫేక్ న్యూస్ ప్రపంచం అన్నట్లుగా మారిపోయింది. ఎక్కువ మంది నమ్మేదే నిజం అన్నట్లుగా ఇలాంటి ఫోటోలతో తప్పుడు ప్రచారం చేయడం కామన్‌గా మారింది. ఎన్ని ఫ్యాక్ట్ చెక్‌లు చేసినా అబద్దం జనంలోకి వెళ్లినంత వేగంగా నిజం వెళ్లదు. ఈ లోపే సదరు వ్యక్తుల ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.