CBI Probe Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు, వెల్లడించిన రైల్వే మంత్రి
#CoromandelTrainAccident: ఘోర రైలు ప్రమాదం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోరమండల్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది.
-Railway Board recommends CBI probe On Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోరమండల్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. సీబీఐ సమగ్ర దర్యాప్తుతో ప్రమాదానికి కారణాలు, బాధ్యులెవరో తేలుతుందన్నారు. రైలు ప్రమాదం ఘటనలో ఇప్పటికే 275 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. కొందరి డెడ్ బాడీలను గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగించగా, 170 నుంచి 180 వరకు డెబ్ బాడీలను గుర్తించలేదని, అవి కుళ్లిపోయే అవకాశం ఉండటంతో గుర్తించడం కష్టమేనని కొందరు అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ రైలు ప్రమాదం ప్రపంచ దేశాలను సైతం కలచివేసింది. మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు లూప్ లైన్ లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఆ తరువాత హౌరాకు వెళ్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు.. కోరమండల్ బోగీలను ఢీకొట్టడంతో భారీ విషాదంగా మారింది.
#WATCH | Railway Board recommends CBI probe related to #OdishaTrainAccident, announces Railways minister Vaishnaw pic.twitter.com/X9qUs55fZr
— ANI (@ANI) June 4, 2023
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, పాయింట్ మెషీన్‌లో చేసిన మార్పు వల్ల రైలు ప్రమాదం జరిగిందని బాలాసోర్ జిల్లాలో ప్రమాద స్థలంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ అప్పగించాలని భావిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. రైల్వే బోర్డు తరఫున రైలు ప్రమాదం దర్యాప్తును సీబీఐ చేపట్టాలని సిఫారసు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఎవరైనా బయటి వ్యక్తులు స్టేషన్ మాస్టార్ రూములోకి వెళ్లారా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
ఈ రైలు ప్రమాదానికి గురైన గూడ్స్ రైలులో ఇనుము ఉన్నందున భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని రైల్వే బోర్డు ఆదివారం తెలిపింది. రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యుడు జయ వర్మ సిన్హా మాట్లాడుతూ.. గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదని స్పష్టం చేశారు. గూడ్స్ ట్రైన్ ఐరన్ తీసుకెళ్తుందని, ఈ రైలును అతివేగంగా దూసుకొచ్చి కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్నందున అధిక ప్రభావం చూపిందన్నారు. రైల్వే అధికారులు శనివారం మధ్యాహ్నం వరకు మరణాల సంఖ్య 288కి చేరుకుందని ప్రకటించారు. కాగా, చనిపోయింది 275 మంది అని, రెండుసార్లు లెక్కించడంతో పొరపాటు జరిగిందని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాదంపై నిపుణులతో కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతే కాదు. దేశవ్యాప్తంగా అన్ని రూట్‌లలోనూ కవచ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను రక్షించాలని ఇందులో ప్రస్తావించారు. విశాల్ తివారి అనే ఓ న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. Automatic Train Protection System కవచ్‌ని తక్షణమే అమలు చేసే విధంగా కేంద్రానికి మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని సుప్రీకోర్టుని విజ్ఞప్తి చేశారు.