Nitish Kumar: నితీష్ కుమార్ వింత ప్రవర్తన.. హావభావాలపై తీవ్ర చర్చ, ఆయనకు ఏమైందంటూ ప్రశ్నలు
తన హావభావాలు, ప్రవర్తనతో కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

తన హావభావాలు, ప్రవర్తనతో కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు శనివారం జరిగిన ఓ వర్చువల్ కార్యక్రమంలో ఆయన హావభావాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఐటీఐ టాపర్ల కోసం దేశవ్యాప్తంగా జరిగే నైపుణ్య స్నాతకోత్సవం Kaushal Deekshant Samaroh 2025లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. రూ. 62,000 కోట్ల నిధులతో యువత-కేంద్రీకృత కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు.
సీఎం ఆరోగ్యం బాగానే ఉందా?
వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ కుమార్ దాదాపు ఒక నిమిషం పాటు చేతులు ముడుచుకుని కూర్చుని కనిపించారు. ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలను వ్యాఖ్యాత చదువుతుండగా.. నితీష్ తన చేతులను ఒకదానికొకటి పట్టుకుని కూర్చున్నారు. కొద్దిగా కదిలించి పక్కకు చూశారు. అయితే ఆయన ఈ ప్రవర్తన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సీఎం ఆరోగ్యం బాగానే ఉందా అనే చర్చ మళ్లీ మొదలైంది.
సీఎం ప్రవర్తనపై ప్రతిపక్షాల విమర్శలు
ఇటీవల కాలంలో నితీష్ కుమార్ ఆరోగ్యంపై ప్రతిపక్ష నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పదే పదే ప్రశ్నిస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రవర్తనపై రాజకీయ ప్రత్యర్థులు తమ దాడులను తీవ్రతరం చేస్తున్నారు. బహిరంగ కార్యక్రమాల్లో జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రాన్ని నడిపించే ఆయన సామర్థ్యంపై సందేహాలు లేవనెత్తుతున్నాయని వాదిస్తున్నారు.
జాతీయ గీతం వినిపిస్తుండగా మరో వ్యక్తితో కలిసి నవ్వులు
నితీష్ కుమార్ హావభావాలు విమర్శలకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చిలో పాట్నాలో జరిగిన ఒక క్రీడా కార్యక్రమంలో అంతా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో సీఎం మాత్రం మరో వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతూ కెమెరాకు చిక్కారు. దీంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ ముఖ్యమంత్రిని నిశ్చలంగా నిలబెట్టడానికి ప్రయత్నించి ఆయన స్లీవ్‌ను లాగడం కనిపించిన తర్వాత ఈ సంఘటన వైరల్ అయింది.
అధికారిని షాక్‌కు గురిచేసిన సీఎం
మరో కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో వేదిక నుంచి దిగి వెళ్లిన నితీష్ కుమార్ మరో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలతో కరచాలనం చేస్తూ కనిపించారు. మే నెలలో పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఊహించని విధంగా ప్రవర్తించారు. విద్యా శాఖ అధికారి ఎస్.సిద్ధార్థ్ ను షాక్ గురిచేశారు. నితీష్‌కు స్వాగతం పలుకుతూ విద్యాశాఖ అధికారి మర్యాదపూర్వకంగా ఓ మొక్కను అందించగా.. సీఎం ఆ మొక్కను ఆయన తలపై పెట్టడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
#WATCH | Bihar CM Nitish Kumar playfully places a plant on the head of ACS Education and LN Mishra Institute for Social and Economic Change Director Dr. S. Siddharth at an event in Patna. pic.twitter.com/mzvEC3wcwn
— ANI (@ANI) May 26, 2025
తోసిపుచ్చుతున్న మిత్రపక్షాలు
సీఎం ప్రవర్తనతో తీవ్ర వివాదాలు చెలరేగుతుప్పటికీ.. జేడీ(యు), దాని మిత్రపక్షం బీజేపీ మాత్రం ప్రతిపక్షాల వాదనలను తోసిపుచ్చుతున్నాయి. రాజకీయ కుట్ర అని తిప్పికొడుతున్నాయి.
నితీష్ తనయుడి రాజకీయ ఎంట్రీపై చర్చ
ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. నితీష్ కుమార్ తన కుమారుడి రాజకీయ ఎంట్రీ గురించి ఎప్పుడూ బహిరంగంగా ప్రస్తావించకపోయినప్పటికీ.. రాబోయే ఎన్నికల్లో తన తండ్రికి మద్దతు ఇవ్వాలని నిశాంత్ కోరుతున్నారు. తన తండ్రికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.





















