హాజీపూర్లో రోడ్డు ప్రమాదం- ఏడుగురు చిన్నారులు సహా 15 మంది మృతి
సుల్తాన్ పూర్ గ్రామంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రజలు రోడ్డు పక్కన ప్రార్థనలు చేస్తున్న టైంలో ప్రమాదం జరిగింది.
వైశాలి జిల్లాలోని దేశ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. ఈ దుర్ఘటనపై కేంద్ర, బీహార్ ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటించాయి.
ప్రమాదం ఎక్కడ, ఎలా జరిగింది
బిహార్ రాజధాని పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలోని వైశాలి జిల్లాలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రజలు రోడ్డు పక్కన ఉన్న రావిచెట్టు ముందు స్థానిక దేవత 'భూమియా బాబా' పూజల కోసం గుమిగూడారు. ఆ టైంలో ట్రక్ వాళ్లపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే 9 మంది మరణించినట్టు స్థానిక ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ ప్రకటించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మృతి చెందారరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు.
వైశాలి పోలీసు సూపరింటెండెంట్ మనీష్ కుమార్ మాట్లాడుతూ "వివాహాలకు సంబంధించిన ఆచారం ప్రకారం ఓ వ్యక్తి పెళ్లి కోసం గ్రామస్తులు ఊరేగింపుగా ఇక్కడకు చేరుకున్నారు. రావి చెట్టు వద్ద పూజలు చేస్తున్నారు. ఆ టైంలోనే మహ్నార్-హాజీపూర్ హైవేపై ట్రక్కు నడుపుతున్న డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాళ్లపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ కూడా ఆ బండి క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు.
విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీవిచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఇస్తారు.
President condoles loss of lives in Bihar's Vaishali accident, PM Modi announces ex-gratia of Rs 2 lakh
— ANI Digital (@ani_digital) November 20, 2022
Read @ANI Story | https://t.co/t9zSNWor68#Bihar #Vaishali #ACCIDENT #PMModi #DroupadiMurmu #NitishKumar pic.twitter.com/5jcMfIQEaa
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారందరికీ సరైన చికిత్స అందించాలన్‌నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తేజస్వి యాదవ్ కూడా హాజీపూర్‌లో జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. 'హాజీపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలా మంది చనిపోయారనే హృదయవిదారక వార్త నన్ను కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. చనిపోయినవారికి దేవుడు శాంతిని, వారి కుటుంబాలకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించుగాక." అని అన్నారు.
సివిల్ సర్జన్ కనిపించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం
Bihar CM Nitish Kumar expresses his deepest condolences to the families who lost their loved ones in a road accident in Vaishali. CM also gave instructions to give ex-gratia grants to family members as per standard procedure & gave instructions for treatment of the injured: CMO pic.twitter.com/ftU7GfbKWZ
— ANI (@ANI) November 20, 2022
జిల్లాలో ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత సదర్ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ కనిపించకపోవడంతో ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలుసుకున్న ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ ఘటనా స్థలానికి చేరుకుని సివిల్ సర్జన్‌కు ఫోన్ చేశారు. ఘటన జరిగి గంటన్నర గడిచినా సివిల్ సర్జన్ జిల్లా ఆసుపత్రికి చేరుకోలేదు. సివిల్ సర్జన్ వచ్చిన తర్వాత ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్, సివిల్ సర్జన్ అమరేంద్ర నారాయణ్ మధ్య వాగ్వాదం జరిగింది.