చెట్లను కమ్మేసిన వేలాది గబ్బిలాలు, వణికిపోతున్న ప్రజలు - కేరళలో నిఫా గుబులు
Nipah Virus in Kerala: కేరళలో ఓ గ్రామంలో చెట్లకు వేలాది గబ్బిలాలు వేలాడుతుండటం కలవర పెడుతోంది.
Nipah Virus in Kerala:
కేరళలో నిఫా గుబులు..
మొన్నటి వరకూ కరోనా భయంతో వణికిపోయాయి ప్రపంచ దేశాలు. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు కుదుట పడుతున్నాయి. ఎక్కడో ఓ చోట తప్ప కేసులు నమోదు కావడం లేదు. ముఖ్యంగా భారత్‌లో కేసులు తగ్గిపోయాయి. ఊపిరి పీల్చుకునే లోపే ఇప్పుడు మరో వైరస్ వెంటాడుతోంది. వైరస్‌లకు హబ్‌గా మారిపోయిన కేరళలో మరోసారి నిఫా వైరస్ (Nipah Virus) వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కొజికోడ్‌లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ పరిసర ప్రాంతాల్లో కంటెయిన్మెంట్ జోన్‌లను ప్రకటించింది ప్రభుత్వం. నిఫా టెస్ట్‌ల కోసం ప్రత్యేకంగా మొబైల్ వెహికిల్‌నీ ఏర్పాటు చేసింది. కర్ణాటక, రాజస్థాన్ అప్రమత్తమయ్యాయి. ఎవరూ కేరళకు వెళ్లొద్దని ఆదేశించాయి. కొజికోడ్ ప్రజలు మాత్రం కరోనా నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందోనని భయపడుతున్నారు. ఇలా ఆందోళన చెందుతున్న క్రమంలోనే వాళ్లను మరింత భయపెట్టే దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొజికోడ్‌లోని కరుణాపురం గ్రామంలో 15 ఎకరాల మేర పెద్ద పెద్ద చెట్లున్నాయి. స్వచ్ఛమైన గాలినిచ్చే ఆ చెట్లను చూస్తేనే అక్కడి ప్రజలు కలవర పడుతున్నారు. అందుకు కారణం...ఆ చెట్లకు కాయలు, పండ్ల కన్నా ఎక్కువగా గబ్బిలాలే ఉండటం.
లక్ష గబ్బిలాలు..?
సాధారణంగా ఆ ప్రాంతంలో గబ్బిలాలు చెట్లపైకి (Fruit Bats) వచ్చి చేరుతుంటాయి. కానీ...ఈ ఏడాది జులై నుంచి వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది. మొత్తం చెట్లను కమ్మేస్తున్నాయి. ఈ జులై నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల గబ్బిలాలు ఆ చెట్లపై వాలుతున్నాయి. అక్కడే ఉంటున్నాయి. అంతే కాదు. కాఫీ తోటల్ని, యాలకుల మొక్కల్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. చెట్లకు కాసిన పండ్లను, కాయల్ని కొరికేస్తున్నాయి. ఈ భయంతో అక్కడ ఒక్క చెట్టువైపు కూడా చూడడం లేదు స్థానికులు. పొరపాటున కూడా అక్కడ కాసిన పండ్లను కోసి తినడం లేదు. అసలే నిఫా వైరస్ వ్యాప్తి చెందుతోంటే...ఇలా వేల సంఖ్యలో గబ్బిలాలు వచ్చి చేరడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓపెన్ ట్యాంక్‌లతో పాటు చెరువులు, కుంటలు, బావులు..ఇలా నీరు దొరికే ప్రతి చోటా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ నీటిలో గబ్బిలాల వ్యర్థాలు ఉండే అవకాశముందని, వాటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని అవగాహన కల్పిస్తున్నారు. పండు కనిపించిందంటే చాలు వాటిని కొరికి పెడుతున్నా గబ్బిలాలు. అయితే...ఈ గబ్బిలాలను వెళ్లగొట్టేందుకు స్థానికులు బాంబులు పేల్చాలని చూశారు. అధికారులు అందుకు ఒప్పుకోలేదు. అలా చేస్తే అవి చెల్లాచెదురై వాటి వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్లే ప్రమాదముందని చెప్పారు. ఆ చెట్లను సంరక్షిస్తూనే గబ్బిలాలను అక్కడి నుంచి తోలే ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ పరిసర ప్రాంతాల్లో కనీసం లక్ష వరకూ గబ్బిలాలు ఉండొచ్చని చెప్పారు. ఈ లెక్కలు స్థానికులను ఇంకాస్త కలవర పెడుతున్నాయి.
Also Read: J&K Firing: జమ్ముకశ్మీర్‌లో మరో జవాను మృతి-కొనసాగుతున్న ఆపరేషన్