NIA FIR On Dawood: భారత్‌లో వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలే టార్గెట్‌గా ఉగ్రదాడులకు దావూద్ ప్లాన్, ఎన్‌ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు
ఢిల్లీ, ముంబయిలో నివసిస్తున్న ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను డీ కంపెనీ టార్గెట్ చేసుకున్నట్టు ఎన్‌ఐఏ వెల్లడించింది.
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) మళ్లీ యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న దావూద్ ఇప్పుడు భారత్‌పై గురి పెట్టినట్టు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవలే ఏర్పాటు చేసిన స్పెషల్ యూనిట్ ద్వారా భారత్‌లో పేలుళ్లకు కుట్రపన్నాడని తేలింది. గ్యాంగ్ విస్తరించి అల్లకల్లోలం సృష్టించాలని ప్లాన్ చేశాడని పేర్కొంది.
దీనిపై సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ(NIA) దర్యాప్తు షురూ చేసింది.ఫిబ్రవరి 7న కేసు రిజిస్టర్ చేసింది. దావూద్ ఇబ్రహీం సహా అనుమానితులపై కేసులు నమోదు చేసింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టిది.
దిల్లీ, ముంబైలో నివసిస్తున్న బడా పొలిటికల్ లీడర్స్, పెద్ద పారిశ్రామికవేత్తలే టార్గెట్‌గా కుట్ర పన్నుతున్నట్టు ఎన్‌ఐఏ తన ఫిర్యాదులో పేర్కొంది. వాళ్లందరిపై డి-కంపెనీ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. వారి కార్యకలాపాలు, రాకపోకలు, టూర్‌లపై ఆరా తీసినట్టు కూడా పేర్కొంది.
భారత్‌లో ఏర్పాటు చేసిన గ్యాంగ్‌లను విస్తరించి భారత్‌లో అలజడి సృష్టించాలని డీ గ్యాంగ్ ప్లాన్. తన మనుషుల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించాలని స్కెచ్. భారతదేశమంతటా బాంబు పేలుళ్లతో బీభత్సం సృష్టించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని వాళ్ల ప్రధాన ఉద్దేశం.
దావూద్ ప్లాన్లను ముందే పసిగట్టిన ఎన్‌ఐఏ డి-కంపెనీ కేసులను పర్యవేక్షించడానికి, సమగ్ర దర్యాప్తు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ఎన్‌ఐఏ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో దావూద్ ఇబ్రహీం, అతని సహాయకుల పేర్లు ఉన్నాయని తెలిసింది. చాలా కాలంగా భారత్ అంతటా ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరింపజేసేందుకు దావూద్ ప్రయత్నిస్తున్నాడని ఎన్‌ఐఐ పేర్కొంది.దేశం అంతటా అశాంతిని సృష్టించడానికి తన ఆదేశానుసారం పని చేస్తున్న వారికి ఆర్థిక సహాయం చేయడానికి హవాలా మార్గాల ద్వారా డబ్బును పంప్ చేస్తున్నట్టు కూడా గుర్తించింది.
భద్రతా, దర్యాప్తు ఏజెన్సీలు డి-కంపెనీ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారతదేశం అంతటా అల్లర్లు సృష్టించడానికి వ్యక్తులను నియమించుకున్నారని గుర్తించాయి.
దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలిసింది.
భారతదేశం అంతటా జరిగిన చాలా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో దావూద్ ప్రమేయం గురించి చాలా సమాచారం NIA సేకరించింది. భారతదేశంలో వ్యక్తులను రిక్రూట్ దావూద్ చేస్తున్నాడని, అల్లర్లు సృష్టించడానికి వారికి ఆర్థిక రవాణా సహాయం చేస్తున్నాడని దర్యాప్తు ఏజెన్సీకి తెలిసింది.
డి-కంపెనీ కమ్యూనికేట్ చేయడానికి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగిస్తోంది. వీరిలో కొందరిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుని లోతుగా విచారించింది. కుట్ర ఎలా జరుగుతోందో తెలుసుకుంది.
లభ్యమైన మెటీరియల్స్ ఆధారంగా దావూద్ అండ్ డి కంపెనీపై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.