PM Modi Records: ఇందిరా గాంధీ రికార్డు బద్దలు కొట్టిన నరేంద్ర మోదీ, ఇక మిగిలింది తొలి ప్రధాని నెహ్రూ రికార్డే!
India PM Narendra Modi | ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి అరుదైన ఘనత సాధించారు.

Longest Serving PM of India | న్యూఢిల్లీ: స్వతంత్ర భారతదేశంలో పుట్టిన మొదటి ప్రధాని, ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా ఘనత సాధించిన నరేంద్రమోదీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. రెండుసార్లు మెజారిటీతో గెలిచిన ఏకైక కాంగ్రెసేతర నాయకుడిగా నిలిచిన నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ ఈ రికార్డ్ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరిట ఉండేది. తాజాగా ప్రధాని మోదీ ఈ ఘనత సాధించారు.
ఇందిరా గాంధీ రికార్డు గల్లంతు..
జూలై 25, 2025 న, నరేంద్ర మోదీ భారత ప్రధాన మంత్రిగా 4,078 రోజులు పదవి పూర్తి చేసుకుంటారు. దాంతో జనవరి 24, 1966 నుంచి మార్చి 24, 1977 వరకు ప్రధానమంత్రిగా కొనసాగిన ఇందిరా గాంధీ 4,077 రోజుల రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు. ఇందిరా గాంధీ రికార్డును అధిగమించిన నరేంద్ర మోదీ, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలు అందించిన రెండో నేతగా అవతరించారు.
ప్రధాని మోదీ పేరిట ఎన్నో రికార్డులు
స్వతంత్ర భారతదేశంలో జన్మించిన తొలి, ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. దాంతోపాటు అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన పేరిటే రికార్డు ఉంది. హిందీ మాట్లాడని రాష్ట్రం నుంచి అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని కూడా మోదీనే. రెండు పూర్తి వరుస పదవీకాలాలను పూర్తి చేసిన, రెండుసార్లు మెజారిటీతో తిరిగి ఎన్నికైన తొలి, ఏకైక కాంగ్రెసేతర నాయకుడు నరేంద్ర మోదీ. లోక్‌సభలో సొంతంగా మెజారిటీ సాధించిన ఏకైక కాంగ్రెసేతర నాయకుడుగా నిలిచారు.
నెహ్రూ తర్వాత నరేంద్ర మోదీనే..
1971లో ఇందిరా గాంధీ తర్వాత పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన సిట్టింగ్ ప్రధాని కూడా నరేంద్ర మోదీనే. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో పాటు, వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ఏకైక ప్రధాని మోదీ. దేశంలోని ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులలో, ఒక పార్టీ నాయకుడిగా వరుసగా 6 ఎన్నికల్లో గెలిచిన ఏకైక వ్యక్తి ఆయనే.
నరేంద్ర మోదీ మొదట 2002లో గుజరాత్ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ విజయం సాధించారు. 2014లో ఆయన మొదటిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి విజయం సాధించి భారత ప్రధాని అయ్యారు. 5 ఏళ్లు పూర్తి పదవికాలం పూర్తి చేసుకున్న మోదీ 2019లోనూ ఘన విజయం సాధించారు. 2024లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. మూడోసారి మెజార్టీ రాకపోవడంతో ఏపీలో చంద్రబాబు, బిహార్ లో నితీష్ మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.
పలు దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు
కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించారు. అత్యధిక విదేశీ పర్యటనలు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీనే. పలు దేశాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో ప్రధాని మోదీని సత్కరించాయి. అమెరికా పర్యటనలో సైతం గతంలో ఏ ప్రధానికి లేని క్రేజ్ మోదీ సొంతం చేసుకున్నారు. మోదీ ఛరిష్మా కేవలం మన దేశానికి పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు వినిపించేందుకు మోదీ మార్క్ పాలన కారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.






















