NABARD Introduces JIVA: నేచురల్ ఫార్మింగ్ కోసం "జీవా"ను తీసుకొచ్చిన నాబార్డ్
NABARD Introduces JIVA: నేచురల్ ఫార్మింగ్‌లో నాబార్డు ముందగడు వేసింది. రైతులను ప్రోత్సహించేందుకు జీవా అనే ప్రాజెక్టును తీసుకొచ్చింది.
NABARD Introduces JIVA: ఇటీవలే ప్రభుత్వం నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు బడ్జెట్ 2022లో ప్రవేశ పెట్టింది. మొత్తం వ్యవసాయ సిలబస్‌నే మార్చేస్తున్నట్టు పేర్కొంది. చిన్న, సన్నకారు రైతుకు ప్రయోజకరమైన పద్దతుల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
నాబార్డ్ ముందడుగు
ఆ దిశగానే నాబార్డ్(NABARD) ఓ అడుగు ముందుకేసింది. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో జివా పేరుతో కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఇది అగ్రో ఎకాలజీ బేస్డ్ ప్రోగ్రామ్. ఇప్పటికే నాబార్డ్ పరిధిలో ఉన్న వాటర్ షెడ్ పథకానికి ఇది పొడిగింపు లాంటిది.
ఈ జీవా అనే కార్యక్రమాన్ని ముందుగా 11 రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి దేశవ్యాప్తంగా విస్తరిస్తారు.
జీవాతో సహజ వ్యవసాయానికి జీవం
వాటర్ షెడ్ ప్రోగ్రామ్‌లో భాగంగా వేర్వేరు స్కీమ్‌లను కలిసి తీసుకొచ్చిన కొత్త ప్రాజెక్టే జీవా(JIVA). ఇప్పటికే కంప్లీట్ అయిన వాటర్ షెడ్, దాదాపు పూర్తైన వాటిని ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటారు. 11 రాష్ట్రాల్లో ఐదు జోన్లలోని వర్షాధార ప్రాంతాలను కవర్ చేస్తూ ఈ ప్రాజెక్టు లాంచ్ చేశారు.
ఈ ప్రాంతాల్లో వాణిజ్యవ్యవసాయం అసలు కుదరనే కుదరదు. అందుకే రైతు ఆలోచనల్లో మార్పులు తీసుకొచ్చి, సరికొత్త విధానం వైపు మళ్లించి వ్యవసాయంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సాధించడమే ఈ జీవా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
11 రాష్ట్రాలు.. ఐదు జోన్లు
ఈ ప్రాజెక్టు కోసం నాబార్డ్ హెక్టార్‌కు రూ. 50వేలు అందిస్తుంది.
11 రాష్ట్రాల్లోని 25 ప్రాజెక్టులలో ఐదు వ్యవసాయ పర్యావరణ మండలాలను కవర్ చేస్తుందీ జీవా ప్రాజెక్టు.
"ప్రతి ప్రాజెక్ట్‌లో 200 హెక్టార్లలో ఉత్తమ పద్ధతులు అమలు చేస్తారు. ఈ 200 హెక్టార్ల నుంచి ఆ ప్రాంత ప్రజలు చాలా విషయాలు నేర్చుకుంటారు. మిగతా ప్రాంతమంతా అమలు చేసేలా స్ఫూర్తి పొందుతారు.
అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం
జీవా ప్రాజెక్టు కోసం నాబార్డు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామం కానుంది. ఎందుకంటే స్కిల్, అండ్ నాలెడ్జ్‌తో సాగాల్సిన కార్యక్రమం కాబట్టి పెద్ద సంస్థల సహకారం తీసుకుంటుంది.
నాబార్డ్ ప్రాథమికంగా ఆస్ట్రేలియాలోని కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(CSIRO)తో కలిసి పని చేస్తోంది. ఈ సంస్థ సహజ వ్యవసాయంలో ముఖ్యంగా కావాల్సిన నేల, నీటి నిర్వహణకు సంబంధించి నివేదికలను అందిస్తుంది.
పైలెట్ ప్రాజెక్ట్ ఫలితాలు ఆధారంగా మార్పులు చేర్పులు చేసుకొని దేశవ్యాప్తంగా జీవా ప్రాజెక్టును అమలు చేస్తారు.
వాతావరణ మార్పులు, వ్యవసాయంలో నిలకడైన ప్రగతి, ఫుడ్ సెక్యూరిటీ కోసం జీవా ప్రాజెక్టు చక్కని పరిష్కారమని భావిస్తోంది నాబార్డ్.