Mallojula Venugopal Surrender: మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, 60 మంది మావోయిస్టులు
Maoist Mallojula Venugopal Rao | మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, 60 మంది మావోయిస్టులు

Mallojula Venugopal | గడ్చిరోలి: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ సోను లొంగిపోయారు. దాదాపు 60 మంది తన మావోయిస్టు సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం ఉదయం లొంగిపోయారు. సీఎం ఫడ్నవీస్ చేతికి తన ఆయుధాన్ని సమర్పించారు. ఆయనతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు సమర్పించారు. మావోయిస్టు పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

మహారాష్ట్రలో మావోయిస్టులకు మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వం వహిస్తున్నారు. సాయుధ ఉద్యమం బలహీనపడుతున్న సమయంలో మల్లోజుల 60 మంది సహచర మావోయిస్టులతో కలిసి ఫడ్నవీడస్ సమక్షంలో లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిశారు. ఆయనపై రూ.10 కోట్ల రివార్డ్ సైతం ఉంది. అయితే ఫడ్నవీస్ సమక్షంలోనే లొంగిపోతానని గడ్చిరోలి పోలీసులనుకలిసిన సమయంలో మల్లోజుల కండీషన్ పెట్టారు. దాంతో మహారాష్ట్ర సీఎం ఫడ్నీవీస్ ఎదుట పటిష్ట భద్రత నడుమ మావోయిస్టులను పోలీసులు హాజరుపరిచారు. అనంతరం మల్లోజుల, 60 మంది మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిశారని పోలీసులు ప్రకటించారు.

కొన్ని రోజుల కిందట ఆయుధాలు వీడుతాం, శాంతి చర్చలకు ఆహ్వానించాలని మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లేఖ రాయడం మావోయిస్టుపార్టీలో విభేదాలకు కారణమైంది. కొందరు మావోయిస్టులు మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతించారు. హిడ్మా లాంటి కొందరు టాప్ మావోయిస్టులు మల్లోజుల లేఖను తీవ్రంగా వ్యతిరేకంచారు. దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమనిపేర్కొని, బాధ్యత వహిస్తూ కొన్ని రోజుల కిందట మావోయిస్టు నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వేణుగోపాల్ వైదొలిగారు. ఆయనపై వందల కేసులున్నాయి. పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో అగ్ర జాబితాలో ఉంటారు.

తెలంగాణకు చెందిన మల్లోజుల
పోలీసులు, భద్రతా బలగాలకు మూడు దశాబ్దాలకు పైగా ముచ్చెమటలు పట్టించిన మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణకు చెందినవాడు. పెద్దపల్లి ఆయన స్వస్థలం. మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు మూడో సంతానంగా వేణుగోపాల్ జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తండ్రి వెంకటయ్య చురుకుగా పనిచేశారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు ఉద్యమబాటపట్టారు. చదువు పూర్తిచేసుకున్నాక కోటేశ్వరావు పిలుపు మేరకు అడవిబాట పట్టి ఉద్యమంలో ప్రవేశించారు. అభయ్ అనే పేరుతో మావోయిస్టు పార్టీ తరఫున ఆయన లేఖలు విడుదల చేసేవారు. పార్టీలో ఆయనను భూపతి, వివేక్, అభయ్ అనే పేర్లతో పిలిచేవారని సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టి మావోయిస్టులపై ఉక్కుపాదం మోపడం, కొందరు మావోయిస్టు అగ్రనేతలు ఇదివరకే ఎన్ కౌంటర్లలో చనిపోవడంతో పార్టీలో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యమం బలహీన పడుతోందని, ఆయుధాలు వీడటమే కరెక్ట్ అని మల్లోజుల తన సహచరులతో కలిసి లొంగిపోయి జన జీవన స్రవంతిలోకి వచ్చారు.






















