మణిపూర్‌లో నగ్నంగా మహిళల ఊరేగింపు- పార్లమెంట్‌ను కుదిపేయనున్న ఘటన
Manipur Women Naked Parade: మణిపూర్‌లో ఆలస్యంగాా వెలుగు చూసిన అమానుష వీడియో ఇప్పుడు పార్లమెంట్‌ను కుదిపేయనుంది. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
Manipur Women Naked Parade: మణిపూర్‌లో పరిస్థితి అదుపులోకి రాకపోగా భయాన వాతావరణం కనిపిస్తోంది. ప్రజలకు రక్షణ లేదంటూ వస్తున్నా ఆరోపణలు ఊతమిచ్చేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇద్దరి మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహక అత్యాచారానికి పాల్పడిన వీడియో కలవరపెడుతోంది.
రెండు నెలల క్రితం మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై ఓ గుంపు దాడి చేసి నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఈ వీడియో బుధవారం సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ అయింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దారుణం మే 4 నాటిదని పోలీసులు చెబుతున్నారు.
కాంగ్‌పోక్‌పి జిల్లాలోని సైకుల్ పోలీస్ స్టేషన్‌లో ఆ గ్రామ పెద్ద ఈ దుర్ఘటనపై ఫిర్యాదు చేశారని... జీరో ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇది తౌబాల్‌లోని నాంగ్‌పోక్ సెక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని అంటున్నారు.
ఈ భయంకరమైన దాడి వీడియో వైరల్ కావడంతో స్థానిక గిరిజన నాయకుల ఫోరం (ITLF) ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌ను స్పందించాలని అభ్యర్థించింది. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ప్రారంభమైన మొదట్లో ఇలాంటివి చాలా జరిగాయని ఐటీఎల్‌ఎఫ్ సభ్యులు తెలిపారు.
మే 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు దాదాపు 800-1,000 మంది దుండగులు ఆయుధాలతో కాంగ్‌పోక్పి జిల్లాలోని బి ఫైనోమ్ గ్రామంలోకి ప్రవేశించారు. వారు గ్రామంపై విరుచుకుపడ్డారు. ఇళ్లను ధ్వంసం చేసి, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంటసామాగ్రి, బట్టలు, రేషన్, పశువులు, పెంపుడు జంతువులను దోచుకున్నారు.
ఈ దాడులతో గ్రామస్తులు అడవికి పారిపోయారని, వారిని పోలీసులు రక్షించారు. దుండగులు గంపు పోలీసులపై దాడి చేసి వారిని లాక్కెళ్లిపోయారు. మహిళలను వివస్త్రను చేసి ఊరేగించారు. వీళ్ల దాడులకు తాళలేక 56 ఏళ్ల వ్యక్తి అక్కడే మృతి చెందాడు అని గ్రామపెద్ద ఫిర్యాదులో పేర్కొన్నారు.
మణిపూర్‌లో మహిళలను బట్టలు లేకుండా ఊరేగించిన ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ దారుణాన్ని పార్లమెంటులో గట్టిగా లేవనెత్తనున్నాయి. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని ప్రతిపక్షాలు గతంలో పలుమార్లు ప్రశ్నించాయి. ఇప్పుడు తాజా వీడియో బయటకు రావడంతో ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించాయి.
ఈ అంశంపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్రం కూడా సిద్ధమైంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ ఘటనను పూర్తిగా అమానుషమని, దీనిపై ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తో మాట్లాడినట్లు తెలిపారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని, దోషులను శిక్షిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న దాడిని చూస్తూ ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయెన్స్ (INDIA) మౌనంగా ఉండదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ సంఘటనను ఖండించారు.
కుమార్ విశ్వాస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్ దారుణ ఘటనను చూసి దేశం మొత్తం అశాంతితో ఉందని, ముఖ్యమంత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారని విమర్శలు చేస్తున్నారు.