Manipur Violence: రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి నేతలు, మణిపూర్ హింసపై మెమొరాండం
Manipur Violence: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన ఇండియా కూటమి నేతలు మణిపూర్ అల్లర్లపై మెమొరాండం ఇచ్చారు.
Manipur Violence:
రాష్ట్రపతితో భేటీ..
ఇండియా కూటమికి చెందిన 21 మంది నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ నేతలు మణిపూర్ అంశంపై రాష్ట్రపతికి మెమొరాండం అందించారు. ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించాలని డిమాండ్ చేశారు. అక్కడి శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకురావాలని మెమొరాండంలో పేర్కొన్నట్టు వెల్లడించారు ఖర్గే. పార్లమెంట్లో ప్రధాని మోదీ ఈ అల్లర్లపై మాట్లాడాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. ఇందులో భాగంగానే...రాష్ట్రపతితో భేటీ అయ్యారు.
"ఇండియా కూటమి తరపున 21 మంది నేతలం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశాం. అక్కడి పరిస్థితేంటో ఆమెకు వివరించాం. ఇదే అంశంపై ఓ మెమొరాండం ఇచ్చాం. మహిళలపై ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చెప్పాం. అక్కడి పునరావాస కేంద్రాలూ సరిగా లేవు. ఇదే విషయాన్ని రాష్ట్రపతికి వివరించాం. మాది ఒకటే డిమాండ్. పార్లమెంట్లో ప్రధాని మోదీ మణిపూర్ హింసపై చర్చించాలి. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా చొరవ చూపించాలి. మా డిమాండ్లను పరిశీలిస్తామని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. "
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
Delhi | I.N.D.I.A. Floor Leaders along with 21 MPs' delegation that visited Manipur met President Droupadi Murmu today to seek her intervention in the matter pic.twitter.com/tgRvweQehR
— ANI (@ANI) August 2, 2023
ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతిని కలవడంపై బీజేపీ మండి పడుతోంది. మణిపూర్‌కి వెళ్లే సమయం ఉన్నప్పుడు పార్లమెంట్లో సరైన విధంగా చర్చించే సమయం లేదా అని అసహనం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ.
"ఇండియా కూటమి నేతలు మణిపూర్‌కి వెళ్లొచ్చు. అందులో తప్పేం లేదు. రాష్ట్రపతిని కలవడంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పార్లమెంట్లో చర్చకు మాత్రం సహకరించడం లేదు"
- సుశీల్ మోదీ, బీజేపీ ఎంపీ
మణిపూర్ పర్యటన..
ఇటీవలి మణిపూర్ పర్యటనలో భాగంగా విపక్ష ఎంపీలు గవర్నర్ అనుసూయ ఉయ్‌కీని కలిశారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో ఆమెతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తీసుకురావాలని మెమొరాండం ఇచ్చారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో ఏదో ఓ పరిష్కారం చూపించేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్ అనుసూయను కోరారు. మెమొరాండంపై 21 మంది ఎంపీలు సంతకాలు చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీస్‌లను బంద్ చేయడమూ ఎన్నో అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
"మణిపూర్‌లో గత 89 రోజులుగా శాంతిభద్రతలు అదుపులోకి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా పరిష్కారం చూపించేలా మీరు చొరవ చూపించండి. రాష్ట్రంలో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా చూడండి. ఇళ్లు కోల్పోయిన వాళ్లు పునరావాసం కల్పించాలి. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వడంలో పూర్తిగా విఫలమైపోయింది. బాధితులకు న్యాయం చేయడంలో అన్ని విధాలుగా చర్యలు తీసుకోండి. "
- విపక్ష ఎంపీల మెమొరాండం