అవిశ్వాస తీర్మానం బీజేపీని నైతికంగా దెబ్బ తీస్తుందా? విపక్షాల వ్యూహం ఇదేనా?
Manipur Issue: మణిపూర్ విషయంలో బీజేపీని నైతికంగా దెబ్బ తీసేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.
Manipur Issue:
పార్లమెంట్‌లో ఆందోళన..
మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. చర్చకు సిద్ధమే అని కేంద్రం చెబుతున్నా...దీనిపై ప్రధాని మోదీ మాట్లాడాలని పట్టుపడుతున్నాయి విపక్షాలు. ఈ నెల 20న వర్షాకాల సమావేశాలు మొదలు కాగా అప్పటి నుంచి వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. రెండు సభల్లోనూ గందరగోళం నెలకొంది. విపక్షాలు మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్‌ని అందజేయగా...లోక్‌సభ స్పీకర్ దానికి ఆమోదం తెలిపారు. దీనిపై చర్చించేందుకు అంగీకరించారు. అయితే...ఈ అవిశ్వాస తీర్మానంతో మోదీ సర్కార్‌కి వచ్చిన నష్టం పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే...మెజార్టీ ఆ ప్రభుత్వానిదే కాబట్టి. కానీ...ప్రతిపక్షాలు మాత్రం దీన్నే చివరి అస్త్రంగా మలుచుకున్నాయి. మణిపూర్ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ఇది కచ్చితంగా బీజేపీ వైఫల్యమే అని చెప్పేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే...లాభ నష్టాలు పక్కన పెట్టి కేవలం దీన్ని డైరెక్ట్ అటాక్‌గానే భావిస్తున్నాయి. సంఖ్యాపరంగా బీజేపీకి మెజార్టీ ఉన్నప్పటికీ...మోరల్‌గా ఆ పార్టీ ఓడిపోయిందన్న సంకేతాలిస్తున్నాయి. అందుకే...నల్లదుస్తులతో పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నాయి. ఇకపై కూడా ఇదే స్థాయిలో ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌తో సైద్ధాంతిక విభేదాలున్న బీఆర్‌ఎస్ కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి "సై" అంది. కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంతో తమకు సంబంధం లేదని చెబుతున్నా....బీజేపీపై పోరాటంలో అంతా ఒక్కటే అన్న సంకేతమైతే ఇచ్చింది.
వీగిపోయే అవకాశాలే ఎక్కువ..
నంబర్స్ ఆధారంగా చూస్తే...ప్రధాని మోదీ నేతృత్వంలోని NDAకి లోక్‌సభలో 331 మంది సభ్యుల మెజార్టీ ఉంది. ఒక్క బీజేపీకే 303 మంది ఎంపీలున్నారు. INDIA కూటమికి 144 మంది కాగా...ఈ కూటమిలోలేని మిగతా పార్టీల ఎంపీలు 70 మంది ఉన్నారు. అంటే...ఏ విధంగా చూసినా అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మెజార్టీ కోల్పోయినప్పుడు మాత్రమే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సమస్య. అప్పటి వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టమవుతోంది. కానీ...ఆ పార్టీని మోరల్‌గా దెబ్బ తీయడానికి విపక్షాలకు దొరికిన దారి ఇది. అందుకే....ఆ పార్టీ అంత పట్టుదలతో ఉన్నాయి. అవిశ్వాస తీర్మానం నిలబడాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు ఉండాలి. ఇది పాస్ అయిన తరవాత రాష్ట్రపతి దీనిపై చర్చించేందుకు ఒకరోజు సమయం ఇస్తారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మెజార్టీ నిరూపించుకోవాలని రాష్ట్రపతి ఆదేశిస్తారు. ఒకవేళ ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకోలేకపోతే వెంటనే కేబినెట్‌ని రద్దు చేస్తారు. ఇదీ ప్రొసీజర్. కానీ...ప్రస్తుతం ఇదంతా జరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ. NDAని పక్కన పెట్టి చూసినా...ఒక్క బీజేపీ గట్టిగా నిలబడితే చాలు అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది. అందుకే...ఇదంతా విపక్షాల వృథా ప్రయాస అని కొందరు అంటుంటే...రాజకీయ అస్త్రం అని మరికొందరు చెబుతున్నారు. చివరి సమావేశాల్లో రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసిన అంశం హాట్ టాపిక్ కాగా..ఈ సారి మణిపూర్ అంశం తెరపైకి వచ్చింది. అప్పుడంటే "విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు" అని బీజేపీ ఎదురు దాడికి దిగినా ఆ వాదనకు ఓ అర్థముంది. కానీ ఈ సారి ఇదే మాటతో దాడి చేయలేని పరిస్థితుల్లో ఉంది బీజేపీ.
Also Read: Edible Oil Prices: వంటింటి మంట నుంచి ఉపశమనం, ఆయిల్ రేట్లు భారీగా తగ్గాయి!