Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం
Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు మహా కుంభమేళా జరగనుంది. తొలిరోజే భక్తులతో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది.

Holy Dip at Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక 'మహా కుంభమేళా' ప్రారంభమైంది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో నేటి (జనవరి 13) నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద నేటి ఉదయం భక్తుల పుణ్యస్నానాలతో మహా కుంభమేళా ప్రారంభమైంది. ఈ ఏడాది కుంభమేళాకు 400 మిలియన్లకు (40 కోట్లు) పైగా ప్రజలు హాజరవుతారని కేంద్రం అంచనా వేసింది. దేశంలోని నలుమూలల నుంచి, విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి తొలిరోజే కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
45 రోజుల ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా 2025 పున్నమి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. గంగా, యమునా, సరస్వతిల త్రివేణి సంగమం వద్ద సుమారు 1.5 కోట్ల మంది భక్తులు స్నానం చేసే అవకాశం ఉంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు వెళ్లాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆ పవిత్ర గడియలు రానే వచ్చాయి.
#WATCH | Prayagraj | Devotees take holy dip in Triveni Sangam - a scared confluence of rivers Ganga, Yamuna and 'mystical' Saraswati as today, January 13 - Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025 pic.twitter.com/Efe6zetUc4
— ANI (@ANI) January 13, 2025
కుంభమేళాలో ఏర్పాట్లు బాగున్నాయి
ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చిన భక్తులు మీడియాతో మాట్లాడుతూ.. మహా కుంభమేళాలో పాల్గొనే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఆహారంతో పాటు షెల్టర్ కోసం వసతి కల్పించారు. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్లు కూడా బాగున్నాయని చెబుతున్నారు. మరో భక్తుడు మాట్లాడుతూ.. కుంభమేళా ఎక్కడ జరిగినా కచ్చితంగా వెళ్తాం. భారతదేశంలోని ప్రతి పవిత్ర యాత్రలో తాను పాల్గొంటానని అన్నారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన భక్తుడు చున్నీ లాల్ మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసింది. ఇక్కడికి రావడం మంచి అనుభూతి ఇస్తోంది. పవిత్ర స్నానం ఆచరించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
త్రివేణి సంగమం వద్ద భద్రతా ఏర్పాట్లు
దేశంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో పాలు పంచుకునేందుకు భక్తుల భారీ సంఖ్యలో తరలి వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్ రాజ్‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. భక్తులను రక్షించేందుకు అక్కడ NDRF బృందాలతో పాటు ఉత్తరప్రదేశ్ పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. RAF, CRPF బృందాలు సైతం ప్రయాగ్ రాజ్‌లో భక్తుల భద్రత కోసం సేవలు అందిస్తున్నాయి. యూపీ ప్రభుత్వం, కేంద్రం సహకారంతో మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడా సమస్యలు తలెత్తకూడదని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్ర డీజీపిని, ప్రయాగ్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
Also Read: Mahakumbh 2025 : మహా కుంభమేళా మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. దాని చరిత్ర ఏంటో తెలుసా ?






















