Maharashtra News: పదో క్లాసు 10 సార్లు తప్పిన కొడుకు, తాజాగా పాస్ - తండ్రి ఏం చేశాడో తెలుసా?
Tale of Perseverance: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 9 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో మరోసారి పరీక్ష రాశాడు.
Maharashtra 10th Exam Results: పరీక్షలు అంటేనే నేటి విద్యార్థులకు భయం. అందులోను బోర్డ్/ఫైనల్ పరీక్షలు అంటే వణికిపోతారు. పరీక్షలు రాసినా పాసవుతామో లేదోననే భయంతో ఎంతో మంది విద్యార్థులు తమ నిండు జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. అందుకే విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘పరీక్షా పే చర్చ’ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు బదులిస్తూ వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు. అలాగే పరీక్షలు, ఫలితాలు అంటే భయపడేవారికి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి గురించి తెలిస్తే ఔరా అనుకోకుండా ఉండలేరు.
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 9 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయితే అతను ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. ఫెయిల్ అయిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో మరోసారి పరీక్ష రాశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9 సార్లు పరీక్షలు రాశాడు. అన్ని సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడలేదు. ఈ ఏడాది పదో సారి పరీక్షలు రాశాడు. ఈ సారి అతని కష్టం ఫలించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అంతే అతని తండ్రి సంతోషానికి హద్దులు లేవు. కొడుకు పాసయ్యాడనే సంతోషంలో ఊరంతా ఊరేగింపు నిర్వహించాడు. డప్పులు మోగిస్తూ కొడుకుకు శుభాకాంక్షలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని బీడ్ నగరానికి చెందిన కృష్ణ నామ్‌దేవ్ ముండే గత ఆరేళ్లుగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. రాసిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సారి అతని కష్టం వృథా కాలేదు. తాజాగా మహారాష్ట్ర బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో కృష్ణ నామ్‌దేవ్ ముండే ఉత్తీర్ణత సాధించాడు. దీంతో ఆ ఊర్లో పండుగ వాతావరణం కనిపించింది. కొడుకు పాసయ్యాడనే ఆనందంలో కృష్ణ నామ్‌దేవ్ ముండే తండ్రి అతన్ని భుజాల మీద ఎక్కించుకుని గ్రామంలో ఊరేగింపు చేపట్టాడు. డప్పులు కొట్టిస్తూ సంబరాలు చేసుకుంటూ తన కొడుకు పాసయ్యాడని ఊరంతా చెప్పుకొచ్చాడు.
కృష్ణ నామ్‌దేవ్ ముండే తండ్రి నామ్‌దేవ్ ముండే సంతోషం వ్యక్తం చేస్తూ.. తన కొడుకు పదిసార్లు ఫెయిల్ అయినా తన సంకల్పాన్ని వమ్ము చేయలేదని 9 సార్లు ఫెయిల్ అయినా పదో సారి పాసవ్వడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. 2018 నుంచి తన కుమారుడు పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడని, ఈ ఏడాది కృష్ణ చేసిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు. గత ఐదేళ్లలో కృష్ణ 10 సార్లు పరీక్ష రాశాడని, అతని సంకల్పానికి అవకాశం ఇచ్చేందుకు ప్రతిసారి పరీక్ష ఫీజు కట్టానని చెప్పుకొచ్చారు. తొలిసారి పరీక్ష రాసినప్పుడు ఒక్క చరిత్ర సబ్జెక్టు మాత్రమే పాసయ్యాడని, మిగతా ఐదు సబ్జెక్టులు పాసవ్వడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. కఠోర శ్రమతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చని చెప్పడానికి ఇదో ఉదాహరణ అన్నారు.
మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ గత సోమవారం పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 95.81 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. బాలికలలో పోలిస్తే బాలురు 2.56 శాతం ఎక్కువ మార్కులు సాధించారు.i