Wayanad Landslide: వయనాడ్‌లో ఇంకా లభించిన 300 మంది ఆచూకీ - ఆధునిక సాంకేతికతతో గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం
Kerala News: కేరళలోని వయనాడ్ ఇంకా కోలుకోవడం లేదు. ఐదు రోజులుగా సహాయక చర్యలు సాగుతున్నా ఇంకా మూడు వందల మంది ఆచూకి తెలియడం లేదు. వారి కోసం ప్రత్యేక సాంకేతిక ఉపయోగించి వెతకనున్నారు.
Kerala Landslide: ప్రకృతి విపత్తుతో నిర్జీవంగా మారిన కేరళలోని వయనాడ్ ఇంకా కోలుకోలేకపోతోంది. ఐదు రోజులుగా సహాయక చర్యలు సాగుతూనే ఉన్నాయి. శిథిలాలు,బురద తవ్వి తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మూడు వందలకుపైగా డెడ్‌బాడీలను సహాయక బృందాలు గుర్తించాయి. ఇంకా మూడు వందలకుపైగా ప్రజలు కనిపించకుండా ఉన్నారు. వాళ్లంతా ఏమయ్యారనేది ఆశ్చర్యంగా ఉంది.
ఒక్కరోజులో వంతెన నిర్మాణం
ఐదు రోజులుగా దాదాపు 40 సహాయక బృందాలు ఈ వయనాడ్‌లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. మండుక్కై, చూరాల్‌మల, అట్టమాల,నూల్పుజ ప్రాంతాల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో వందల మందిని అధికారులు కాపాడి ఆసుపత్రులకు తరలించారు. ఈ సహాయక చర్యలు మరింత వేగంగా సాగాలని 190 అడుగుల వంతెననే సైన్యం నిర్మించింది. ఈ వంతెన నిర్మాణంతో సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి.
ఇరవై నాలుగు గంటల్లోనే ఈ బైలీ వంత నిర్మించారు. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభించిన నిర్మాణాన్ని గురువారం ఉదయం ఐదున్నరకు పూర్తి చేశారు. మేజర్ జనరల్ వీటి మాథ్యూ, జీవోసీ కర్ణాటక-కేరళ సబ్ ఏరియా సిబ్బింది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇరవై నాలుగు టన్నుల బరువును ఈ బ్రడ్జి మోయగలదు. దీని కోసం నిర్మాణ సామగ్రిని ఢిల్లీ, బెంగళూరు నుంచి తెప్పించారు.
సాంకేతిక వినియోగం
గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది స్నిఫర్ డాగ్స్ తో గాలిస్తున్నారు. దీంతోపాటు రాడార్ డ్రోన్లు, థర్మల్ స్కానర్లు వంటి సాంకేతిక పరికరాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయనున్నారు. సహాయక చర్యల్లో అదనపు దళాలను కూడా ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఇప్పటి వరకు 279 శవపరీక్షలు పూర్తి చేశారు వైద్యులు. ఇంకా గుర్తించిన వారి డెడ్‌బాడీలు ఉన్నాయి. మరోవైపు ఓ ఇంటిశిథిలాల కింద నాలుగు రోజుల నుంచి చిక్కుకుపోయిన ఓ ఫ్యామిలీని సహాయక సిబ్బంది రక్షించింది. వెట్టికున్నిలో హెలికాప్టర్ సహాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు కేరళ వాసులను అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ రోజు ప్రమాదానికి ముందు కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్రం మధ్య వివాదం నెలకొన్న వేళ ఐఎండీ చీఫ్ కీలక ప్రకటన చేశారు.
ఇస్రో ఫొటోలు
విషాదానికి ముందు ఆ తర్వాత జరిగిన విధ్వంసంపై ఇస్రో ఓ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. వయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో సుమారు 86,000 చదరపు మీటర్ల భూమి నాశనమైనట్టు గుర్తించింది. సుమారు 8 కిలోమీటర్ల మేర బురద పేరుకుపోయినట్టు చిత్రాల ద్వారా తెలుస్తోంది. కార్టోశాట్-3 ద్వారా ఈ ఫొటోలు విడుదల చేసింది ఇస్రో. సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తులో కొండచరియలు విరిగిపడ్డాయని ఇస్రో తెలిపింది. కొండచరియల ప్రమాదం 86 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంపై ప్రభావం చూపినట్టు పేర్కొంది.
ఎయిర్ టెల్ ఆఫర్
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఉచిత సేవలు అందించనున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజుకు 1 జిబి ఉచిత డేటాతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు 30 రోజులు గ్రేస్ పిరియడ్ ఇచ్చింది. బిల్లు చెల్లించకపోయినా నెల రోజుల పాటు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. రెండు నెలల ఫీజు కూడా వచ్చే నెలలో చెల్లించాల్సి ఉంటుంది.