Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదం, సుప్రీం కోర్టుకు కర్ణాటక ప్రభుత్వం
Cauvery Water Dispute: తమిళనాడుకు అక్టోబర్ 15 వరకు ప్రతి రోజూ 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఆదేశించింది.
Cauvery Water Dispute: కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ సిఫార్సును కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) శుక్రవారం సమర్థించింది. అక్టోబర్ 15 వరకు తమిళనాడుకు ప్రతి రోజూ 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. అయితే దీనిపై కర్ణాటక న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది. ఈ మేరకు CWMA ముందు రివ్యూ పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది. ఇప్పటికే కావేరీ జలాల వివాదంతో కర్ణాటక మొత్తం రగిలిపోతోంది.
తమిళనాడుకు నీటి విడుదలపై కర్ణాటక సీఎం సిద్ధారామయ్య స్పందించారు. అంతకు ముందు ఆయన సుప్రీం కోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు, మాజీ అడ్వకేట్ జనరల్స్‌లో సమావేశం అయ్యారు. న్యాయపరమైన అంశాలపై చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... కావేరీ రిజర్వాయర్లలో నీటి కొరత ఉందన్నారు. CWMA ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించే స్థితిలో లేదన్నారు. గతంలో తమిళనాడుకు ప్రతిరోజూ 5,000 క్యూసెక్కులు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశిస్తూ CWMA జారీ చేసిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
న్యూఢిల్లీలో జరిగిన CWMA సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం 12.2 టీఎంసీల “బ్యాక్‌లాగ్” నీటిని విడుదల చేయాలని వాదించింది. అక్టోబర్ 15 వరకు ప్రతిరోజూ 12,500 క్యూసెక్కులు విడుదల చేయాలని కోరింది. అయితే CWMA ఆ డిమాండ్‌ను తిరస్కరించింది. పూర్తి స్థాయిలో వర్షం కురిస్తే బ్యాక్‌లాగ్‌ను వాటర్‌ను విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఇక శుక్రవారం కన్నడ సంఘాలు, రైతు సంఘాలు పిలుపునిచ్చిన కర్ణాటక బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. దక్షిణాది జిల్లాలు పూర్తిగా మూతపడ్డాయి. బెంగళూరులో వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బెంగళూరు విమానాశ్రయంలో మొత్తం 44 విమనాలను రద్దు అయ్యాయి.
కర్ణాటక ప్రభుత్వం తీరుపై మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, పలువురు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సిద్దరామయ్య,డీకే శివకుమార్ తమిళనాడు ప్రభుత్వ ఏజెంట్‌లుగా పని చేస్తున్నారని బీజేపీ, జేడీఎస్ విమర్శలు చేస్తున్నాయి. తమిళనాడుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తున్నాయి.
ఏంటీ వివాదం..?
తమిళనాడు, కర్ణాటక మధ్య 200 ఏళ్లుగా కావేరీ నదీజలాల వివాదం కొనసాగుతోంది. 2018లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. కర్ణాటకకు అదనంగా 14.75 TMCల నీళ్లు విడుదల చేయాలని ఆదేశించింది. తమిళనాడు వాటాని అదే స్థాయిలో తగ్గించింది. బెంగళూరు సిటీలో తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు ఉన్న ఒకే ఒక రీసోర్స్ ఈ కావేరి నదీ జలాలే. అంతే కాదు. కర్ణాటకలోని మాండ్యలో వ్యవసాయ భూములకూ ఈ నీరే ఆధారం.
అయితే...దీనిపై రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఇది బయటపడింది. ఇక్కడ రాష్ట్రాల వాదన ఏంటంటే...2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం తప్పనిసరే. కానీ...ఇది సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఏడాది వర్షపాతం 30% మేర తక్కువగా నమోదైంది. అలాంటప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే పాటించాలంటే ఎలా అని కర్ణాటక వాదిస్తోంది. ఈ వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.