కర్ణాటకలో గృహలక్ష్మి స్కీమ్‌కి అనూహ్య స్పందన, 6 రోజుల్లోనే 60 లక్షలకు పైగా అప్లికేషన్‌లు
Gruha Lakshmi Scheme: కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి ఆరు రోజుల్లోనే 60 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి.
Gruha Lakshmi Scheme:
కాంగ్రెస్ గృహలక్ష్మి పథకం..
కర్ణాటక కాంగ్రెస్ అమలు చేయనున్న గృహలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి కారణమైన 5 హామీల్లో ఇదీ ఒకటి. కాంగ్రెస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ హామీపై మహిళలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆరు రోజుల క్రితమే ముఖ్యమంత్రి సిద్దరామయ్య అప్లికేషన్‌ల ప్రక్రియను ప్రారంభించగా...ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో 62 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం అందనుంది. దారిద్ర్య రేఖకు దిగువన, ఎగువన మహిళలందరూ దీనికి అర్హులే. ప్రభుత్వ లెక్కల ప్రకారం...గృహ లక్ష్మికి పథకంతో కోటి 28 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఆగస్టుు 16వ తేదీ తరవాత ఈ ఆర్థిక సాయం అందరికీ అందనుంది.
"గృహ లక్ష్మి పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రారంభించిన ఆరు రోజుల్లోనే 62 లక్షలకుపైగా అప్లికేషన్‌లు అందాయి. వారం రోజుల్లోగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య కోటి 28 లక్షల వరకూ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. సేవ సింధు, చాట్‌బోట్స్, మొబైల్ వన్‌తో పాటు మరి కొన్ని ప్రభుత్వ యాప్‌ల ద్వారా రోజుకు 5-10 లక్షల అప్లికేషన్‌లు అందుతున్నాయి. ఆ డాక్యుమెంట్‌లను మేం పరిశీలిస్తున్నాం. ఎవరెవరు లబ్ధిదారులో త్వరలోనే తేలుతుంది. మహిళలందరికీ ఇదే మా విజ్ఞప్తి. కొంత మంది ఈ అప్లికేషన్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతుంటారు. నకిలీ దరఖాస్తులు తయారు చేస్తారు. ఫేక్ యాప్స్ కూడా ఉంటాయి. వాటితో జాగ్రత్తగా ఉండండి"
- మహిళా శిశు సంక్షేమ శాఖ
సక్సెస్ ఫార్ములా...
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ గృహ లక్ష్మి పథకం చాలా హెల్ప్ అయిందన్నది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి...ఇదే సక్సెస్ ఫార్ములాని వేరే రాష్ట్రాలూ అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల బెంగళూరులో విపక్షాల భేటీ జరిగినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్‌తో ఈ విషయం చర్చించినట్టు సమాచారం. తమ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలు చేయాలని చూస్తున్నట్టు తన మనసులో మాట బయట పెట్టారట దీదీ. ఇప్పటికే వెస్ట్ బెంగాల్‌లో లక్ష్మీ భండార్ పేరుతో ఇలాంటి పథకమే అమలవుతోంది. ప్రతి మహిళకు రూ.5 వేల చొప్పున ఇచ్చే పథకమిది. గోవాలో ఎన్నికలు జరిగినప్పుడూ ఇదే పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది తృణమూల్ కాంగ్రెస్.
అమలు కష్టమేనా..?
కర్ణాటకలో 5 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కి వాటిని అమలు చేయడం కత్తిమీద సామైంది. నిధులు చాలక ఇబ్బందులు పడుతోంది. కొంత మంది ఎమ్మెల్యేల అసహనానికీ ఇదే కారణం. అందుకే...ముఖ్యమంత్రి లేఖ రాసినట్టు ప్రచారం జరిగింది. అదంతా ఫేక్ అని కాంగ్రెస్ కొట్టి పారేసింది. అయితే...ఇప్పుడు ప్రభుత్వం హామీలు నెరవేర్చడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ ఇప్పటికే చాలా సందర్భాల్లో తేల్చి చెప్పారు. కానీ...ఈ సారి మాత్రం ఆయన వ్యాఖ్యల తీరు మారిపోయింది. ఈ సంవత్సరం ఉచిత హామీలను అమలు చేయడం కష్టమే అని స్పష్టం చేశారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతోందని అందుకే ఆ హామీలు నెరవేర్చడం కుదరడం లేదని చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గానూ ఉన్న డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ ఆ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి.
Also Read: Bus Driver: బుర్ఖా లేకుంటే బస్సులోకి నో ఎంట్రీ - బాలికలతో బస్ డ్రైవర్ ఓవర్ యాక్షన్!