Bus Driver: బుర్ఖా లేకుంటే బస్సులోకి నో ఎంట్రీ - బాలికలతో బస్ డ్రైవర్ ఓవర్ యాక్షన్!
Karnataka Bus Driver: కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఓ బస్సు డ్రైవర్ బాలికలను దుర్భాషలాడాడు. బురఖా వేసుకుంటేనే బస్సు ఎక్కనిస్తానంటూ బెదిరించాడు.
Karnataka Bus Driver: కర్ణాటకలో హిజాబ్ అంశం సద్దుమణిగింది. ఇప్పుడు ఎక్కడా హిజాబ్ ధరించడం, ధరించకపోవడంపై ఎలాంటి వివాదాలు చోటుచేసుకోవడం లేదు. అయితే తాజాగా ఓ బస్సు డ్రైవర్ ప్రవర్తించిన తీరుతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఓ బస్సు డ్రైవర్ ప్రవర్తన పట్ల ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలబురగి జిల్లా కమలాపూర్ తాలూకాలోని ఓకలి గ్రామం నుంచి బసవకల్యాణ్ కు బస్సు వెళ్తోంది. అదే బస్సులో పాఠశాలకు వెళ్లేందుకు కొంత మంది విద్యార్థినులు సిద్ధమయ్యారు. అయితే బస్సు ఎక్కుతున్న ఆ విద్యార్థినులను ఆ బస్సు డ్రైవర్ అడ్డుకున్నాడు. బస్సు ఎక్కే ముందు ముస్లిం బాలికలు అందరూ బురఖాలా ధరించాలని డిమాండ్ చేశాడు.
ముస్లిం విద్యార్థులకు బురఖాలు మాత్రమే ఆమోదయోగ్యమని పేర్కొన్నాడు. అలాగే అందులో కొంత మంది విద్యార్థులు హిజాబ్ ధరించగా.. వారిని కూడా బస్సు ఎక్కేందుకు ఆ డ్రైవర్ నిరాకరించాడు. మీరు ముస్లిం అయితే బురఖా మాత్రమే ధరించండి, హిజాబ్ కాదు, అప్పుడే మిమ్మల్ని బస్సు ఎక్కనిస్తా అంటూ ఆ డ్రైవర్ బాలికలపై దుర్భాషలాడాడు. తమ మతం గురించి ఆ బస్ డ్రైవర్ ప్రశ్నించాడని, బురఖా ధరించాలని పట్టుబట్టాడని ఓ బాలిక చెప్పుకొచ్చింది. బురఖా వేసుకునేందుకు అంగీకరించకపోవడంతో వారిని ఆ బస్సు డ్రైవర్ దూషించాడని, బస్సు ఎక్కకుండా తరిమికొట్టాడని మరో బాలిక పేర్కొంది. ఆ బస్సు డ్రైవర్ తీరును ఇతర ప్రయాణికులు నిలదీశారు. తన బస్సు సరైన కండిషన్ లో లేదంటూ ఏదేదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ బాలికలే కావాలని న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపించాడు.
బస్సుల్లో బాలికలకు, మహిళలు ఉచిత ప్రయాణం
కర్ణాటక కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన 5 హామీల్లో ఒకటి శక్తి హామీ పథకం. మహిళలకు ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే ఈ పథకాన్ని కర్ణాటక ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. మహిళల అభ్యన్నతి, ఉపాధి చేసే మహిళల సంఖ్య పెంచడం, చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లే బాలికలకు ప్రయాణం భారం కాకుండా ఉండేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఈ పథకాన్ని తీసుకువచ్చింది. కానీ.. బస్ లలో సీట్‌ల కోసం నానా తంటాలు పడుతున్నారు మహిళలు. 50% సీట్‌లు పురుషులకే కేటాయించి...మిగతా 50% సీట్‌లు మహిళలకు ఉచితం అని మెలిక పెట్టింది ప్రభుత్వం. ఫలితంగా.. కెపాసిటీ కంటే ఎక్కువ మంది బస్ ఎక్కుతున్నారు. పురుషులకూ సీట్ దొరక్కుండా పోతోంది.
బస్‌లో ఫ్రీ సీట్ కోసం బుర్కా వేసుకున్న పురుషుడు
ఇటీవల ఓ వ్యక్తి బుర్కా వేసుకుని బస్‌స్టాప్ లో వెయిట్ చేస్తూ కనిపించాడు. అటుగా వెళ్లే వాళ్లు ఆ వ్యక్తిని చూసి అనుమానంతో నిలదీశారు. అయితే.. ఆ వ్యక్తి కేవలం భిక్ష అడగడానికే ఇలా మారు వేషం వేసుకున్నట్టు బుకాయించాడు. కానీ...స్థానికులు మాత్రం దీన్ని నమ్మలేదు. బస్‌లో ప్రయాణం చేసేందుకు ఇలా మహిళలా బుర్కా వేసుకుని వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా హైలైట్ ఏంటంటే...ఓ మహిళ ఆధార్ కార్డ్ కూడా దగ్గరే పెట్టుకున్నాడు. మొత్తానికి స్థానికులు నిలదీయడం వల్ల అక్కడి నుంచి వెళ్లిపోయాడు.