SI ఒంటిపై సగం యూనిఫాం.. భయంతో పరుగో పరుగు, తరిమిన అధికారులు.. చివరికి..
ఓ ఎస్సైని పట్టుకునేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు రోడ్లపై పరుగులు తీశారు. ఆ ఎస్సై లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయన్ను పట్టుకొనే క్రమంలో ఈ ఘటన జరిగింది.
దొంగల్ని, నేరస్థుల్ని పట్టుకోవడానికి ఎక్కడైనా పోలీసులు పరిగెడుతుండడం రివాజు. కానీ, ఈ ఘటనలో మాత్రం పోలీసునే పట్టుకోవడానికి అధికారులు పరిగెత్తాల్సి వచ్చింది. ఇంతటి ఆసక్తికరమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ని పట్టుకొనేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు పరిగెత్తాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఓ ఎస్సైని పట్టుకునేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు రోడ్లపై పరుగులు తీశారు. ఆ ఎస్సై లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయన్ను పట్టుకొనే క్రమంలో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలోని తుమకూరు నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఎస్సై సగం యూనిఫాంలోనే ఉండగా.. అధికారులను చూసి పరుగు లంకించుకున్నాడు. అయినా అధికారులు ఆ ఎస్సైని దాదాపు కిలోమీటరు దూరం వెంబడించి, ఎట్టకేలకు స్థానికుల సాయంతో పట్టుకున్నారు.
తుమకూరు గుబ్బిన్ తాలుకాలోని చంద్రశేఖర్ పొరా పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఓ కేసు విషయంలో చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. దాన్ని విడిచి పెట్టాలంటే రూ.28 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు స్టేషన్ ఎస్సై సోమ శేఖర్ ఆ పీఎస్‌లోనే ఉన్న కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌ను ఆదేశించాడు. ఎస్సై చెప్పినట్లే కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు ఎస్సైను పట్టుకునేందుకు వల పన్నారు.
ఈ క్రమంలో బుధవారం చంద్రన్న నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటున్న ఆ కానిస్టేబుల్‌ను అవినీతి నిరోధక శాఖ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకోవాలని తనను ఎస్సై ఆదేశించినట్లుగా కానిస్టేబుల్ వెల్లడించాడు. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులు కానిస్టేబుల్‌తోపాటు స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్సై వెంటనే తన యూనిఫాం చొక్కాను అక్కడే చెత్త డబ్బాలో పారేసి, స్టేషన్ నుంచి బయటకు పరుగు లంకించుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు కూడా ఆయన్ను వెంబడించారు. చివరకు స్థానికుల సాయంతో దొరికించుకున్నారు. అనంతరం ఎస్సైని అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కానిస్టేబుల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Also Read: దీపావళి టపాసుల్లో ఫేక్ కంపెనీలు.. 'ABP దేశం' పరిశీలనలో నిజాలు
Also Read: Petrol Rates : తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?
Also Read : పెట్రో రేటు తగ్గింపు సరే.. ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయో తెలుసా?