CJI Justice Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
CJI Oath: దేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
CJI Justice Sanjiv Khanna Oath: భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. సీజేఐగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో నూతన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది మే 13 వరకూ ఈయన పదవిలో కొనసాగనున్నారు.
#WATCH | Delhi: President Droupadi Murmu administers the oath of Office of the Chief Justice of India to Sanjiv Khanna at Rashtrapati Bhavan. pic.twitter.com/tJmJ1U3DXv
— ANI (@ANI) November 11, 2024
#WATCH | Delhi: Justice Sanjiv Khanna took oath as the 51st Chief Justice of India at Rashtrapati Bhavan in the presence of President Droupadi Murmu, PM Narendra Modi and other dignitaries. pic.twitter.com/PbFsB3WVVg
— ANI (@ANI) November 11, 2024
కీలక తీర్పుల్లో భాగస్వామి
న్యూఢిల్లీలో 1960, మే 14న జన్మించిన సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్త్రాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులై.. 2006లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎన్నికల బాండ్లు రద్దు చేయడం, ఆర్టికల్ 370 రద్దు సమర్థించడం వంటి కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. ఈ ఆరేళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు.
తనదైన ముద్ర వేసిన చంద్రచూడ్
భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా రెండేళ్ల పాటు సేవలందించిన జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన ఎన్నో పరివర్తనాత్మక తీర్పులు, గణనీయమైన సంస్కరణలతో భారత న్యాయవ్యవస్థలో తనదైన ముద్ర వేశారు. అయోధ్య భూవివాదం పరిష్కారం, ఆర్టికల్ 370 రద్దు, సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పడం వంటి పలు కీలక తీర్పులు ఇచ్చారు. సుప్రీం న్యాయమూర్తిగా ఎనిమిదేళ్లలో 38 రాజ్యాంగ ధర్మాసనాల్లో భాగస్వామిగా నిలవడం ఆయన మరో ఘనత. సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన 500కు పైగా తీర్పులు ఇచ్చారు. ఒక్క తీర్పులతోనే కాక, న్యాయ విభాగంలో పలు సంస్కరణలు సైతం ప్రవేశపెట్టారు. ఈ - కోర్టుల ప్రాజెక్టులో భాగంగా కోర్డు రికార్డుల డిజిటలీకరణను ప్రోత్సహించారు. న్యాయస్థానంలో కళ్లకు గంతలతో ఉన్న 'న్యాయదేవత' విగ్రహాన్ని సమూలంగా మార్చి చేతిలో కత్తిని తొలిగించి రాజ్యాంగం పెట్టారు.