Joshimath Sinking: ప్రమాదంలో జోషిమఠ్‌లోని జేపీ కాలనీ-30కిపైగా ఇళ్లలో భారీ పగుళ్లు- అన్నీ కూల్చివేస్తామన్న అధికారులు!
సర్వే నిర్వహించి ఎన్ని కట్టడాలు తొలగించాలో సూచించాలని చమోలీ కలెక్టర్‌ను ఆదేశించినట్లు విపత్తు నిర్వహణ కార్యదర్శి రంజిత్ సిన్హా తెలిపారు.
JP Colony Joshimath To Come Down: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందుతోంది. కొన్ని ఇళ్లు, రెండు హోటళ్లకే పరిమితం అనుకున్న సమస్య ఇప్పుడు కాలనీ మొత్తానికి వ్యాపించింది. చివరకు ఆ ప్రాంతంలోని కట్టడాలన్నీ కూల్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జోషిమఠ్‌లోని జేపీ కాలనీని తనిఖీ చేయగా కీలకవిషయాలు వెలుగులోకి వచ్చాయి. నష్టం తీవ్రంగా ఉందని... మరమ్మతులు చేయలేని విధంగా నష్టం జరిగిపోయినట్టు అధికారులు గుర్తించారు. కాలనీలో 30కి పైగా ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. అవి రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రమాదాన్ని గ్రహించిన అధికారులు దెబ్బతిన్న భవనాలను కూల్చివేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
ప్రమాదకర స్థితిలో ఉన్న నిర్మాణాన్ని వీలైనంత త్వరగా తొలగించేలా సంబంధిత అధికారులు, ప్రభుత్వ విభాగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేసి వారిని ఒప్పించేందుకు చమోలీ జిల్లా కలెక్టర్ హిమాన్షు ఖురానా ప్రయత్నాలు ప్రారంభించారు. మౌంట్ వ్యూ, మలారి ఇన్ హోటల్ తరహాలో ఈ కాలనీని కూడా కూల్చివేయబోతున్నారు.
ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ అథారిటీ కార్యదర్శి రంజిత్ కుమార్ సిన్హా తన బృందంతో కలిసి జోషిమఠ్ అవతలి వైపు ఉన్న హాథీ పర్వత్ కు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. కొండచరియలు విరిగిపడటంతో జేపీ కాలనీలోని ఒక చివర తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇప్పటికే గుర్తించారు. కాలనీ కింద నుంచి నీరు ప్రవహిస్తోందని కూడా గమనించారు. కాలనీ నుంచి ఎన్ని ఇళ్లు తొలగించాలన్న అంశంపై అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా దెబ్బతిన్న ఇళ్లు గుర్తించి... తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జోషిమఠ్‌లో పగుళ్లు ఉన్న ఇళ్ల సంఖ్య 849కి చేరింది. వీటిలో 165 ఇళ్లు నివాసానికి పనికి రావని ఎప్పుడైనా కూలిపోవచ్చని అధికారులు తేల్చారు. కొత్త ఇళ్లలో పగుళ్లు కనిపించలేదని రంజిత్ సిన్హా తెలిపారు. ఇప్పటికే కనిపించని పగుళ్లు 1 నుంచి 2 మిల్లీమీటర్లు పెరుగుతున్నట్టు తెలిపారు. పగుళ్లు ఉన్న ఇళ్ల సంఖ్య పెరుగుతుండటంపై ఆయన మాట్లాడుతూ.. సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. ఈ సమయంలో పగుళ్లు కనిపించిన ఇళ్లను రికార్డు చేస్తారు అని తెలిపారు.
జనవరి 11 న సిఎం పుష్కర్ ధామి జోషిమఠ్‌ను సందర్శించారు. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించారు. అవసరమైతే తప్ప పట్టణంలోని ఇళ్లు కూల్చివేయబోమని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మీడియాకు, విపక్షాలను కోరారు.
Uttarakhand | CM Pushkar Singh Dhami inspected the land where the ISBT terminal is to be built in Tanakpur during his second day visit to Champawat district. pic.twitter.com/z9lkdQqOHA
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2023
హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన
నిపుణుల బృందం సోమవారం (జనవరి 16) రూర్కీ చేరుకుంది. జోషిమఠ్ ప్రాంతంలో లోతైన భూభౌతిక సర్వే ప్రారంభించి, ఇళ్లలో పగుళ్ల సమస్యను పరిష్కరించడానికి, నీటి వనరులను కనుగొనడానికి ఈ బృందం ప్రయత్నిస్తోంది.
Uttarakhand | A team of the National Geophysical Research Institute, Hyderabad has arrived in Joshimath to measure the load-bearing capacity of the land. pic.twitter.com/0qIVOCITAJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2023