School Principal: చిన్న పిల్లలను చితకబాదిన స్కూల్ ప్రిన్సిపాల్ - పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
School Principal: పిల్లలు చెప్పాపెట్టకుండా లీవ్ పెట్టడమే వారు చేసిన మహా పాపం అయింది. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు చిన్న పిల్లలు అని కూడా చూడకుండా వరుసలో నిలబెట్టి మరీ చితకబాదాడు.
School Principal: వారంతా చిన్న పిల్లలు. యూకేజీ నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు. అయితే ఊళ్లో పండగ ఉండడంతో కొంతమంది పిల్లలు బడిలో చెప్పకుండా సెలవు పెట్టారు. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో పిల్లలందరినీ వరుసలో నిలబెట్టి మరీ చితకబాదాడు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా... వద్దు సార్, వద్దు సార్ అని వాళ్లు బతిమాలుతున్న వినకుండా చితక్కొట్టాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ లోని పాలములోని సత్యర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని భోగు గ్రామంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ లో చోటు చేసుకుంది. అయితే బడిలో చదువుతున్న పిల్లలు.. తమ గ్రామమైన ఖమ్దీలో పవిత్ర శ్రావణ మాసం చివరి సోమవారం నిర్వహించిన కలష్ యాత్రకు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారంతా ఉపాధ్యాయులకు చెప్పకుండా సెలవు పెట్టేశారు. ఇది తెలిసిన ప్రధానోపాధ్యాయుడు చందన్ కుమార్ శర్మ విచక్షణా రహితంగా కొట్టారు.
అయితే తాము ఎందుకు రాలేదో వివరిస్తున్నప్పటికీ... ప్రధానోపాధ్యాయుడు వినకుండా తమను చితక్కొట్టాడని విద్యార్థులు చెబుతున్నారు. కలష్ యాత్రకు వెళ్లడం వల్లే రాలేకపోయామని చెప్పినా వినకుండా వాతలు వచ్చేలా కొట్టారని వాపోయారు. అలాగే ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే.. మళ్లీ కొడతామని బెదిరించారని గుక్కపట్టి ఏడుస్తూ వివరించారు. అయితే ఇంటికి వెళ్లిన విద్యార్థులు సరిగ్గా నడవలేకపోవడంతో.. తల్లిదండ్రులు విషయం గుర్తించారు. ఏమైందని పిల్లల్ని నిలదీసినా చెప్పకపోవడంతో.. వాళ్లే బట్టలు విప్పి చూశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పిల్లల తల్లిదండ్రులు అందరూ పోలీసులను ఆశ్రయించారు. ప్రధానోపాధ్యాయుడు చందన్ కుమార్ శర్మపై ఫిర్యాదు చేశారు.
మరోవైపు పోలీసులు.. తమకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఘటనపై సమాచారం మాత్రం వచ్చిందని అంటున్నారు. ఈక్రమంలోనే ప్రధానోపాధ్యాయుడిని పలిచి ఆయన అంతగా పిల్లల్ని ఎందుకు కొట్టారనే విషయం తెలుసుకుంటున్నామని సత్బర్వా పోలీస్ స్టేషన్ అధికారి అమిత్ కుమార్ సోని చెప్పారు. పిల్లలు గోలీలు ఆడుతున్నట్లు గుర్తించి.. ఆ వీడియోను ప్రిన్సిపాల్ కు పంపడం వల్లే అతను ఇలా పిల్లల్ని కొట్టాడని సమాచారం. అయితే అసలు నిజం ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ముస్లిం విద్యార్థులకు తోటి విద్యార్థులతో కొట్టించిన ప్రిన్సిపల్
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ లోని తృప్తి త్యాగి అనే మహిళా టీచర్ పాఠశాలలోని ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముజఫర్‌నగర్ ఖుబ్బాపూర్ గ్రామంలోని నేహా పబ్లిక్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. రెండో తరగతి చదివే ముస్లిం విద్యార్థిని నేహా పబ్లిక్ స్కూల్ హెడ్‌మిస్ట్రెస్ తృప్తి త్యాగి తోటి విద్యార్థులతో కొట్టించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు స్పందించి స్కూల్ ను మూసేయించింది. అయితే ఈ ఘటనపై పలు వార్తా ఛానళ్లు తృప్తి త్యాగిని వివరణ కోరగా.. ఆమె తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. అది చాలా చిన్న విషయమని, దానిని పెద్దది చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని మొదట్లో సమర్థించుకున్న తృప్తి త్యాగి.. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుండటంతో కాస్త వెనక్కి తగ్గారు. తాను తప్పు చేశానని ఒప్పుకున్నారు. ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించడం తప్పేనని తాను తప్పు చేశానని క్షమాపణ కోరారు. అలా కొట్టించడం తప్పేనన్న తృప్తి త్యాగి.. అందులో ఎలాంటి హిందూ-ముస్లిం మత విద్వేషం లేదని చెప్పుకొచ్చారు. తానను వికలాంగురాలినని.. లేవలేకపోవడం వల్లే తోటి విద్యార్థులతో కొట్టించినట్లు తెలిపారు.