Elections News: నేడు జమ్ముకశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన
Election Commission Of India: జమ్ముకశ్మీర్, హర్యానా సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటించే అవకాశం ఉంది
4 State Assembly Elections 2024: జమ్ముకశ్మీర్, హర్యాన, జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికల నగారా మోగనుంది. ఇవాళ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించనుంది.
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఐదు నుంచి ఏడు దశల్లో జరిగే ఛాన్స్ ఉంది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 2014లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
2014లో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం
2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నాలుగేళ్ల సంకీర్ణ ప్రభుత్వం తర్వాత 2018 నవంబర్ 21న అసెంబ్లీని రద్దు చేశారు. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు కానీ ఇంత వరకు జరగలేదు.
2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేశారు. దీని వల్ల అప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. రాజకీయ నాయకులు, ప్రజలు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుున్నారు.
హర్యాన అసెంబ్లీ ఎన్నికలు
హర్యాన అసెంబ్లీకి చివరిసారిగా 2019లో ఎన్నికలు జరిగాయి. హర్యాన అసెంబ్లీ ఎన్నికల గడువు నవంబర్ 3తో ముగుస్తుంది. 90 మంది సభ్యులున్న హర్యాన అసెంబ్లీలో 46స్థానాలు వచ్చిన వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధఇంచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. జననాయక్ జనతా పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలలుగా అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. లోకల్ పార్టీలను కూడా తమతో కలిసి పోటీ చేసేలా ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేయనుంది.