Mangalyaan Bids Goodbye: మార్స్ ఆర్బిటర్ మిషన్ నుంచి ఇస్రోకు నిలిచిపోయిన సిగ్నల్స్, మామ్ పని అయిపోయిందా !
ఇప్పటి వరకూ అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు మాస్ ఆర్బిటర్ మిషన్ - మామ్ నుంచి ఇస్రోకు చెందిన ట్రాకింగ్, టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ISTRAC ), బెంగళూరుకు సిగ్నల్స్ రావటం నిలిచిపోయాయి.
మార్స్ ఆర్బిటర్ మిషన్ నుంచి నిలిచిన సిగ్నల్స్
మామ్ (MOM)తో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం
ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన మంగళ్ యాన్
ఇస్రోకు ఘనకీర్తిని తెచ్చిపెట్టిన మంగళ్ యాన్
ఆరునెలల కోసం ప్రయోగిస్తే ఎనిమిదేళ్ల పాటు ప్రయోగాలు
రూ.450 కోట్ల రూపాయల ఖర్చుతో అంగారకుడి కక్ష్యలోకి
ఏప్రిల్ లో ఏర్పడిన గ్రహణమే సమస్యగా భావిస్తున్న ఇస్రో
ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయని ఇస్రో
ఎనిమిదేళ్ల పాటు మార్స్ (అంగారక గ్రహం) చుట్టూ తిరుగుతూ ఇస్రో సత్తా ఏంటో చాటిన మంగళ్ యాన్ శకం ముగిసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు మాస్ ఆర్బిటర్ మిషన్ - మామ్ నుంచి ఇస్రోకు చెందిన ట్రాకింగ్, టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ISTRAC ), బెంగళూరుకు సిగ్నల్స్ రావటం నిలిచిపోయాయి. దీని మీద ఇంకా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. కానీ తుదిఫలితం ఇస్రోకు ప్రతికూలంగానే ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇప్పటివరకూ అయితే ఇస్రో నుంచి మంగళ్ యాన్ పై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు..Spot
మామ్ కు ఏమైంది..? :
మంగళ్ యాన్ ఆరునెలల పరిశోధనల కోసమే ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. కానీ ఊహకు కూడా అందని రీతిలో ఎనిమిదేళ్లుగా మార్స్ ఆర్బిటర్ మిషన్ పనిచేస్తూ అరుణ గ్రహంపై ఎన్నో పరిశోధనలు చేసింది. మార్స్ ఉపరితలంపైన తిరుగుతూ పనిచేసే మంగళ్ యాన్ మిషన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు మన దేశం నుంచే ఆపరేట్ చేస్తున్నారు. ఇటీవల అంగాకరుడి కక్ష్యలో వరుసగా గ్రహణాలు ఏర్పడుతున్నాయి. దీంతో మిషన్ మంగళ్ యాన్ ను ఇస్రో బృందం ఆపరేట్ చేయటానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గ్రహణాల ప్రభావం లేకుండా ఆర్బిట్ ను మార్చేందుకు ఇస్రో బృందం పనిచేస్తున్న టైం లోనే ఏప్రిల్ లో అంగారకుడికి ఏర్పడిన ఓ గ్రహణం మంగళ్ యాన్ నిర్వహణకు ఇబ్బందిగా మారింది. దాదాపు ఏడున్నర గంటల పాటు ఆ గ్రహణం ఉండటంతో ఇస్రో బృందానికి మార్స్ ఆర్బిటర్ మిషన్ ను నిర్వహించేందుకు వీలు పడలేదు. ఫలితంగా మామ్ నుంచి పూర్తిగా సిగ్నల్స్ కోల్పోయినట్లు సమాచారం. శాటిలైట్ కు ఉన్న బ్యాటరీ ఒక గంటా నలభై నిమిషాల పాటు పనిచేయగలదు. కానీ గ్రహణం దాదాపుగా ఎనిమిది గంటల పాటు కొనసాగటంతో మంగళ్ యాన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు.
దేశం మీసం తిప్పిన మంగళ్ యాన్ :
అంగారకుడి కక్ష్యలోకి ఇతర దేశాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న టైం లో 2013 నవంబర్ 5న కేవలం 450 కోట్ల రూపాయల ఖర్చుతో PSLV-C25 అనే బక్క పలుచని రాకెట్ ద్వారా ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్ -మామ్ ను ప్రయోగించింది. దీనికి మిషన్ మంగళ్ యాన్ అని ఇస్రో పేరు పెట్టింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ అన్ని అడ్డంకులను దాటుకుని విజయవంతంగా సెప్టెంబర్ 24 న అంగాకరకుడి కక్ష్యలోకి చేరుకుని యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఎందుకంటే అప్పుడు విడుదలైన హాలీవుడ్ సినిమా 'గ్రావిటీ' బడ్జెట్ కంటే మిషన్ మంగళ్ యాన్ కు భారత్ ఖర్చుపెట్టింది చాలా తక్కువ. స్లింగ్ షాట్ పద్ధతి ద్వారా ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయేలా అతి తక్కువ ఖర్చులో మిషన్ మంగళ్ యాన్ అరుణ గ్రహాన్ని చేరుకుంది. ఇప్పటికీ ఈ రికార్డు మంగళ్ యాన్ పేరు మీదే ఉండటం విశేషం.
మహిళా శక్తి 'మామ్' - ఘనతలు ఎన్నో :
ఇస్రో ప్రయోగించిన ఈ మిషన్ మంగళ్ యాన్ ప్రాజెక్టులో మహిళలదే కీలకపాత్ర. మౌమితా దత్తా, నందినీ హరినాథ్, రితూ కరిదాల్ లాంటి మహిళా శాస్త్రవేత్తలే ముందుండి నడిపించిన ప్రాజెక్ట్ ఇది. అందుకే దీన్ని ముద్దుగా 'మామ్' అని కూడా పిలుచుకుంటున్నాం. భారత్ కు ఇది తొలి ఇంటర్ ప్లానెటరీ మిషన్ కాగా...నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారకుడి మీదకు స్పేస్ క్రాఫ్ట్ పంపించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. తొలి ప్రయత్నంలోనే అంగారుకుడిని చేరుకున్న స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో మీసం మెలేసేలా చేసింది మామ్.
మామ్ సాధించిన విజయాలు :
మొత్తం 15 కేజీల పేలోడ్ ను మంగళ్ యాన్ మోసుకెళ్లింది. వాటిలో ప్రధానమైన పరికరాలు ఐదు.
1.మార్స్ కలర్ కెమెరా (MCC)
2.థర్మల్ ఇన్ ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ (TIS)
3. మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ (MSM)
4. మార్స్ ఎక్సో స్పిరిక్ న్యూట్రల్ కంపోజిషన్ ఎనలైజర్ (MENCA)
5. లైమన్ ఆల్ఫా ఫోటో మీటర్ (LAP)
ఈ పరికరాల సాయంతో అంగారకుడి కక్ష్యలో తిరుగుతూ మామ్ ఎన్నో అద్భుతాలు చేసింది. అంగారకుడి ఫుల్ డిస్క్ ను స్నాప్ షాట్స్ తీసింది. దాదాపు ఇలా తీసిన వెయ్యి ఫోటోలతో 'మార్స్ అట్లాస్' ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించగలిగారు.
పెండింగ్ లో మంగళ్ యాన్ 2 :
మంగళ్ యాన్ సూపర్ సక్సెస్ తర్వాత మార్స్ ఆర్బిటర్ మిషన్ -మామ్ 2 ను ప్రయోగించాలని 2016 లో ఇస్రోకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ప్రస్తుతం గగన్ యాన్, చంద్రయాన్ 3, ఆదిత్య L1 ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఇస్రో వాటి తర్వాత మామ్ 2 పై దృష్టి సారించాలని భావిస్తోంది. ఇప్పుడు మామ్ నుంచి సిగ్నల్స్ నిలిచిపోయాయన్న సమాచారంతో మామ్ 2 ను త్వరగా పట్టాలెక్కించాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు సమాచారం.