Indias Fight against Terrorism: పాక్‌పై దౌత్య యుద్ధానికి తెరతీసిన భారత్, 7 ఎంపీల టీమ్స్ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
ఉగ్రవాదంపై భారత్ పోరును, ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి గల కారణాలను ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలకు ఎంపీల బృందాలు వివరించనున్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరుకు మద్దతు కోరనున్నారు.

7 MPs to Lead India After Operation Sindoor: న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారతదేశం పోరాటం మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశం నుండి ఏడు ప్రతినిధి బృందాలను కేంద్రం నియమించింది. వీరు ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న జీరో టోలరెన్స్ విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పనున్నారు. ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరాటంపై కేంద్రం నియమించిన ప్రతినిధులు ఈ నెలాఖరులో UN భద్రతా మండలి సభ్యులతో సహా కీలక భాగస్వామిగా దేశాలలో పర్యటించనున్నారు.
ఉగ్రవాద నిర్మూలనకు సహకరించాలని, ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దుతు కోరనున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న సహించేది లేదన్న భారత్ నిర్ణయాన్ని స్వాగతించాలని ఎంపీల బృందం పలు దేశాల ప్రతినిధులను కోరనుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం ఏకాభిప్రాయం, సమైక్యతను అఖిలపక్ష ఎంపీ ప్రతినిధులు విదేశాలకు వెళ్లి భారత్ స్టాండ్‌ను చాటిచెప్పనున్నారు. విదేశాలలో భారత్ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఇతర పార్టీల ఎంపీలతో కమిటీలు వేయడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అయితే, గతంలో 1994లో ప్రధాని పీవీ నరసింహారావు ఐక్యరాజ్యసమితికి పంపిన ప్రతినిధుల బృందానికి విపక్షనేత ఏబీ వాజ్‌పేయి నాయకత్వం వహించారు. విపక్ష పార్టీకి చెందిన నేత అయినా, భారత్ గళాన్ని వినిపించడానికి కేంద్రం తరఫున విదేశాలకు వెళ్లిన తొలి నేతగా వాజ్‌పేయి నిలిచారు.
పలు పార్టీల పార్లమెంటు సభ్యులు, ప్రముఖ రాజకీయ నేతలు, విశిష్ట దౌత్యవేత్తలు ప్రతి ప్రతినిధి బృందంలో ఉంటారు. కేంద్రం తాజాగా ఏర్పాటు చేసిన ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహించేది వీరే.
1) శశి థరూర్, కాంగ్రెస్
2) రవిశంకర్ ప్రసాద్, BJP
3) సంజయ్ కుమార్ ఝా, JDU
4) బైజయంత్ పాండా, BJP
5) కనిమొళి కరుణానిధి, DMK
6) సుప్రియా సులే, NCP
7) శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే, శివసేన
In moments that matter most, Bharat stands united.
— Kiren Rijiju (@KirenRijiju) May 17, 2025
Seven All-Party Delegations will soon visit key partner nations, carrying our shared message of zero-tolerance to terrorism.
A powerful reflection of national unity above politics, beyond differences.@rsprasad @ShashiTharoor… pic.twitter.com/FerHHACaVK
మే 23 నుంచి దాదాపు పది రోజుల పాటు ఈ ప్రతినిధుల బృందాలు అమెరికా, యూకే, యూఏఈ, దక్షిణాఫ్రికా, జపాన్ దేశాలకు వెళ్లి పాకిస్తాన్ చేస్తున్న క్రాస్ బార్డర్ టెర్రరిజం, కాశ్మీర్ అంశంపై భారత్ ఎలా వ్యవహరించనుందని వివరించనున్నారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ ఎంపీల దౌత్యవేత్తల బృందాలను సమన్వయం చేయనున్నారు.
ఉగ్రవాదంపై ఏకమైన అన్ని పార్టీలు
ఉగ్రవాదంపై పోరాడేందుకు రాజకీయాలను పక్కనపెట్టి రావాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు సూచించింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలను తాము స్వాగతిస్తామని పహల్గాంలో ఉగ్రదాడి తరువాత ఇటీవల జరిగిన అఖిపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. అనంతరం కేంద్రం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి నేలమట్టం చేసింది. అనంతరం నిర్వహించిన అఖిలపక్ష భేటీలోనూ కేంద్రం నిర్ణయాలకు తాము మద్దుతిస్తామని ప్రకటించారు. ఉగ్రవాదంపై దేశమంతా ఏకం కావాల్సిన సమయం ఇదేనని, రాజకీయాలను పక్కనపెట్టాలని అన్ని పార్టీల నేతలు భావిస్తున్నారు.
ఉగ్రవాదంపై పాక్ తీరును ఎండగట్టేందుకు, ప్రపంచ వ్యాప్తంగా పాక్ నిజస్వరూపం భయటపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, బీజేపీ పార్టీల ఎంపీలతో కమిటీలు ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు ప్రతినిధులు నేతృత్వం వహించేలా ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొత్తం 7 గ్రూపులు ఐక్యరాజ్యసమితి సభ్యత్వం ఉన్న కొన్ని దేశాలకు వెళ్తాయి. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోంది, భారత్ లో జరిగే ఉగ్రదాడులకు మూలాలు పాకిస్తాన్ లో ఎందుకున్నయో నేతల బృందాలు వివరించనున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఆవశ్యకతను వివరించనున్నారు.






















