Nepal Protests: నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
Nepal Protests: నేపాల్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. వివిధ కారణాలతో అక్కడకు వెళ్లి ఇరుక్కుపోయిన భారతీయుల కోసం బంధవులు ఆందోళన చెందుతున్నారు.

Nepal Protests: రాజకీయ అశాంతి పెరుగుతున్న వేళ నేపాల్‌లో ఉన్న భారతీయ పౌరుల కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. అత్యవసరంగా సంప్రదించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. వారు సూచించిన నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. +977–9808602881 లేదా +977–9810326134 నంబర్‌లలో రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
రాయబార కార్యాలయం నుంచి సలహా:
“నేపాల్‌లో మారుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పరిస్థితి చక్కబడే వరకు భారత పౌరులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి. ప్రస్తుతం నేపాల్‌లో ఉన్న భారతీయ పౌరులు తమ ప్రస్తుత నివాస స్థలాలలో ఆశ్రయం పొందాలి, వీధుల్లోకి రావద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేపాల్ అధికారులతోపాటు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం నుంచి స్థానిక భద్రతా సలహాలను కూడా పాటించాలి" అని భారత్ రాయబార కార్యాలయం సూచించింది.
ఏదైనా సహాయం అవసరమైతే, దయచేసి ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయానికి ఈ క్రింది హెల్ప్‌లైన్ నంబర్లలో కాల్ చేయండి:
+977–9808602881 (వాట్సాప్ కాల్ కూడా)
+977–9810326134 (వాట్సాప్ కాల్ కూడా)”
ఖాట్మండుకు వెళ్లే విమానాలు రద్దు
నేపాల్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కారణంగా భారతదేశం, ఖాట్మండు మధ్య ప్రయాణాలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అనేక విమాన సర్వీస్‌లు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. దీని వలన చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మరికొదరు విమానాశ్రయాల్లో చిక్కుకున్నారు.
"ఖాట్మండులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఢిల్లీ-ఖాట్మండు-ఢిల్లీ మార్గంలో నడుస్తున్న AI2231/2232, AI2219/2220, AI217/218, AI211/212 విమానాలు రద్దు అయ్యాయి" అని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పంచుకుంటామని అన్నారు."
ఖాట్మండుకు వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, ఢిల్లీ నుంచి 6E1153, ముంబై నుంచి 6E1157 విమానాలను ల్యాండ్ చేయడానికి అనుమతి నిరాకరించారు. వీటిని లక్నోకు మళ్లించారు. ఇంధనం నింపిన తర్వాత, రెండు విమానాలు బయల్దేరిన ప్రదేశానికే వచ్చేశాయి. ప్రస్తుతం ఖాట్మండులో పరిస్థితి బాగాలేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు నేపాల్ రాజధానికి వెళ్లే అన్ని సేవలను కూడా నిలిపివేసినట్టు ఇండిగో ప్రకటించింది.
నేపాల్‌లో రాజకీయ గందరగోళం
మంగళవారం నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా తర్వాత కూడా ఆందోళనలు చల్లారలేదు. దీంతో ఈ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ అల్లర్ల కారణంగా అధికారులు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది, అన్ని రాకపోకలు నిలిపివేశారు.
ప్రయాణీకులకు సలహా
ఖాట్మండుకు ప్రయాణించే ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా టికెట్ డబ్బులు వెనక్కి తీసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచించారు. పరిస్థితి సద్దుమణిగిన వెంటనే విమానాలను తిరిగి ప్రారంభించడానికి విమానయాన సంస్థలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాయి.
"సాధారణ కార్యకలాపాల పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్నాము, మీ సహనానికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము" అని ఎయిర్ ఇండియా తెలిపింది. తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక విమానయాన ఛానెల్‌లను, భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రయాణికులను సూచించింది.





















