Agnipath Scheme: అగ్నివీర్ స్కీమ్‌పై ఆసక్తి తగ్గుతోందా! ట్రైనింగ్ మధ్యలోనే వచ్చేస్తున్న యువత
Agnipath Scheme: అగ్నిపథ్ స్కీమ్‌లో చేరిన యువతలో 50%కి పైగా అభ్యర్థులు ట్రైనింగ్ మధ్యలో ఉండగానే బయటకు వచ్చేశారు.
Agnipath Scheme:
50% మంది వెనక్కి..
కేంద్ర ప్రభుత్వం గతేడాది అగ్నిపథ్ స్కీమ్‌ని (Indian Army Agnipath Scheme) ప్రవేశపెట్టింది. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ని పూర్తిగా మార్చేసింది. ఎన్నికైన వారికి బ్యాచ్‌ల వారీగా శిక్షణ అందిస్తోంది. త్వరలోనే వాళ్లను ఆర్మీలో డెప్లాయ్ చేయనుంది. వచ్చే నెల ఓ బ్యాచ్ భారత సైన్యంలో చేరనుంది. సెకండ్ బ్యాచ్‌కి ట్రైనింగ్ కూడా మొదలైంది. అయితే..యువత దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ట్రైనింగ్ మధ్యలో ఉండగానే వెళ్లిపోయారు. రకరకాల కారణాలు చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. ఫలితంగా..అప్పటి వరకూ వాళ్ల కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అయిపోతోంది. దీనిపై అధికారులు సీరియస్ అవుతున్నారు. ఇలా మధ్యలో వెళ్లిపోయిన వాళ్ల నుంచే ఆ ఖర్చులని రికవర్ చేయాలని చూస్తున్నారు. ఫస్ట్ బ్యాచ్‌లో 50% కన్నా ఎక్కువ మంది ట్రైనింగ్ మధ్యలో ఉండగానే వెళ్లిపోయారు. సాధారణంగా ఆర్మీలో చేరిన వాళ్లు ట్రైనింగ్‌లో ఉండగా బయటకు రావడానికి రూల్స్ ఒప్పుకోవు. అగ్నిపథ్ విషయంలో మాత్రం ఇది వర్తించడం లేదు. ఇకపై దీనిపైనా నియంత్రణ విధించాలని ఆర్మీ భావిస్తోంది. సెకండ్ బ్యాచ్‌లోనూ 50%కి మించి ట్రైనీలు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిపోయిన వాళ్ల నుంచే డబ్బులు వసూలు చేస్తే ఇకపై ఎవ్వరూ బయటకు వెళ్లే ముందు ఆలోచిస్తారని అంచనా వేస్తోంది. వాళ్లు చెప్పే కారణాలు కూడా కరెక్ట్ అనిపించడం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందుకే కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.
కఠిన శిక్షణ..
ఇలా ట్రైనింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయిన వాళ్లు రకరకాల కారణాలు చెబుతున్నారు. కొంత మంది మెడికల్ లీవ్ పెట్టి 30 రోజుల కన్నా ఎక్కువ రోజులు సెలవు తీసుకున్నారు. ఇంత కన్నా మంచి అవకాశాలు వచ్చాయని చెప్పి మరి కొందరు వెళ్లిపోయారు. ఆర్మీలో ఎవరైనా సరే 30 రోజులకు మించి సెలవు తీసుకుని ట్రైనింగ్‌కి హాజరుకాకపోతే వాళ్లను బయటకు పంపేస్తారు. ఈ ఏడాది జనవరి 1న 19 వేల మంది అగ్నివీర్‌లు జాయిన్ అయ్యారు. దేశంలోని మొత్తం 40 సెంటర్‌లలో వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆర్నెల్ల ఈ ట్రైనింగ్ ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఆర్నెల్ల ట్రైనింగ్ పూర్తయ్యాక నాలుగేళ్ల పాటు వాళ్లు ఆర్మీలో సేవలందిస్తారు. మొత్తం ఆర్మీలో 50% మందిని అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ చేసుకోవాలని చూస్తున్నారు.
పిటిషన్‌లు కొట్టేసిన సుప్రీంకోర్టు..
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని తేల్చి చెప్పింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేసిన పథకమే అని వెల్లడించింది. ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్‌లను బుట్టదాఖలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌లను తోసిపుచ్చింది. అగ్నిపథ్ పథకం కింద పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయస్సు గల యువకులు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేస్తారు. అయితే వారిలో 25 శాతం మంది తరువాత సాధారణ సేవ కోసం కొనసాగిస్తారు. ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచిందనట్లు జూన్ 16న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
Also Read: డాక్టర్‌కి ఝలక్ ఇచ్చిన పేషెంట్, నకిలీ నోటుతో ఫీజు కట్టాడు - సైలెంట్‌గా వెళ్లిపోయాడు