Monkeypox: భారత్‌లో 'క్లేడ్ - 1' తొలి మంకీపాక్స్ కేసు నమోదు - కేరళ యువకుడికి వ్యాధి నిర్ధారణ
Clade 1B Strain: ప్రపంచంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితికి దారి తీసిన 'క్లేడ్ 1బీ' స్ట్రెయిన్ మంకీపాక్స్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదైంది. కేరళ యువకునికి నిర్ధారణ అయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.
Mpox Clade 1B Case Reported In India: ప్రాణాంతక మంకీపాక్స్‌కు (Monkeypox) సంబంధించి భారత్‌లో 'క్లేడ్ 1 బీ' (Clade 1B Strain) స్ట్రెయిన్ తొలి కేసు నమోదైంది. 'ఆరోగ్య అత్యయిక స్థితి'కి దారి తీసిన ఈ స్ట్రెయిన్‌ను కేరళకు (Kerala) చెందిన వ్యక్తిలో గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత వారం వ్యాధి నిర్ధారణ అయ్యిందని తెలిపాయి. మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి ఇటీవల రాగా.. అతనిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 'క్లేడ్ 1'గా గుర్తించారు. అయితే, ఈ స్ట్రెయిన్ వ్యాప్తితోనే మంకీపాక్స్ విస్తరిస్తుందని.. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. కాగా, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
యూఏఈ నుంచి వచ్చిన కేరళ వ్యక్తికి జ్వరం, శరీరంపై దద్దుర్లు కనిపించగా స్థానికంగా ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు అనుమానంతో నమూనాలు సేకరించి టెస్టుల కోసం పంపించగా.. ఎంపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. భారత్‌లో ఇది రెండో మంకీపాక్స్ కేసు కాగా.. ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. 'ఎంపాక్స్ క్లేడ్ 1బీ' వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని.. ప్రధానంగా లైంగిక సంబంధాల ద్వారా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.
India reports the first MPOX clade 1 case, which was reported in Kerala, Malappuram last week. The patient is a 38-year-old man who travelled from UAE, this is the strain after which WHO declared a public health emergency: Official Sources
— ANI (@ANI) September 23, 2024
అత్యవసర పరిస్థితి
డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు పొరుగు దేశాల్లో భారీగా కేసులు నమోదు కాగా.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గతేడాది సైతం ఎంపాక్స్ ఆఫ్రికాలోని పలు దేశాల్లో విస్తరించింది. 2022లో 121 దేశాల్లో కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది జులైలో ప్రపంచవ్యాప్తంగా 1,425 కేసులు, 6 మరణాలు సంభవించాయి. నమోదైన కేసుల్లో ఎక్కువగా ఆఫ్రికాలో సగానికి పైగా కేసులు నమోదు కాగా.. అమెరికాలో 24 శాతం, యూరోపియన్ ప్రాంతంలో 11 శాతం కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులో సౌత్ - ఈస్ట్ ఆసియా రీజియన్‌లో ఒక శాతం నమోదయ్యాయి.