నేడు ఐఎన్‌డీఐఏ పక్షాలు భేటీ- సీట్ల లొల్లి కొలిక్కి తీసుకొస్తారా- సమావేశానికి మమత గైర్హాజరు
INDIA Parties:పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ నడుస్తోంది. సీట్ల సర్ధుబాటు అంశంపై చర్చించేందుకు సమావేశం కావాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి.
INDIA Parties: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన I.N.D.I..A కూటమిలో సీట్ల పంపకం కత్తి మీద సాములా మారుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో సీట్ల పంపకంలో లొల్లి మొదలవుతోంది. తాజాగా పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ నడుస్తోంది. సీట్ల సర్ధుబాటు అంశంపై చర్చించేందుకు సమావేశం కావాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అయితే, కాంగ్రెస్ పార్టీతో చర్చించేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముందుకు రాకపోవడంతో ఈ వ్యవహారం కూటమికి ఇబ్బందికరంగా పరిణమించేలా కనిపిస్తోంది. బీజేపీని అధికారానికి దూరం చేయాలన్న ఉద్ధేశంతో ఏకమైన పార్టీలు ఆదిలోనే ఇలా సీట్ల పంపకాలతో లొల్లికి దిగుతుండడం కూటమిలోని ఇతర పార్టీలను కలవరానికి గురి చేస్తోంది.
సీట్ల స్పష్టతతో బీజేపీకి కళ్లెం..
దేశ వ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో I.N.D.I.A. కూటమిగా ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలో నుంచి దించడమే లక్ష్యంగా ఈ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు సమావేశమైన I.N.D.I.A. భాగస్వామ్య పార్టీ నాయకులు.. ఎన్నికలకు ముందే అభ్యర్థులపై స్పష్టతకు రావాలని నిర్ణయించాయి. అందులో భాగంగానే రాష్ట్రాలు వారీగా సీట్ల పంపకాలతో దృష్టి సారించాయి. ఆయా రాష్ట్రాల్లో కీలకంగా ఉండే పార్టీలు.. తమకున్న బలాబలాలను బట్టి సీట్లను కేటాయించుకోవాలని నిర్ణయించాయి. అందుకు అనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్‌లో సమావేశం నిర్వహించగా.. సీఎం మమతా గైర్హాజరు కావడంతో సీట్ల పంపకం ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
ఇరు పార్టీల మధ్య కుదరని సయోధ్య..
పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపకానికి సంబంధించి ఇరు పార్టీలు చర్చించాలని భావించాయి. పశ్చిమ బెంగాల్‌లో సీట్ల లెక్క తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఐదుగురి సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ చర్చలు జరిపేందుకు మమతా బెనర్జీ ఇష్టపడలేదు. దీనికి బలమైన కారణం ఉన్నట్టు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. దీనికి మమతా సుముఖత వ్యక్తం చేయడం లేదు. కాంగ్రెస్‌కు రెండు సీట్లు మాత్రమే ఇస్తామంటూ మమతా బెనర్జీ ప్రతిపాదించారు. టీఎంసీ కాంగ్రెస్‌కు ఇవ్వాలని చూస్తున్న సీట్లలో మాల్డా దక్షిణ్, బెర్హమ్‌పూర్ సీట్లలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీలే ఉన్నారు. ఈ రెండు స్థానాలే ఇస్తామంటూ చేసిన టీఎంసీ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది. దీంతో మరోమారు జరపాలనుకున్న చర్చలకు తృణమూల్ అధినేత్రి మమతా దూరంగా ఉండిపోయారు.
ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధం..
కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకంపై ముందుకు రాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెల్చుకుంది. ఈ స్థానాలనే ఇస్తామనడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో గెల్చిన స్థానాలను మళ్లీ గెల్చుకోవడానికి ఎవరి సహాయం అక్కర్లేదంటూ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీట్ల పంపకాలు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తేల్చకపోతే ఒంటరిగా పోటీ చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం టీఎంసీ ఎంపీలు ఉన్న స్థానాలను కాంగ్రెస్ కోరుతుండడం.. అందుకు టీఎంసీ అధినేత్రి ససేమిరా అనడంతో చిక్కు వీడడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో సీట్ల లెక్క తేలితే ఇండియా కూటమికి దాదాపు సీట్ల పంపకాలు ఇబ్బందులు తప్పినట్టుగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: విచారణకు రావాల్సిందే! కేజ్రీవాల్‌కు ఈడీ నాలుగో సారి నోటీసులు
Also Read: 4 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం, పెరిగిన ఆహార ధరలే కారణం, EMI ఆశలపై నీళ్లు