India Pakistan Ceasefire Violation: పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ ఆగ్రహం- ఆర్మీకి పూర్తి స్వేచ్చ ఇచ్చినట్టు ప్రకటన
India Pakistan Ceasefire Violation: జమ్మూ కశ్మీర్ అంతటా దాడులకు పాల్పడిన పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీనికి బాధ్యత వహించాలని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి డిమాండ్ చేశారు.

India Pakistan Ceasefire Violation: భారతదేశం, పాకిస్తాన్ మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కొనసాగుతున్న సైనిక చర్య ముగించడానికి పరస్పర ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ తన నక్క బుద్ది చూపించుకుంది. శనివారం రాత్రి జమ్మూ కశ్మీర్ అంతటా ఉల్లంఘనలకు పాల్పడింది. దీన్ని దీటుగా ఎదుర్కొన్న భారత సాయుధ దళాలు గట్టి ప్రతీకార చర్యకు దిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి పాకిస్తాన్ బాధ్యత వహించాలని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శనివారం డిమాండ్ చేశారు.
“గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైనిక చర్యను ఆపడానికి భారతదేశం, పాకిస్తాన్ DGMOల మధ్య ఈ సాయంత్రం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘించింది. భారత సైన్యం ఈ చర్యలపై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఎదుర్కొంటోంది. ఈ చొరబాటు చాలా ఖండించదగినది. దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఈ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని, ఈ చొరబాటును ఆపడానికి వెంటనే తగిన చర్య తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం అని ఆయన అన్నారు.
మిస్రీ ఇంకా ఏమన్నారంటే, “ఈ ఉల్లంఘనలను పరిష్కరించడానికి, పరిస్థితిని బాధ్యతతో నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ను కోరుతున్నాము. పరిస్థితిపై సాయుధ దళాలు గట్టి నిఘా పెట్టాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట సరిహద్దు ఉల్లంఘనలు పునరావృతం అయితే గట్టిగానే స్పందించాలని సూచనలు ఇచ్చాం.”
కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, మధ్యాహ్నం ప్రారంభంలో కుదిరిన ద్వైపాక్షిక అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘించింది. భూమి, గాలి, సముద్రంలో అన్ని కాల్పులు, సైనిక కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించారు కానీ వాటిని తుంగలోతొక్కింది.
జమ్మూ-కశ్మీర్‌లో డ్రోన్లు కనిపించాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. 'శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపించాయని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ప్రకటన ఉన్నప్పటికీ శనివారం జమ్మూ కశ్మీర్ అంతటా వివిధ ప్రదేశాల్లో డ్రోన్లు కనిపించాయని నివేదికలు అందాయి. సాయుధ దళాలు వేగంగా స్పందించి, వైమానిక రక్షణ యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసి, డ్రోన్‌లను కూల్చివేసాయి.
శ్రీనగర్‌లో, బట్వారా ప్రాంతం సమీపంలో - ఒక ఆర్మీ స్థావరానికి దగ్గరగా - తిరుగుతున్న ఒక డ్రోన్‌ను భద్రతా దళాలు కూల్చివేసాయి, ఆ తర్వాత వరుస పేలుళ్లు నగరాన్ని షేక్ చేశాయి. 15 నిమిషాల వ్యవధిలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తెలిపారు.
రాత్రి 8.20 గంటల ప్రాంతంలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంపై ఒక డ్రోన్ గుర్తించారు. యాంటీ-డ్రోన్ వ్యవస్థ ద్వారా దానిని నియంత్రించారు. సైనిక స్థావరం సమీపంలోని అనంతనాగ్ హై గ్రౌండ్‌లో మరో డ్రోన్‌ను కూల్చివేసారు. అనంతనాగ్ జిల్లాలోని వెరినాగ్‌తో పాటు బండిపోరా, సఫాపోరా నుంచి మరో డ్రోన్ కనిపించిందని తెలిసింది.
కొనసాగుతున్న పరిణామాల మధ్య, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాల్పుల విరమణ ఉల్లంఘనపై ఆందోళనల వ్యక్తం చేశారు. సోషల్ మీడియోలో ఓ పోస్టు పెట్టారు. “కాల్పు విరమణకు ఇప్పుడే ఏమైంది? శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపించాయి!!” అని ఆయన రాసుకొచ్చారు.





















