Omicron Updates: భారత్‌లో ఇద్దరికి ఒమిక్రాన్.. కాంటాక్ట్ అయిన మరో అయిదుగురికి కోవిడ్ పాజిటివ్.. ఒమిక్రానేనా..!
ఇద్దరికి కొవిడ్19 పాజిటివ్ నిర్ధరణ కావడంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఒమిక్రాన్ ఉన్నట్టు ఇన్‌సాకాగ్ నిర్ధారించింది. వీరిని కలుసుకున్న ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి ప్రవేశించింది. కర్ణాటకలోని బెంగళూరులోనే రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. వీరిని నేరుగా కలుసుకున్న మరో ఐదుగురికి సైతం కొవిడ్19 పాజిటివ్‌గా గుర్తించడం ఆందోళన పెంచుతోంది. అయితే అది ఒమిక్రానా కాదా తేలాల్సి ఉంది.
మొదటగా ఒమిక్రాన్ గుర్తించిన వారిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరికి 46 ఏళ్లు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదన్నారు. ఇద్దరికి కొవిడ్19 పాజిటివ్ నిర్ధరణ కావడంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఒమిక్రాన్ ఉన్నట్టు ఇన్‌సాకాగ్ నిర్ధారించింది. వీరిలో తీవ్ర కరోనా లక్షణాలు కనిపించలేదు. కానీ వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయిన వారికి సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన 46 ఏళ్ల వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఇద్దరికి, సెకండరీ కాంటాక్ట్‌లో ఒకరికి, మొత్తంగా ఐదుగురికి పాజిటివ్‌గా తేలినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలకమండలి తెలిపింది.
ఇతర వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ ఐదు రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. కనుక ఒమిక్రాన్ తేలిన వెంటనే వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల నుంచి శాంపిల్స్ సేకరించారు. నవంబర్ 22-25వ తేదీల మధ్య ఈ కొత్త వేరియంగ్ బాధితులు వారిని కలిసినట్లు తెలుస్తోంది. తాజాగా పాజిటివ్‌గా తేలిన ముగ్గురిని ఐసోలేషన్‌కు తరలించి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ముగ్గురి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్స్ కోసం పరీక్షలకు పంపించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయిన వారిలో సైతం ఒమిక్రాన్ తేలే అవకాశాలే అధికంగా ఉన్నాయి.
Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినా ఆందోళన చెందాల్సిన పనిలేదని.. కొవిడ్19 నిబంధనలు పాటించాలన్నారు. శానిటైజర్ వాడకం, మాస్కులు ధరించాలని, ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడకుండా ఉండాలని ఆయన సూచించారు. ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో ఎయిర్పోర్ట్, పోర్ట్ అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా సమావేశమయ్యారు. విమానాశ్రయాలు, పోర్టుల ద్వారా దేశంలోకి ప్రవేశించే అన్ని పాయింట్ల వద్ద నిఘా, స్క్రీనింగ్ అంశాలపై చర్చించారు. రిస్క్ అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తొలి రోజు, ప్రత్యేక కేటగిరీ ప్రయాణికులకు 8వ రోజు కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
29 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు..
‘ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో 373 కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇప్పటివరకూ 37 ప్రయోగశాలలు ఏర్పాటు చేశాం. విదేశాల నుంచి, ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుందని’ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!