India to Cancel Ceasefire: పహల్గాం ఉగ్రదాడితో కాల్పుల విరమణపై త్వరలో భారత్ సంచలన నిర్ణయం: నివేదిక
India to Cancel Ceasefire పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో భారత్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.

Pahalgam Terrorist Attack | న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచుతోంది. మరోవైపు ఉగ్రవాదులను కట్టడి చేయడానికి బదులుగా మొన్న ఉగ్రదాడికి భారత్ లోని శక్తులే కారణమంటూ పాక్ పిచ్చి పిచ్చి కూతలు కూయడం భారత ప్రభుత్వాన్ని సవాల్ చేస్తోంది. దాంతో పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోందని పలు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాక్ చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే ఇదే సరైన నిర్ణయమని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని నివేదికలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం త్వరలోనే కాల్పుల విరమణపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలు సైతం ఈ విషయాన్ని పరోక్షంగా చెబుతున్నాయిని నివేదికలలో పేర్కొన్నాయి.
సింధు జలాల ఒప్పందంపై నిషేధం..
ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు చేపట్టింది భారత్. ఇదివరకే సింధు నది జలాల ఒప్పందం (Indus Water Treaty)పై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కాల్పుల విరమణ ఉల్లంఘన, తరచుగా జమ్మూకాశ్మీర్ లో కాల్పులు జరపడం, తాజాగా అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడులతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అటారి-వాఘా సరిహద్దును మూసివేయడం, భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు దేశం వదిలి వెళ్లడానికి ఇచ్చిన 48 గంటల గడువు ముగిసింది. పాకిస్థాన్ పౌరులకు వీసాలు జారీ చేయడంపై కేంద్రం నిషేధం విధించింది. ఇరుదేశాల హైకమిషన్లలో నియమించిన అధికారులను తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
పదే పదే ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్
నియంత్రణ రేఖ వద్ద, అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందంలో తన నిబద్ధతలను నిలబెట్టుకోవడంలో పాకిస్తాన్ విఫలమైనందున కేంద్రం కాల్పుల విరమణ ఒప్పందానికి మొగ్గు చూపుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ భారత్ కనుక ఆ వ్యూహాత్మక చర్యకు దిగితే పాకిస్తాన్ దిగిరావాల్సిందే. అప్పుడు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు దేశాన్ని మరింత ఒంటరిని చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. అందుకు ఉన్న అవకాశాలపై కేంద్ర మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, విదేశాంగ మంత్రి, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంటి వారు దీనిపై యోచిస్తున్నారని తెలుస్తోంది.
ఫిబ్రవరి 2021 కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైష్-ఏ-మహమ్మద్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లాంటి ఉగ్రమూకలు జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడి కాల్పులు జరుపుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ గత ఐదేళ్లలోనూ పలుమార్లు కాశ్మీర్ లో కాల్పులు జరుపుతూ చిన్న చిన్న ఉగ్రదాడులకు పాల్పడింది. ముఖ్యంగా 2023, 2024లలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వాటికి భారత బలగాలు దీటుగా బదులిస్తూ ఉగ్రమూకలను హతం చేస్తూనే ఉన్నా.. పాక్ వక్రబుద్ధి మారడం లేదు.
జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం ఉదయం పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ సైతం పాక్ తన బుద్ధి చూపింది. పాక్ కాల్పులకు ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి. ఎదురు కాల్పులతో పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాయని అధికారులు తెలిపారు.






















