Pakistan Army Firing: ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతం, కొనసాగుతోన్న ఆర్మీ ఆపరేషన్
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరిపింది. భారత సైన్యం పాక్ కాల్పులకు ధీటుగా బదులిస్తోందని అధికారులు చెబుతున్నారు.

పహల్గాంలో పాక్ టెర్రరిస్టుల ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు ఉగ్రదాడులకు ఏ సంబంధం లేదని చెబుతూనే పాకిస్తాన్ ఆర్మీ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంట కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ పాక్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడింది. పాక్ సైన్యం కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు భారత సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తోంది. బండిపోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (LET) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హతమయ్యాడు. పహల్గాంలో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల ఏరివేతపై కొనసాగుతోన్న ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్ కౌంటర్‌లో టెర్రరిస్ట్ అల్తాప్ లల్లీ హతమయ్యాడు. పక్కా సమాచారంతో భారత బలగాలు అక్కడికి వెళ్లగా టెర్రరిస్టులు కాల్పులు జరపగా, భారత సైన్యం ఎదురుకాల్పులతో బదులిచ్చింది. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం కాగా, ఇద్దరు భారత జవాన్లకు గాయాలయ్యాయి.
శుక్రవారం ఉదయమే కాల్పులు మొదలుపెట్టిన పాక్ ఆర్మీ
పాక్ ఆర్మీ నియంత్రణ రేఖ వెంట కాల్పులు మొదలుపెట్టగానే, స్పందించిన భారత ఆర్మీ ఎదురుకాల్పులు జరుపుతోందని అధికారులు తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు అని ANI నివేదించింది. మంగళవారం నాడు పహల్గాంలో పర్యాటకులపై ద రెసిస్టెంట్ ఫోర్స్ కాల్పులు జరిపి 26 మంది పౌరులను హత్య చేసింది. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉండగా, మరో ఇద్దరు స్థానికులు అని అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పాక్ ఎదురు దాడులకు దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంట శుక్రవారం ఉదయం కాల్పులు జరిపింది.
పాక్ టెర్రరిస్టుల ఉగ్రదాడులతో విసిగిపోయిన భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేసుకోవాలని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుని, ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు అని తాజా నివేదిక చెబుతోంది. పాక్‌ను సింధు జలాల నిషేధంతో దెబ్బకొట్టగా.. దేశంలోని పాక్ పౌరులు సాధ్యమైనంత త్వరగా పాక్ వెళ్లిపోవాలని సూచించింది. అట్టారి, వాఘా సరిహద్దు సైతం మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందంపై నిషేధం విధిస్తూ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్ జలశక్తి శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.
పహల్గంలో జరిపిన ఉగ్రదాడి గతంలో జరిగిన ఉగ్రదాడులకు భిన్నంగా ఉందని తెలుస్తోంది. గతంలో భారత్ లో ఎవరు కనిపించిన వారిని లక్ష్యంగా చేసుకుని పాక్ ఉగ్రవాడులు, పాక్ ఆర్మీ కాల్పులు జరిపేది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రజల మతాన్ని తెలుసుకుని మరీ కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారు. కొందరు ఐడీ కార్డులు పరిశీలించి వారు ముస్లిం కాదు అని నిర్ధారించుకుని మరీ ద రెసిస్టెంట్ ఫోర్స్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.






















