QRSAM: భారత గగనతల రక్షణకు ₹30,000 కోట్లతో QRSAM, పాకిస్తాన్, చైనాకు చెక్ పెట్టే క్షిపణి వ్యవస్థ!
QRSAM: విదేశీ దాడుల నుండి మన దేశ గగనతలాన్ని రక్షించే ఉద్దేశంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (QRSAM) వ్యవస్థను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది

QRSAM: గగనతల రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా భారత సైన్యం కొత్త అడుగులు వేస్తోంది. విదేశీ దాడుల నుంచి మన దేశ గగనతలాన్ని రక్షించే ఉద్దేశంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (QRSAM) వ్యవస్థను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జూన్ చివరి వారంలో రక్షణ మంత్రిత్వ శాఖ జరిపే సమావేశంలో ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది.
QRSAM అంటే ఏమిటి? దాని ప్రత్యేకతలు ఏంటి?
క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్నే సంక్షిప్తంగా QRSAM అని పిలుస్తారు. ఇది మధ్య శ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఒక అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థ. దీని పేరులోనే ఉన్నట్లు 'క్విక్ రియాక్షన్' అంటే అత్యంత వేగంగా స్పందించడం దీని ప్రధాన ప్రత్యేకత. ఈ రక్షణ వ్యవస్థ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది కదులుతున్నప్పటికీ శత్రువుల విమానాలు, క్షిపణులు, హెలికాప్టర్లు, డ్రోన్‌లను గుర్తించి, గాల్లోనే కూల్చివేసేంత శక్తివంతమైంది.
QRSAM వ్యవస్థ ముఖ్యమైన లక్షణాలు:
- అధిక చలనశీలత: ఈ వ్యవస్థను అధిక చలనశీలత ఉన్న వాహనాలపై (ట్రక్కులు) అమర్చుతారు. ఇది కదులుతున్నప్పటికీ శత్రు దేశాల క్షిపణులు, విమానాలు, డ్రోన్‌లు, హెలికాప్టర్లను గుర్తించి, ట్రాక్ చేసి, ధ్వంసం చేయగలదు.
- శీఘ్ర ప్రతిస్పందన: శత్రు వైమానిక దాడులను ఇట్టే పసిగట్టి, వాటిపై ప్రతిదాడి చేసే సామర్థ్యం దీనికి ఉంది.
- 360 డిగ్రీల రక్షణ: ఈ వ్యవస్థ 360 డిగ్రీల పరిధిలో రక్షణ కల్పిస్తుంది. ఇందులో రెండు ఫోర్-వాల్డ్ రాడార్‌లు ఉంటాయి, ఇవి 360 డిగ్రీల కోణంలో శత్రువుల నుండి వచ్చే ముప్పును గుర్తించగలుగుతాయి.
- పరిధి:ఈ వ్యవస్థ 5 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలపై నిఘా ఉంచి, వాటిని ధ్వంసం చేయగలదు.
- బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం: QRSAM బహుళ లక్ష్యాలను ఛేదించగల వ్యవస్థ. ఒకే లాంచర్ నుండి ఆరు క్షిపణులను ప్రయోగించి, ఒకేసారి ఆరు లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యం దీనికి ఉంది.
- ఎలక్ట్రానిక్ జామింగ్ను నిరోధించడం: QRSAM ఎలక్ట్రానిక్ కౌంటర్-కౌంటర్ మెజర్ (ECCM) సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే ఇది శత్రు దేశాల ఎలక్ట్రానిక్ జామింగ్ సిస్టమ్‌ను నిరోధిస్తూ తన పనిని కానిచ్చే అద్భుత సామర్థ్యం ఉంది.
ఈ వ్యవస్థలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేస్తోంది. వీటికి అనుసంధానించే క్షిపణులను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) అభివృద్ధి చేస్తుంది. ఇక వీటిని ప్రయోగించే లాంచర్లను లార్సెన్ అండ్ టూబ్రో (L&T) అనే భారతీయ బహుళజాతి సంస్థ అభివృద్ధి చేస్తోంది.
పాకిస్థాన్, చైనాలకు చెక్ పెట్టే రక్షణ వ్యవస్థ
భారత ప్రభుత్వం QRSAM వ్యవస్థను ప్రధానంగా మూడు రెజిమెంట్ల కోసం కొనుగోలు చేయాలని భావిస్తోంది. వీటిని మన దేశ పశ్చిమ (పాకిస్థాన్ సరిహద్దు) ,ఉత్తర (చైనా సరిహద్దు) సరిహద్దులలో వ్యూహాత్మకంగా మోహరించనున్నారు. ఇది ఈ రెండు దేశాల నుండి వచ్చే విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్‌ల నుంచి గగనతల రక్షణను అందిస్తుంది. ఇప్పటికే మన సైన్యం వద్ద ఉన్న MRSAM (Medium Range Surface-to-Air Missile), ఆకాష్ (Akash) వంటి గగనతల రక్షణ వ్యవస్థలకు అనుబంధంగా పనిచేసి, వాటి సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.
ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన శౌర్యం
ఈ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు నిర్ణయం వెనుక ఆపరేషన్ సింధూర్ అనుభవాలు ఉన్నాయి. ఏప్రిల్ 22న పహెల్గామ్ ఉగ్రదాడి తర్వాత, మే 6, 7వ తేదీలలో అర్ధరాత్రి పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మన దేశం ఆపరేషన్ సింధూర్‌ను నిర్వహించింది. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్థాన్ మన దేశంపై పెద్ద ఎత్తున డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది.
అయితే, మన సైన్యం వాటిని విజయవంతంగా అడ్డుకుంది. భారత సైన్యంలో ఉన్న బోఫోర్స్ 40 mm ఆటోమేటిక్ గన్ L/70, రష్యా తయారీ Zu-23 విమాన విధ్వంసక తుపాకులు, అలాగే వైమానిక దళంలోని స్పైడర్ (SPYDER), మరియు రష్యా తయారీ S-400 సుదర్శన్ వ్యవస్థలు కలిసి ఈ దాడులను సమర్థవంతంగా నిరోధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో QRSAM వంటి 'క్విక్ రియాక్షన్' వ్యవస్థల అవసరం ఎంతైనా ఉందని స్పష్టమైంది. ఈ కారణంగానే మన సైన్యం ఈ వ్యవస్థ కొనుగోలుకు సిద్ధమవుతోంది.
మరిన్ని అధునాతన యుద్ధ పరికరాల కొనుగోలుకు రంగం సిద్ధం
పాక్‌తో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యం మరింత బలోపేతం అయ్యేందుకు చర్యలు చేపట్టింది. QRSAM వ్యవస్థతోపాటు, సైన్యానికి త్వరలో కొత్త రాడార్ యంత్రాలు, చిన్న శ్రేణి క్షిపణులు, జామర్లు, లేజర్ వ్యవస్థలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇది టర్కీ, చైనా వంటి దేశాల నుంచి ఎదురయ్యే డ్రోన్ ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అధునాతన వ్యవస్థలు భారత సైన్యం చేతికి వస్తే భారత దేశ గగనతల రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును బలంగా తిప్పికొట్టే శక్తి వస్తుందని మిలటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






















