Gaur Hari Das: స్వాతంత్య్ర సమరయోధుడిగా నిరూపించుకునేందుకు 32 ఏళ్లు పోరాడిన గౌర్ హరి దాస్
Gaur Hari Das: ఆయనో స్వాతంత్ర్య పోరాట యోధుడు. గాంధీతో కలిసి భారత దేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు. కానీ ఆయన తనను తాను పోరాట యోధుడిగా నిరూపించుకోవాడనికి 32 ఏళ్లు పట్టింది.
Gaur Hari Das: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. నేడు దేశవ్యాప్తంగా వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఇంటా హర్ ఘర్ తిరంగా అంటూ జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. ఈ సందర్భంగా ఓ స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడినా, గుర్తింపు ఆలస్యంగా దక్కించుకున్నారు ఓ యోధుడు. ఆయన మరెవరో కాదు గౌర్ హరి దాస్. ముంబయికి చెందిన 91 ఏళ్ల ఈ ఫ్రీడమ్ ఫైటర్.. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ, ఆచార్య వినోబా భావేతో కలిసి పని చేశారు. తాను స్వాతంత్ర్య సమరయోధుడిగా నిరూపించుకోవడానికి 32 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చిందని తెలిపారు.
స్వాతంత్య్రం సిద్ధించినా.. 32 ఏళ్ల పోరాటం
ఒడిశాకు చెందిన గౌర్ హరి దాస్ గత ఐదు దశాబ్దాలుగా తన కుటుంబంతో కలిసి ముంబయిలో నివసిస్తున్నారు. స్వాతంత్ర్య సమర యోధుడి కోటాలో తన కుమారుడికి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశం దొరకకపోవడంతో స్వాతంత్ర్య సమరయోధుడిగా నిరూపించుకోవడానికి తన పోరాటం ప్రారంభమైందని తెలిపారు దాస్. ఆ సంవత్సరం అదే సమయంలో, తాను స్వాతంత్ర్య సమరయోధునిగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు గౌర్ హరి దాస్.
చివరికి దక్కిన గుర్తింపు..
ఒడిశాకు చెందినవాడు కాబట్టి, మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ స్వాతంత్య్ర సమరయోధులకు సహాయం చేయలేదని చాలా సార్లు విన్నానని హరి దాస్ తెలిపారు. యోధుడిగా నిరూపించుకోవడానికి 32 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. చివరకు సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత, 2008 సంవత్సరంలో, తాను స్వాతంత్ర్య సమరయోధుడిగా సర్టిఫికేట్ పొందినట్లు ఆయన పేర్కొన్నారు.
మహాత్మా గాంధీని కలిసిన గౌర్ హరి దాస్..
దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జాతి పిత మహాత్మా గాంధీతో తన మొదటి మరియు చివరి సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు గౌర్ హరి దాస్. బాపును కలిసినప్పుడు, గౌర్ హరి దాస్ కు 14 సంవత్సరాలు మాత్రమే. బాపు తన పనిని మెచ్చుకున్నారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 16 ఏళ్ల వయసులో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వెల్లడించారు దాస్. కానీ మహాత్మా గాంధీ ఆలోచనల ఆధారంగానే తన మిగతా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
'వానర్ సేన' పని..
ఒకప్పుడు “వానర్ సేన”గా పని చేశారు గౌర్ హరి దాస్. స్వాతంత్య్ర సమరయోధుల లేఖలను వారి కుటుంబాలకు అందజేయడం, ఆ కుటుంబం నుంచి వచ్చిన లేఖలను వారికి తిరిగి ఇవ్వడం ఈ వానర్ సేన పని. వానర్ సేన స్వాతంత్ర్య సమరయోధులు లేఖలను వారి కుటుంబాలకు అందించే వారు.
జైలు సందర్శన.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు గౌర్ హరి దాస్ ను మొత్తం 46 రోజులు జైల్లో ఉంచారు. రాజకీయ ఖైదీలుగా ఉన్నందున సాధారణ ఖైదీల నుంచి వారిని విడిగా ఉంచారు.
ఒడిశా నుండి బీహార్ వరకు ప్రయాణం.. కొన్నేళ్లు ఒడిశాలో పని చేసిన తర్వాత, గౌర్ హరి దాస్ దేశం కోసం పని చేయాలని భావించి, ఒడిశా నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు గౌర్ హరి దాస్. ఈ క్రమంలో ఆయన బిహార్ వెళ్లారు. అక్కడ ఆచార్య వినోబా భావేని కలిశారు. ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా దాస్ బిహార్‌లో సైతం దాదాపు ఒక సంవత్సరం పనిచేశానని ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు దాస్.