Jaishankar: కెనడాకు ఝలక్, అమెరికా, భారత్ మధ్య చర్చకు రాని నిజ్జర్ హత్య వివాదం
Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్‌లో ఐదు రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం వాషింగ్టన్‌లో యుఎస్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు.
Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్‌లో ఐదు రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం వాషింగ్టన్‌లో యుఎస్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు. ఇందులో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌ను హతమార్చడంలో భారతదేశం ప్రమేయం ఉందని కెనడా చేసిన ఆరోపణలపై ఎటువంటి ప్రస్తావన రాలేదు. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. దీని వెనుక భారత ప్రభుత్వం ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదే పదే ఆరోపించిన విషయం తెలిసిందే. కెనడా ఆరోపణలపై భారత్ గట్టిగానే సమాధానం ఇచ్చింది. నిజ్జర్ హత్యకు భారత్‌కు సంబంధం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అన్నారు. నిజ్జర్ హత్యకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం అందిస్తే, భారత్‌కు దీనిపై దర్యాప్తు చేస్తామని జైశంకర్ కెనడాకు హామీ ఇచ్చారు.
Great to meet my friend US Secretary of State @SecBlinken at State Department today.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 28, 2023
A wide ranging discussion, following up on PM @narendramodi’s June visit. Also exchanged notes on global developments.
Laid the groundwork of our 2+2 meeting very soon. pic.twitter.com/mOw9SIX1dO
జైశంకర్, బ్లింకెన్ మధ్య గురువారం జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు రాలేదు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకారం G20 ప్రెసిడెన్సీ, భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు, కీలక ఫలితాలపై వారు చర్చించారు. మరో సారి అమెరికా రావడం సంతోషంగా ఉందని, G20 సమ్మిట్‌కు మద్దతు ఇచ్చినందుకు అమెరికాకు జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మిస్టర్ బ్లింకెన్‌తో కలిసి జైశంకర్ మీడియాతో మాట్లాడారు. బ్లింకెన్ మాట్లాడుతూ.. G20 సమ్మిట్, న్యూయార్క్‌లో జరిగిన UN జనరల్ అసెంబ్లీ సెషన్‌లో చాలా మంచి చర్చలు జరిగాయన్నారు. భారతతో చర్చల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. విలేకరుల ప్రశ్నలకు స్పందించడానికి బ్లింకెన్ నిరాకరించారు.
సమావేశంపై జైశంకర్ ఎక్స్ (ట్విటర్)లో స్పందిస్తూ.. "ఈ రోజు విదేశాంగ శాఖలో నా స్నేహితుడు, US సెక్రటరీ బ్లింకెన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్రధాని జూన్ పర్యటనపై విస్తృత చర్చ జరిగింది. అలాగే ప్రపంచ పరిణామాలపై సమాచారాన్ని పంచుకున్నాం. త్వరలో జరగనున్న 2+2 సమావేశానికి పునాది పడింది’ అంటూ పోస్ట్ చేశారు. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందిస్తూ.. రక్షణ, అంతరిక్షం, క్లీన్ ఎనర్జీ రంగాలలో సహకారం ప్రాముఖ్యతను జైశంకర్, బ్లింకెన్ ప్రస్తావించారని అన్నారు. భారతదేశం-యుఎస్ 2+2 మంత్రుల సమావేశం ఐదవ ఎడిషన్‌కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుందని జైశంకర్ గురువారం ప్రకటించారు. అయితే సమావేశం జరిగే తేదీలను ఆయన వెల్లడించలేదు. నవంబర్ తొలి వారంలో మంత్రివర్గ చర్చ జరగనున్నట్లు సమాచారం.
ఖలిస్తాన్ ఉగ్రవాది, వేర్పాటు వాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య గురించి కెనడా కొద్ది కాలంగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే అమెరికాకు వివరించామని, అమెరికా సాయంతో భారత్ సంగతి ఏంటో తేలుస్తామంటూ చెప్పుకొచ్చారు. గురువారం జరిగిన జైశంకర్, బ్లింకెన్ సమావేశంలో నిజ్జర్ హత్యను లేవనెత్తుతారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భావించారు. కేసును తెరపైకి తెస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు ట్రూడో సమాధానమిస్తూ ‘అమెరికన్లు ఈ విషయాన్ని భారత ప్రభుత్వంతో ఖచ్చితంగా చర్చిస్తారంటూ వ్యాఖ్యానించారు. అయితే బ్లింకెన్, జైశంకర్ సమవేశంలో దాని గురించి చర్చ జరగలేదుర. దీంతో కెనడా నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.