(Source: ECI/ABP News/ABP Majha)
IMF Chief Dance: జానపద పాటకు స్టెప్పులేసిన IMF చీఫ్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆసక్తికర దృశ్యం
IMF Chief Dance: జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీ వచ్చిన ఐఎంఎఫ్ చీఫ్ జానపద పాటకు నృత్యం చేశారు.
IMF Chief Dance: దేశరాజధాని ఢిల్లీ వేదికగా రేపట్నుంచి జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు వివిధ దేశాధినేతలు ఒక్కొక్కరు ఢిల్లీకి చేరుకుంటున్నారు. అగ్ర నేతలకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా ఈ ఏర్పాట్లు ఉన్నాయి. దేశాధినేతలకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుల వద్ద జానపద కళాకారులతో పాటలు, నృత్యాలు చేయిస్తున్నారు.
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా కూడా జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు స్వాగతం పలికారు అధికారులు. ఐఎంఎఫ్ చీఫ్ రాకను పురస్కరించుకుని స్వాగతం చెప్పేందుకు విమానాశ్రయం వద్ద జానపద కళాకారుల తమ సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఒడిశాకు చెందిన సంబల్‌పురి పాటకు అనుగుణంగా కళాకారులు నృత్యం చేశారు. ఈ డ్యాన్స్ షోను వీక్షించిన ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జీవా కూడా ఆ జానపద బీట్ కు స్టెప్పులేశారు. హుషారెక్కించే ఆ సాంగ్ జోరుకు.. ఆకర్షితురాలైన క్రిస్టలీనా కూడా వారిలా డ్యాన్స్ చేశారు. ఫోక్ డ్యాన్సర్లను అనుకరించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. సంబల్‌పురి బీట్ కు స్టెప్పులు వేయకుండా ఉండటం చాలా కష్టం అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టుకు లైకులు, వ్యూస్ వేలల్లో వస్తున్నాయి.
Difficult to resist #Sambalpuri beats .
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 8, 2023
MD International Monetary Fund Ms. @KGeorgieva arrives in India for #G20 summit to a #Sambalpuri song and dance welcome . #OdiaPride pic.twitter.com/4tx0nmhUfK
స్థానిక వంటకాలతో అతిథులకు విందు భోజనం
20 సదస్సుకు వచ్చే అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు ప్రత్యేక కార్యదర్శి ముక్తేశ్ పరదేశి తెలిపారు. స్థానిక వంటకాలతో పసందుగా విందు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు చిరు ధాన్యాలతో కూడిన భారతీయ వంటకాల రుచి చూపిస్తామని చెప్పారు. అలాగే చిరు ధాన్యాల పౌడర్ తో ఫ్రూట్ సలాడ్లు, బెల్లం రాగి ఖీర్, స్పెషల్ మిల్లెట్ థాలి, మిల్లెట్ పలావ్, మిల్లెట్ ఇండ్లీ వంటి వంటకాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాజస్థానీ దాల్ బాటీ ఖుర్మా, పశ్చిమ బెంగాల్ రసగుల్లా, దక్షిణాది మసాలా దోశ బిహార్ లిట్టీ చోకాలనూ అతిథిలకు వండి వడ్డించబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే చాందినీ చౌక్ వంటకాలను కూడా తినిపిస్తామని స్పష్టం చేశారు.
అలాగే బంగారు, వెండి పాత్రల్లో భోజనం
భారత్ సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే సమ్మిట్‌కు ప్రపంచ స్థాయి నాయకులు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. అందు కోసం ఢిల్లీలోని హోటళ్లు ప్రత్యేకమైన రీతిలో VVIP లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. దేశాధినేతలు, ఇతర ప్రపంచ నాయకులకు వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం అందించనున్నారు. భారతదేశం సంస్కృతి, ప్రతిబింబించేలా వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం, ఆతిథ్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అతిథులకు విలాసవంతమైన విందు కోసం వివిధ లగ్జరీ హోటళ్లలో ఈ వస్తువులను ఏర్పాటు చేశారు. అత్యంత ఆకర్షణీయమైన, అందమైన పాత్రలను ఐకానిక్ ITC తాజ్ హోటల్‌తో సహా 11 హోటళ్లకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందు కోసం క్రోకరీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భగా పాత్రల తయారీ సంస్థ యజమానులు రాజీవ్, అతని కుమారుడు మాట్లాడుతూ.. తాము మూడు తరాలుగా ఈ పాత్రలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. విదేశీ సందర్శకులకు తమ డైనింగ్ టేబుల్‌లపై భారతదేశ రుచిని అందించడమే తమ లక్ష్యం అని చెప్పారు. ఈ పాత్రలు జైపూర్, ఉదయపూర్, వారణాసి, కర్నాటకలో కళాత్మకంగా రూపొందించినట్లు చెప్పారు.