I.N.D.I.A. కూటమి నిర్ణయంపై ఎన్బీడీఏ మండిపాటు, ఎమర్జెన్సీ తలపిస్తోందని వ్యాఖ్య
I.N.D.I.A. కూటమి నిర్ణయంపై న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 14 మంది యాంకర్లు నిర్వహించే షోలకు...తమ ప్రతినిధులను పంపమని ప్రకటించడాన్ని తప్పుపట్టింది.
I.N.D.I.A. కూటమి నిర్ణయంపై న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 14 మంది యాంకర్లు నిర్వహించే చర్చలు, కార్యక్రమాలు, షోలకు...తమ ప్రతినిధులను పంపమని ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ యాంకర్లు పక్షపాతంగా వార్తాప్రసారాలు సాగిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తునారని, అందుకే వీరు నిర్వహించే కార్యక్రమాలకు, షోలకు తమ ప్రతినిధులను పంకూడదని కలసికట్టుగా నిర్ణయం తీసుకున్నాయి.
జాతీయ స్థాయిలో పేరున్న ఛానెల్స్ లో యాంకర్లు నిర్వహించే షోలను బహిష్కరించింది. మీడియా స్వేచ్ఛను అపహాస్యం చేసేలా I.N.D.I.A. కూటమి వ్యవహరిస్తోందని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ అభిప్రాయపడింది. సదరు యాంకర్ల నిర్వహించే షోలను బహిష్కరించడం, ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నాయని విమర్శించారు. I.N.D.I.A. కూటమి...యాంకర్ల బాయ్ కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
సెప్టెంబర్ 13న జరిగిన ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ కొందరు యాంకర్లను బాయ్ చేయాలని నిర్ణయించింది. ఆయా జర్నలిస్టుల పేర్లను కూడా వెల్లడించింది. గత తొమ్మిదేళ్లుగా కొన్ని ఛానెళ్లు, వార్తా వేదికలు విద్వేషాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించింది. యాంకర్లపై తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంది. అటు ఆప్ కూడా జర్నలిస్టుల పేర్లతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. అదితి త్యాగి, అమన్ చోప్రా, అమీష్ దేవ్‌గన్ ఆనంద్ నరసింహన్, అర్ణబ్ గోస్వామి, అశోక్ శ్రీవాస్తవ్, చిత్ర త్రిపాఠి, గౌరవ్ సావంత్, నవికా కుమార్, ప్రాచి పరాషర్, రుబికా లియాఖత్, శివ్ అరూర్, సుధీర్ చౌదరి, సుశాంత్ సిన్హా ఈ జాబితాలో ఉన్నారు.
విపక్ష కూటమి నిర్ణయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఎమర్జెన్సీతో పోల్చారు. ఇటువంటి పరిస్థితులు కేవలం ఎమర్జెన్సీ కాలంలోనే చూశామన్నారు. నిరాశతోనే విపక్ష కూటమి ఇటువంటి చర్యలకు దిగుతోందన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. అయితే, విపక్షాల చర్యను తీవ్రంగా ఖండించిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ .. ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించింది. ప్రతిపక్షాలు మీడియాను రాజకీయం చేస్తున్నాయని ఆరోపించిన ఎన్‌యూజే.. ఇది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.