Ayodhya Darshan Rules : అయోధ్య రామమందిరం దర్శనం టైమింగ్స్, పాటించాల్సిన నియమాలు
Ayodhya darshan Timings : ఆ బాలరాముడిని దర్శించుకోవాలంటే ఏ నియమాలు పాటించాలి? దర్శనం టైమింగ్స్ ఏంటి? ఎలా వెళ్లాలి అన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Ayodhya darshan Timings : అయోధ్య.. ప్రతి హిందూవు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే ప్రదేశం. రామజన్మభూమి అయిన ఆ పవిత్ర ప్రదేశాన్ని చూసి, తరించాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే, ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది. అయోధ్యలో సర్వాంగసుందరంగా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. ఆ బాలరాముడు భక్తుల కోసం కొలువయ్యాడు. ఇక జనవరి 23 నుంచి ఆలయ దర్శనానికి సామాన్య భక్తులను అనుమతిస్తున్నట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ చెప్పారు. ప్రతి రోజు దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు. మరి ఆ బాలరాముడిని దర్శించుకోవాలంటే ఏ నియమాలు పాటించాలి? దర్శనం టైమింగ్స్ ఏంటి? ఎలా వెళ్లాలి అన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
27 నుంచి వస్తే మంచిది..
జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠాపన నిర్వహించిన తర్వాత.. మరుసటి రోజు నుంచే సామాన్య భక్తులను అనుమతిస్తారు. కానీ, ఆలయ ట్రస్ట్ సభ్యులు మాత్రం.. రద్దీ దృష్ట్యా, వీఐపీల తాకిడిని మనసులో పెట్టుకుని ఈ నెల 27 నుంచి దర్శనానికి వస్తే మంచిదని సూచిస్తున్నారు. ఇక దర్శనానికి సంబంధించి ఆలయంలో ఉచిత ప్రవేశ దర్శనం కల్పిస్తున్నారు. అయితే, స్పెషల్ దర్శనం కావాలనుకునేవాళ్లు ముందుగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ ఆన్‌లైన్‌లో తీర్థక్షేత్ర వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు లేదా ఆఫ్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. అయితే, దీనికి సంబంధించి ఇంకా టికెట్లను రిలీజ్ చేయలేదు. ఇక దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడికి ఉచిత ప్రసాదం ఉంటుంది.
దర్శనం టైమింగ్స్ ఏంటి?
రామయ్యను దర్శించుకోవాలంటే నిర్ణిత టైమింగ్స్ ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. అయితే.. పండుగలు, స్పెషల్ రోజుల్లో మాత్రం టైమింగ్స్‌లో మార్పులు ఉంటాయి. ఇక స్వామివారికి రోజుకి మూడు హారతులు ఇస్తారట. ఉదయం 6:30 గంటలకు శృంతార్ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, సాయంత్రం 7.30 గంటలకు సంధ్యాహారతి ఉంటుంది. ఇక ఈ హారతుల్లో పాల్గొనాల్సిన వాళ్లు కూడా ప్రత్యేకంగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
పాటించాల్సిన నియమాలు
రామమందిరంలోకి వెళ్లే భక్తులు కచ్చితంగా సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలి. పురుషులు అయితే ధోతీ, కుర్తా - పైజామా వేసుకోవాల్సి ఉంటుంది. మహిళలు అయితే.. చీర లేదా సల్వార్, చుడీదార్ వేసుకోవాలి. దుపట్టా కచ్చితంగా వేసుకోవాలి. ఆలయంలోకి సెల్‌ఫోన్ అనుమతిలేదు. పర్సులు, హ్యాండ్‌బ్యాగ్స్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఆలయంలోకి తీసుకెళ్లకూడదు. గొడుగులు, బ్యాంకెట్లు, గురుపాదుకలు లాంటి వస్తులువు కూడా ఆలయంలోకి నిషేధం అని ట్రస్ట్ ప్రకటించింది.
ఎలా చేరుకోవచ్చు..
రామయ్యను దర్శించుకునేందుకు మనం మూడు మార్గాల్లో అయోధ్య చేరుకోవచ్చు. రోడ్డు, రైలు, ఫ్లైట్ ద్వారా చేరుకోవచ్చు. అయోధ్య రామమందిరం నిర్మాణంతో పాటే.. అక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కూడా జరిగింది. అయోధ్యలోని విమానాశ్రయం పేరు వాల్మీకి. ఇటీవల ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆ విమానాశ్రమాన్ని ప్రారంభించారు. ఇక అయోధ్య రైల్వే జంక్షన్‌ని కూడా ఇటీవ ప్రారంభించారు. దీంతో రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో అయోధ్యను చేరుకోవచ్చు. కాగా.. ఇటీవలే ఆయా విమాన సంస్థలు అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్లు నడుపుతున్నట్లు ప్రకటించాయి. అయితే, ప్రస్తుతానికి అవి బెంగళూరు నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కూడా విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి అయోధ్యకు నేరుగా రైళ్లను నడుపుతోంది ఇండియన్ రైల్వే.
Also Read: రామమందిర నిర్మాణం.. 20- 25 కోట్లు పెరగనున్న యూపీ ఆదాయం