Heavy Rains: ఉత్తర భారతదేశంలో దంచికొడుతున్న వానలు - వరదలు, కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి
Heavy Rains: ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడడం, వరదలు రావడంతో ఇప్పటికే 19 మంది మృతి చెందారు.
Heavy Rains: ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడడం, పెద్ద చెట్లు పడడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలా జరిగిన ప్రమాదాల్లో మొత్తం 19 మంది చనిపోయారు. భారీ వర్షాలు కారణంగా ఢిల్లీలోని యమునాతో సహా చాలా నదులు పొంగిపొర్లుతున్నాయి. అనేక నగరాలు, పట్టణాలలో రికార్డు స్థాయిలో వానలు పడుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోడ్లన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. ముంపునకు గురైన రోడ్లపై వాహనాలు తేలియాడుతున్నాయి. ఇళ్లల్లోకి బురద నీరు రావడం, నదుల పక్కనే ఉన్న అనేక దేవాలయాలు మునిగిపోవడం వంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లలో పెద్ద ఎత్తున వానలు పడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరికలు జారీ చేసింది.
153 మిల్లీ మీటర్ల వర్షం..!
1982 తర్వాత జులై నెలలో ఒకే ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఢిల్లీలో ఇదే ప్రథమం అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. యమునా నీటి మట్టం పెరిగిందని.. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆదివారం రాత్రి 8:30 వరకు ఢిల్లీలో 153 మిల్లీ మీటర్ల వర్షం పడగా, చండీగఢ్, హర్యానాలోని అంబాలాలో వరుసగా 322.2 మిమీ, 224.1 మిమీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. భారీ వర్షాలు ఉన్నందున ఢిల్లీలోని పాఠశాలలు, దాని పక్కనే ఉన్న గురుగ్రామ్, నోయిడాలోని పాఠశాలలు సోమవారం మూసివేశారు. ఘజియాబాద్‌లో వర్షాల కారణంగా మరో రెండు రోజులు పాఠశాలలు మూసివేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 'కన్వర్ యాత్ర' కారణంగా జూలై 17వ తేదీ వరకు మూసివేయనున్నారు. రైల్వే సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి. దాదాపు 17 రైళ్లను రద్దు చేశామని, మరో 12 రైళ్లను దారి మళ్లించామని, వరదలు కారణంగా నాలుగు చోట్ల ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు ఉత్తర రైల్వే తెలిపింది.
Visuals of a flash flood hitting Thunag area of Himachal Pradesh's Mandi district.
— Press Trust of India (@PTI_News) July 10, 2023
Amid incessant rainfall lashing the hill state, Solan received 135 mm of rain on Sunday, breaking a 50-year-old record of 105 mm of rain in a day in 1971, while Una received the highest rainfall… pic.twitter.com/Tl1iM6poVc
50 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఆదివారం 135 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1971లో ఒక రోజులో 105 మిల్లీమీటర్ల వర్షపాతం అనే 50 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఉనాలో 1993 తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైందని సిమ్లా వాతావరణ శాఖ డైరెక్టర్ సురేందర్ పాల్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని 10 జిల్లాలకు అత్యంత భారీ వర్షాల రెడ్ అలర్ట్ జారీ చేశారు. మొత్తం ఈ రాష్ట్రంలో మూడు కొండచరియలు విరిగిపడగా.. ఐదుగురు మరణించారు. సిమ్లా జిల్లాలోని కోట్‌ఘర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, కులు మరియు చంబా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. సిమ్లా నగర శివార్లలోని రాజహనా గ్రామంలో, వర్షపు నీటికి భారీ మొత్తంలో చెత్తాచెదారం తన ఇంటిపై పడటంతో బాలిక అదే ఇంట్లో ఉండిపోయి ప్రాణాలు కోల్పోయింది.
హిమాచల్ ప్రదేశ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. గత 36 గంటల్లో పద్నాలుగు పెద్ద కొండచరియలు విరిగి పడినట్లు తెలిపారు. అలాగే 13 చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయని.. ఈ కారణంగానే మొత్తం 700 రోడ్లు మూసివేశామని వివరించారు. పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో, రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై గులార్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్తున్న వాహనాన్ని బండరాళ్లు ఢీకొట్టగా ఈ జీప్ నదిలో పడిపోయి.. మొత్తం ముగ్గురు యాత్రికులు గంగలో మునిగిపోయారు. ప్రమాద సమయంలో జీపులో 11 మంది ఉన్నారని రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, పోలీసు అధికారులు వివరించారు. ఇందులో ఐదుగురుని రక్షించామని, మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే మూడు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసినట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని కాశీపూర్ ప్రాంతంలో రెండు ఇళ్లు కూలి దంపతుల మృతి చెందగా, వారి మనవరాలు గాయపడింది. ఉత్తరకాశీ జిల్లా బార్‌కోట్‌లో యమునోత్రి జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిర్వహణలో నిమగ్నమై ఉన్న ఒక పోలీసు కొండపై నుండి దొర్లిన బండరాయి ఢీకొని మరణించాడు. జమ్మూ కాశ్మీర్‌లో దోడా జిల్లాలో ప్రయాణీకుల బస్సును కొండచరియలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలో లేహ్-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి ఉన్న కొండపై నుంచి పడిపోయిన బండరాయి కింద వాహనం నలిగిపోవడంతో ఒక వ్యక్తి మరణించాడు. కేంద్ర పాలిత ప్రాంతంలోని పూంచ్ జిల్లాలో శనివారం డోగ్రా నల్లా దాటుతుండగా ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన ఇద్దరు సైనికుల మృతదేహాలను వెలికితీశారు.
భారీ వర్షాల నుంచి శ్రీనగర్‌లో కొంత ఉపశమనం లభించింది. మూడు రోజుల పాటు నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. పంజ్‌తర్ని, శేషనాగ్ బేస్ క్యాంపుల నుంచి ఆదివారం నాడు అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి యాత్ర తిరిగి ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్‌తోపాటు లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాల నుంచి మంచు కురుస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. నదులు, వాగుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోందన్న నివేదికలతో దిగువ పరివాహక ప్రాంతాలతోపాటు జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితిలోని చంద్రతాల్‌లో దాదాపు 200 మంది ప్రజలు చిక్కుకుపోయారు. చండీగఢ్ - మనాలి హైవేలో కొంత భాగం బియాస్ నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాలలోని గ్రామాలకు రహదారి మార్గంలో చేరుకోలేని విధంగా మారాయి.