చక్కెర వ్యాపారులకు కేంద్రం కీలక ఆదేశాలు, 17 లోపు స్టాక్ వివరాలివ్వండి
కేంద్ర ప్రభుత్వం చక్కెర వ్యాపారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చక్కెర వ్యాపారం చేస్తున్న చట్టబద్ధ కంపెనీలన్నీ ఈ నెల 17లోగా, స్టాక్ వివరాలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం చక్కెర వ్యాపారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చక్కెర వ్యాపారం చేస్తున్న చట్టబద్ధ కంపెనీలన్నీ ఈ నెల 17లోగా, స్టాక్ వివరాలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని సంస్థల వద్ద పెద్ద మొత్తంలో నివేదించని చక్కెర నిల్వలు ఉన్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ షుగర్ అండ్ వెజిటెబుల్ ఆయిల్ గుర్తించినట్లు ఆహార శాఖ తెలిపింది. గత నెలలోనే నిల్వ వివరాలు ఇవ్వాలని ఆదేశించినా పలు సంస్థలు పట్టించుకోలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. టోకు, రిటైల్ వ్యాపారులతో పాటు ప్రాసెసర్లు సైతం చక్కెర నిల్వల వివరాలను ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
తగ్గిన సాగు విస్తీర్ణం
ఈ ఏడాది చెరకు సాగు విస్తీర్ణం తగ్గడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో చక్కెర ధరలు భారీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ లో చక్కెర ధరలు పెరగకుండా, నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఆయా సంస్థలు తమ వద్ద ఉన్న చక్కెర నిల్వ వివరాలను ఎప్పటికపుడు తెలియజేయడం లేదని, నిల్వ వివరాలన్నింటినీ వెంటనే వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతివారం వివరాలను సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. మంగళవారం లోపు నిల్వ వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉండాలని, లేదంటే జరిమానాలు, కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
ఇప్పటికే బాస్మతియేతర బియ్యంపై ఆంక్షలు
బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టన్ను ధర 1200 డాలర్లకంటే తక్కువ ఉన్న బియ్యాన్ని ఎగుమతి చేయడంపై నిషేధం విధించింది. బాస్మతి పేరుతో చట్టవిరుద్ధంగా ఇతర బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంది, దీంతో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. టన్ను బాస్మతి బియ్యం విలువ 1200 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఎగుమతికి అంగీకరించనుంది. విదేశీ వాణిజ్య విధానం ప్రకారం, బాస్మతి బియ్యం ఎగుమతి ఒప్పందాలకు సంబంధించి ఏపీఈడీఏ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ కమ్ అలోకేషన్ ధ్రువపత్రాన్ని మంజూరు చేస్తారు. అప్పుడే ఎగుమతి సాధ్యపడుతుంది. అయితే ఇప్పటికే ఎగుమతి ఒప్పందాలు జరిగి ఉంటే వాటిని రద్దు చేయాలని కేంద్రం ఆదేశించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ భారత్ 45.6 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. దీని విలువ దాదాపు 4.8 బిలియన్ డాలర్లు. అలాగే 177.9 లక్షల టన్నుల బాస్మతియేతర బియ్యాన్ని ఎగుమతి చేసింది. దీని విలువ 6.36 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
దేశీయంగా బియ్యం సరఫరా పెరుగుతుందని, పండగల సీజన్ కూడా వస్తున్నందున వీటి ధరలను అదుపులోకి తీసుకురావచ్చని భావిస్తోంది. అయితే, బాస్మతి, ఉప్పుడు బియ్యం రకాలకు ఈ ఆంక్షలు వర్తించవని, వాటి ఎగుమతులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. మన దేశ బియ్యం ఎగుమతుల్లో బాస్మతియేతర తెల్ల బియ్యం వాటా 25శాతంగా ఉంటోంది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, పాలిష్ చేయని తెల్ల బియ్యం ఎగుమతులపై తాజా నిషేధం వర్తిస్తుంది.